Homeమండలి ఉద్రిక్తం

మండలి ఉద్రిక్తం

- Advertisement -

. లడ్డూ అంశంపై మాటల యుద్ధం
. ఆవేశంతో ఊగిపోయిన అధికార, ప్రతిపక్ష సభ్యులు
. జగన్‌పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ నిరసన
. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశంపై శాసన మండలి దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కల్తీ నెయ్యి పాపం మీదంటే మీదే నంటూ పరస్పర ఆరోపణలతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో చైర్మనం పోడియం ముందుకు టీడీపీ, వైసీపీ సభ్యులు దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల విరామం అనంతరం రాష్ట్ర శాసన మండలి సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం లడ్డూపై చర్చకు చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అనుమతించారు. వైసీపీ సభ్యులు మాట్లాడటానికి ముందుగా ప్రభుత్వ పరంగా ప్రకటనకు అనుమతించాలని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ పట్టుబట్టారు. ఇదే సమయంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన ప్రకటనను చదివేందుకు సీటులో లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా కొన్ని శాసన చట్టాలను చైర్మన్ దష్టికి తీసుకురాగా… అవి ఈ చర్చకు సరిపోవంటూ వైసీపీ సభ్యులకు అవకాశం ఇచ్చారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి లడ్డూపై చర్చను ప్రారంభిస్తూ…సీఎం చంద్రబాబుపైన విమర్శనాస్త్రాలు సంధించారు. హెరిటేజ్‌కి ఇందాపూర్ డెయిరీకి సంబంధాలున్నాయని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒక్కసారిగా టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సభ్యులు ప్రతి వ్యాఖ్యలు చేస్తూ… చర్చకు సంబంధంలేని అంశాల్ని మండలిలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహాగా చర్చ కొనసాగడం సాంప్రదాయం కాదంటూ పదేపదే తమ సీట్లలో నుంచి లేచి అభ్యంతరం చెప్పారు. వైసీపీ సభ్యులూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా…ఈ గందరగోళం నడుమే చంద్రశేఖర్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. కాగా ప్రభుత్వం తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై శాసనమండలిలో ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసింది. 20 పేజీల సమగ్ర ప్రకటనలో నెయ్యికల్తీపై వివరాలను స్పష్టంగా వెల్లడించింది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ నెయ్యి సరఫరా నిబంధనలు సడలించి అక్రమాలకు పాల్పడింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ హయాంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, టెండర్ నిబంధనలు మార్చుతూ అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతకం చేశారన్నారు. నెయ్యి కల్తీ జరిగిందని జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ స్పష్టంగా నివేదిక ఇచ్చిందని, భయంకరమైన రసాయనాలతోసహా జంతు కొవ్వు కలిసిందని నివేదికలో ఇచ్చినట్లు తెలిపారు. వ్యవస్థీకత నేరం చేసి జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బుకాయిస్తున్నారన్నారు. ఇది కుంభకోణమే కాదు హిందూత్వంపై దాడి అని ధ్వజమెత్తారు. అలానే వైఎస్సార్సీపీ నాయకులు హెరిటేజ్ సంస్థకు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఆనం వర్సెస్ ఎమ్మెల్సీ తూమాటి
మరో వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రసంగిస్తూ…చేతి వేలును అధికార సభ్యుల వైపు చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. తన సీటులో నుంచి పోడియం వద్దకు కదిలారు. దానిపై మంత్రి ఆనం అతడికి ఎదురుగా వెళ్లేందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో
ఇరుపక్షాల ఎమ్మెల్సీలు బృందాలుగా ఏర్పడి ఎదురెదురుగా దూసుకెళ్లారు. చివరకు మంత్రులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఆ తర్వాత మరో వైసీపీ సభ్యుడు మాట్లాడుతూ టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. వారికి మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు, లోకేశ్ వరుస వారీగా ఘాటుగా బదులిచ్చారు. దీంతో మండలిలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలేం జరుగుతోందో తెలియని గందరగోళం ఏర్పడింది.
తప్పు చేసిన వారిని దేవుడు క్షమించబోరు: మంత్రి లోకేశ్
దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని, తిరుమల లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని దేవుడు క్షమించబోరని మంత్రి లోకేశ్ అన్నారు. మండలిలో మంత్రి లోకేశ్ లేచి…చర్చకు సంబంధంలేని అంశాలను వైసీపీ సభ్యులు తీసుకురావడం తగదన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర పెరిగిందనీ, వారు చేసినట్లు మేమూ కల్తీ చేసి నెయ్యి వాడాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు…తక్షణమే వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన
లడ్డూ చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీ నాయకుడు వైఎస్ జగన్, మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు’ ఇద్దరూ క్రిష్టియన్లు అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై చైర్మన్ మోషెన్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ…తాను క్రిస్టియన్ కాదని, తాను హిందువునని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడంతోపాటు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ సభ్యుడు డిమాండ్ చేశారు. దీంతో శాసన మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తాను మండలి చైర్మన్ క్రిస్టియన్‌ను అనుకున్నానని, ఆయన తాను హిందువునని చెప్పారని…అందుకు నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, అదే సమయంలో తప్పయిందని ఒప్పుకుంటున్నానని మండలి చైర్మన్‌కు తేల్చిచెప్పారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నప్పటికీ..ఆయన జగన్‌పై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి పెద్దఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ సభ్యులపై విమర్శలు గుప్పించారు. జగన్‌పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్ని విరమించాలంటూ చైర్మన్ పోడియం ఎక్కి వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో మండలిని ఒకసారి చైర్మన్ వాయిదా వేశారు. తిరిగి మొదలైన తర్వాత కూడా జగన్‌కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పోడియం ఎక్కి నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ‘జగన్‌ను నేను క్రిస్టియన్ అని అన్నానని, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాదని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. ‘టీవీలో చూసి ఉంటారు కదా జగన్… కాదని చెప్పమనండి’ అని మంత్రి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబంతో తిరుమల దర్శనానికి ఎందుకు రాలేదని నిలదీశారు. వైసీపీ సభ్యులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి గందరగోళం ఏర్పడటంతో మండలిని గురువారానికి వాయిదా వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు