రాష్ట్రమంతటా ఘనంగా 150 ఏళ్ల వేడుక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందేమాతరం అంటూ విద్యార్థులు నినదించారు. జాతీయ జెండా చేబూని ప్రదర్శనలు చేపట్టారు. 150 ఆకృతిలో నిలబడి వందేమాతరం గీతాన్ని పాడారు. విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం పాఠశాలలో 3,086 మంది విద్యార్థుల గీతాలాపన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 150 సంఖ్య ఆకృతిలో విద్యార్థులు కూర్చొని వందేమాతరం గేయాలాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా హీర మండలం కేజీబీవీ పాఠశాలలో, పోలాకి మండల పరిధిలోని కోడూరు ఉన్నత పాఠశాలలో 150 ఆకృతిలో విద్యార్థులు పడుకొని వినూత్న రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 150 ఆకృతిలో కూర్చోగా, ఏలూరు జిల్లా చింతలపూడిలో భారీస్థాయి జాతీయ పతాకంతో వందేమాతరం గేయాన్ని ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలోని ప్రైవేటు కళాశాలలో ‘వందేమాతరం 150’ ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన సాగింది. పార్వతీపురం మన్యం జిల్లా వెంగాపురం శ్రీభారతి ఉన్నత పాఠశాలలో, శ్రీకాకుళం జిల్లా దండుగోపాలపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో, పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో, తునిలోని జెడ్పీ బాలికొన్నత పాఠశాలలో, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో, నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, విజయవాడ కేబీఎన్ కళాశాలలో సామూహిక వందేమాతరం గీతం మార్మోగింది. విజయవాడ ఆర్టీసీ హౌస్ కార్యక్రమంలో ఈడీ రవి వర్మ, చెంగల్‌రెడ్డి, ఎన్.శ్రీనివాసరావు, విజయగీత,జాన్ సుకుమార్, శోభామంజరి పాల్గొన్నారు.
ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన నినాదం : వక్తలు
స్వాతంత్య్ర పోరాటానికి బీజం వేసి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన గేయం వందేమాతరమని టీడీపీ నాయకులు అన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో వందేమాతరం 150 ఏళ్ల సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి, శాసనసభ్యుడు కిమిడి కళావెంకట రావు మాట్లాడుతూ మన జాతీ గొప్పతనం, ఔన్నత్యం నలువైపుల చాటిన గొప్ప గేయం వందేమాతరం అని అన్నారు. 145 కోట్ల మంది ప్రజలు ఆనందంగా ఈ గీతాన్ని పాడుకోవడం విశేషమన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ దేశ గొప్పతనం వర్ణిస్తూ బంకించంద్ర చటర్జీ ప్రతి భారతీయుడు గర్వించే గేయం రాశారన్నారు. ఈ గీతంలోని ప్రతి పదానికి గల అర్థాన్ని వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వందేమాతరం ఉద్యమంలా సాగిందన్నారు. 1905 బెంగాల్ విభజన సమయంలో జరిగిన ఘటనలను గుర్తుచేశారు. నీలి మందు పంటకు వ్యతిరేకంగా రైతుల పోరాటమప్పుడు మహిళలను బ్రిటీష్ సైన్యం హింసిస్తే వారి నోట వందేమాతరం వచ్చిందన్నారు. నేటితరం వందేమాతరం ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వం మారకపోతే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్ర సస్యశ్యామలమైందని చెప్పారు. అల్లూరి సీతారమారాజు, పింగళి వెంకయ్య, అయ్య దేవర కాళేశ్వరరావు, కళా వెంకట్రావు వంటి గొప్ప నాయకులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో శ్రీశైలం బోర్డు సభ్యులు ఏవీ రమణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, హజ్ యాత్ర కమిటీ చైర్మన్ హసన్ భాష, రాష్ట్ర మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర బాబు పాల్గొన్నారు. వందేమాతరం గీతాన్ని ఆలపించారు.


