Friday, March 6, 2026
Homeసాహిత్యంమనో సముద్రతీరం…మెరీనా

మనో సముద్రతీరం…మెరీనా

- Advertisement -

చింతపట్ల సుదర్శన్
సెల్: 9299809212

ఇంచుక వాస్తవికత కలిగిన కల్పిత ప్రబంధం కథ అన్నాడు సి.పి.బ్రౌన్. లోకంలో తిరిగితే కానీ కథ రాదు అని వాకాటి పాండురంగారావుగారు అభిప్రాయపడ్డారు. మనకు తెలిసిన విషయాన్నే తిరిగేసి చూస్తే కొత్తకథ అవుతుంది అన్నాడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. హదయగత కల్లోలాన్ని విషాదాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేశాను నా కథల్లో అంటాడు ఫణిహారం వల్లభాచార్య. చిరకాలం వివిధ పత్రికల్లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా అక్షర సేద్యం చేసిన వల్లభాచార్య ఇటీవల ప్రచురించిన కథాసంపుటి మెరీనా…ఓ మెరీనా. పదిహేను కథలున్న ఈ కథావేదికలో ఆయన 1991 నుంచి 97 వరకు రాసినవి 11 కథలు. 2002 తర్వాత 2022/ 24 లలో రాసిన కథలు 5 ఉన్నవి. కథల రచనా కాలంలో ఎంతో వ్యవధి ఉండడమేకాక దాదాపు 35 సంవత్సరాల కింద ఆరంభమైన కథలు ఈ సంపుటిలో ఉండడం వల్ల సాధారణంగా నవ్యతకు వర్తమానత్వానికి సంబంధించిన సందేహాలు రావచ్చు. కానీ కొన్ని కథలు కలానికి అతీతంగా సార్వజనీనంగా ఉండిపోవడం అన్న లక్షణాలని కలిగి ఉంటాయి అనడానికి సందేహించనక్కర్లేదు. అలాంటి కథలే మెరీనా కథలు.
ఏకబిగిన చదివించడం, అనుభవాన్ని, అనుభూతిని అందించడంతో పాటు ఆలోచనల్ని రేకెత్తించడం చాలాకాలం వరకూ వెంటాడుతూ ఉండటం మంచి కథల లక్షణమైతే ఆ లక్షణాలు ఉన్న కథలే ఇవి. ఈ సంపుటిలో సామాజిక అంశాలు ఉన్న కథలు ఏడు. మనస్తత్వ సంబంధమైన అంశాలున్న కథలు రెండు. పౌరాణిక అంశాలున్న కథలు నాలుగయితే, ఫాంటసీ, చైతన్య స్రవంతి కథలు ఒకటొకటి. ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం ఈ కథల వైరుధ్యాన్ని తెలియచెయ్యడానికే. ఈ కథలు రొటీన్‌గా లేవని ఒక్కో కథ తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నదనే అంశాన్ని ఎత్తి చూపడానికే.
సామాజిక అంశాలను కథా వస్తువుగా కలిగి ఉన్న కథల్లో మొట్ట మొదటిది మెరీనా…ఓ మెరీనా. ఏదైనా ఒక లక్ష్యం నెరవేరితే ఆ విషయం ఇంక మామూలుదైపోతుంది అన్నది అండర్ కరెంట్‌గా ఉండే ఈ కథలో సముద్రం పట్ల ఒక స్త్రీకి ఉన్న భావావేశం ఎఫినిటీని, సముద్రం పట్ల ఒక స్త్రీకి ఆ స్త్రీ తనదైన తర్వాత ఆమె భర్తకు సముద్రం పట్ల ఏర్పడే నిరాసక్తతని, ఆమె పాషన్ పట్ల తణీకారాన్ని ఈ కథలో చూస్తాం. కథాంశం సాధారణమైనదే అయినా కథనం మాత్రం మంత్రముగ్దుల్ని చేస్తుంది. సముద్రపు ఘోషతో మొదలయ్యే ఈ కథ ఆరంభ వాక్యాలు ‘శత సహస్రాబ్దాల రసగానంలో ఏ క్షణాన ఏ విరసుడి పెళుసుమాట ఉప్ప్పుగల్లుగా పడిందోగానీ బతుకంతా ఉప్పగా మారిపోయి బడబానలాన్ని పండించు కుంటూ నిరంతరం ఘోషిస్తూ ఎగసిఎగసి పడుతోంది సముద్రం’ రచయితకు భాషపట్ల ఉన్న ప్రామాణికతని తెలియచేస్తవి. పార్థసారథీ! పారిఫో!, నాయనమ్మ చీర, నాకేవిటట, పోలీసు భయం, ఋణవిముక్తి, వానలోన అనే కథలు మన నిత్య జీవితానుభవాలకు సంబంధించినవే.
మెరీనాలో వైవిధ్యానికి ఉదాహరణగా నిలిచే కథలు సాక్షాత్కారం, అందమే ఆనందం. ఈ రెండు కథల్లో మనస్తత్వ విశ్లేషణ కథ. సాక్షాత్కారం కథలో రామకష్ణ తాను ఎవరో తెల్సుకుంటాడు. మనిషి ఆకారానికి పేర్లు, ఊర్లు, ఉద్యోగాలు ఉంటయికాని, సమస్త సుఖదుఃఖాలలో రూపంలేదు, కులం లేదు…మతంలేదు…దేశమూలేదు…స్థలకాల పరిథులు లేవు! సమస్త మానవాళి స్పందనలూ ఎక్కడైనా, ఎప్ప్పుడైనా ఒకటే అని అర్థం చేసుకున్న రామకష్ణ ‘నేను మనిషిని’ అని తెల్సుకోవడం ఈ కథకు ముగింపు. మనస్తత్వం, ఆధ్యాత్మికల సమ్మేళనం ఈ కథ. ఇలాంటి కథే ఆనందమే అందం. అందం ఆకారంలో లేదు, నిజమైన అనుబంధంలో ఉంది. అది అనుభవానికి అందదు, అనురాగానికి తప్ప అని విపులీకరించే ఈ కథలోని తాత్వికత అసాధారణమైనది. ‘జీవితం శాశ్వతమే. అదో ప్రవాహం ఈ మహాప్రవాహంలో ప్రవేశించి జలకాలాడి వెళ్లిపోతాం. దాన్ని ఎంత పరిమళ భరితం చేస్తున్నాం, ఎంత సౌందర్యవంతం చేస్తున్నామన్నదే ప్రశ్న! వంటి అనేక వాక్యాల ‘నిధి’ ఈ కథ.
పౌరాణిక కథాంశాలను పునర్‌వ్యాఖ్యానించడం, వాటిలో దాగున్న సత్యాల్ని అన్వేషించడం మెరీనా కథల్లోని మరో విభిన్న అంశం. ఛిన్నమస్త, వందేజగద్గురుమ్, ధర్మమూర్తి, తండ్రి ఇచ్చిన వరం ఈ కోవకు చెందిన కథలు. వీటిలో తప్పక ప్రస్తావించాల్సిన కథ ‘ధర్మమూర్తి’.
ఈ కథ భద్రాచల క్షేత్రంలో, గర్భగుడిలో జరుగుతోంది. అర్చకులు గుడి ద్వారాలు బంధించి వెళ్లిపోయేక రామచంద్రమూర్తి, జానకీదేవి, లక్ష్మణస్వామి, భరతశతఘ్నులు విగ్రహాలుగా కాక సజీవులుగా మాట్లాడుకునే సందర్భాన్ని కథకుని ఊహాజగత్తు మన కళ్లముందు ఉంచుతుంది. ఆ సమయంలో పన్నెండేళ్లుగా గోలకొండ రాజు తానీషా బందిఖానాలో ఉన్న కంచర్ల గోపన్న గొంతు…దీనంగా, ఆర్తిగా వారికి వినిపిస్తుంది. రామదాసు తన కీర్తనలో ప్రాకారాల నిర్మాణానికి, సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి, లక్ష్మణునికి చేయించిన ముత్యాల పతకానికి ఇలా తను చేయించిన నగలకు అయిన ఖర్చులు చెప్తూ చివరికి ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్రా అని నిష్టురమాడి మళ్లీ సర్దుకుని “నను బ్రోవమని చెప్పవే’ అని జానకిని బతిమాలుకుంటాడు. గోపన్న తహసీల్దారు. ప్రజల నుంచి సేకరించిన సుంకాలను రాజుకు అప్పచెప్పకుండా తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించాడు అంటూ రామచంద్రమూర్తి శిక్షాకాలం పూర్తయి మళ్లీ గోపన్నకు శిక్ష పెరగకుండా ఉండటానికి లక్ష్మణునితో కల్సి వెళ్లి తానీషాకు అప్ప్పు చెల్లిస్తానంటాడు. రాజ ధర్మాన్ని నిర్వహించిన తానీషాను ప్రశంసిస్తాడు. ఎంతో ఆసక్తికరంగా ఉండే కథనం, ఈ కథను మళ్లీమళ్లీ చదివిస్తుంది.
మెరీనాలో అత్యంత ఆధునిక కథగా నిలుస్తుంది అంతరంగం. ఒక వ్యక్తి ఉదయం లేచిన దగ్గర్నించి రాత్రి పడుకునే వరకూ జరిగే విషయాలను ఆలోచన్ల వేగంతో నడిపించే ఈ కథలో ‘చైతన్య స్రవంతి’ కథనం సమర్థవంతంగా నిర్వహించబడింది.
కథ వెనుక కథ, వల్లభాచార్య కథాసంపుటిలో మరొక వినూత్నమైన అంశం. ప్రతి కథ చివర కథకుడు ఆ కథను ఎంచుకోవడానికి కారణం ఏమిటో, రచయిత ఏ అంశాలకు స్పsదించడం వల్ల ఆ కథ రాయడం జరిగిందో తెలియ చేస్తాడు. ఇది చదువరికి రచయితల మేధోమథనాన్ని ఆసక్తికరంగా తెలిపే విషయం. తెలుగు భాషాసౌందర్యాన్ని, వాక్య విన్యాసాన్ని కథన వైశిష్ట్యాన్ని మెరీనా…ఓ మెరీనా అందిస్తుంది.
బాపుగారి ముఖచిత్రం, కూచిగారి కవర్ డిజైన్ ప్రతి కథకూ ఇలస్ట్రేషన్ మెరీనాకు అదనపు సొగసులు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు