Homeఅంతర్జాతీయంమాది ప్రత్యేక బంధం

మాది ప్రత్యేక బంధం

- Advertisement -

. బాహ్య ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదు`అవమానిస్తే సహించదు
. ట్రంప్‌ విధానాలు అమెరికాకు చేటు: సోచి సదస్సులో పుతిన్‌

మాస్కో: తమ దేశానికి, భారతదేశానికి మధ్య బంధం ప్రత్యేకమైనదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. భారత్‌కు వాణిజ్య ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బాహ్య ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గబోదని, అవమానిస్తే సహించదని పుతిన్‌ వక్కాణించారు. తమ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా సుంకాలతో ప్రపంచ దేశాలపై రెచ్చిపోతుండటాన్ని తప్పుపట్టారు. డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో అమెరికాకే నష్టమన్నారు. మాస్కోతో న్యూదిల్లీకి ప్రత్యేక బంధం ఉందన్నారు. సోవియట్‌ కాలం నుంచే సత్సంబంధాలు కొనసాగుతున్నాయని దక్షిణ రష్యా, సోచిలోని వాల్దై డిస్‌కషన్‌ క్లబ్‌లో మాట్లాడిన సందర్భంగా పుతిన్‌ అన్నారు. ఈ సదస్సులో 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే ప్రపంచంలోని ఇంధన ధరలపై ప్రభావం పడుతుందని పుతిన్‌ హెచ్చరించారు. అలాంటి చర్య యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచేస్తుందని, దాంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్నారు. భారత్‌`రష్యా మధ్య ఎన్నడూ ఎలాంటి సమస్య లేదని చెప్పారు. సోవియట్‌ యూనియన్‌ కాలం నుంచే తమ మధ్య ఘర్షణలు లేవన్నారు. తమ దేశాల మధ్య రాజకీయ, దౌత్య, సాంస్కృతిక, మానవీయ బంధాలు బలంగా ఉన్నాయన్నారు. భారతీయ సంస్కృతిపై రష్యన్లు ఆదరిస్తారని చెప్పారు. భారత్‌తో కృత్రిమ మేధ (ఏఐ) భాగస్వామ్యానికి సిద్ధమని చెప్పారు. మరిన్ని వ్యవసాయ, ఔషధ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని పుతిన్‌ అన్నారు. అమెరికా మార్కెట్‌కు యురేనియం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అదే సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, తమ దేశానిది మేకపోతు గాంభీర్యమన్న ట్రంప్‌ వ్యాఖ్యలను పుతిన్‌ తోసిపుచ్చారు. ‘యూరప్‌లో పెరుగుతున్న రక్షణాత్మక చర్యలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. రష్యా యుద్ధం చేస్తున్నది ఉక్రెయిన్‌తో కాదు నాటోతో అని, తమను ‘పేపర్‌ టైగర్‌’గా ట్రంప్‌ పిలుస్తున్నారని, అప్పుడు నాటో ఏమిటో ఆయన చెప్పాలని పుతిన్‌ చురకలు అంటించారు. రష్యా ప్రజలకు భారతీయ సినిమా ఎంతో ఇష్టమని, ఈ చిత్రాలను నిరంతరం ప్రసారం చేసే టీవీ ఛానల్‌ రష్యాలో ఉందన్నారు. గతేడాది బ్రిక్స్‌ సదస్సు సందర్భంగానూ భారతీయ చిత్రాలపై అభిమానాన్ని ప్రతిన్‌ చాటుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు