విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : శాసన మండలి చైర్మన్‌పై అవిశ్వాస అస్త్రానికి కూటమి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదీ వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలతోనే వ్యూహాత్మకంగా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు లీక్‌లు వస్తున్నాయి. తాజాగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఓ పత్రికలోను ఈ విషయం వెల్లడి కావడంతో ఆ ప్రచారానికి కాస్త బలం చేకూరుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీతకు ఆ పార్టీ అధినేత జగన్ అవకాశం కల్పించారు. వారిలో కొందరు ఎన్నికల సమయంలోను, మరికొందరు కూటమి అధికార పగ్గాలు చేపట్టాక వైసీపీని వీడారు. దాదాపు అందరూ టీడీపీ గూటికి చేరిన వాళ్లే. వారంతా మండలి సమావేశాల్లోను టీడీపీ సభ్యులకు వంత పలుకుతూ, వారి వెనకుండి నినాదాలు చేస్తున్నారు. దీంతో వైసీపీ … వారిపై చర్యలు తీసుకోవాలంటూ చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతÅ£ముందు నుంచే తమ రాజీనామాలు ఆమోదించాలంటూ అనేక సార్లు చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజును కలిసి విన్నవించారు. జయమంగళ వెంకటరమణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా ఇంతవరకు వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించలేదు. ఇటీవల ఫిరాయించిన ఈ వైసీపీ ఎమ్మెల్యేýపై చైర్మన్ నోటీసులు జారీజేసి విచారణ ప్రారంభించారు. దీంతో వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పనిలో పనిగా ఈ ఎమ్మెల్సీలంతా కూటమిలోని ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ సభ్యుల వెంటే ఉండి మద్దతిస్తున్నారు. వైసీపీ సభ్యుల తీరును ఎండగడుతున్నారు. ఎన్ని చేసినప్పటికీ… చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించకపోవడంతో ఆయనపై వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మండలిలో కూటమి తరపున సభ్యుల బలం క్రమేపీ పెరుగుతోంది. దాన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ రెబల్స్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టవచ్చన్న ప్రచారముంది.


