Friday, January 16, 2026
Homeసంపాదకీయంమోదీ నేతృత్వంలో మిగిలింది అవమానమే

మోదీ నేతృత్వంలో మిగిలింది అవమానమే

- Advertisement -

పాత మిత్రుడు మైత్రి కొనసాగించకపోతే అంత నష్టం లేదు. కానీ బద్ధ శత్రువుగా మారితే చాలా ప్రమాదం. ట్రంప్‌ నాకు సన్నిహిత మిత్రుడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా గత జనవరిలో ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడైన తరవాత మన దేశంపై శత్రుత్వమే ప్రదర్శిస్తున్నారు. కొంత కాలంగా భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. వాణిజ్య లావాదేవీల భయం పెట్టి భారత్‌-పాకిస్థాన్‌ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించేట్టు చేశానని లెక్కలేనన్ని సార్లు ట్రంప్‌ చెప్పారు. ఆ లెక్కన ట్రంప్‌కు భారత్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఉద్దేశమే ఉంటే భారత్‌ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుల మీద 25 శాతం సుంకం విధించి ఉండరు. భారత్‌ తమకు మిత్ర దేశమే అయినా కొంత కాలంగా రెండు దేశాల మధ్య పెద్ద వాణిజ్య సంబంధాలేవీ లేవని కూడా చెప్పారు. అంటే భారత్‌తో వాణిజ్య సంబంధాలు లేకపోయినా ఫరవాలేదన్నట్టే. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా భారతే ఎక్కువ సుంకాలు విధిస్తోందని కూడా అన్నారు. అంతే కాకుండా భారత్‌ రష్యా నుంచి భారీగా ఆయుధాలు, భారీగా ఇంధనం దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల భారత్‌ పై జరిమానా విధిస్తామని కూడా ట్రంప్‌ హుంకరించారు. చైనాతో భారత్‌ వాణిజ్య సంబంధాలు కూడా ఎక్కువగా ఉండడం సైతం ట్రంప్‌ ఆగ్రహానికి కారణమైంది. ఉక్రెయిన్‌ మీద యుద్ధం నిలిపివేయడానికి నిరాకరించే రష్యాతో వాణిజ్య సంబంధాలు ఏమిటి అన్నది ట్రంప్‌ ప్రశ్న. ట్రంప్‌ పెంచిన 25 శాతం సుంకాలు, జరిమానాలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. దీనివల్ల భారత్‌కు ఎంతో కొంత నష్టం తప్పదు. ట్రంప్‌ అక్కడితో ఆగలేదు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ మృత ప్రాయమైంది అన్నారు. రష్యాదీ అంతేనట. రెండు దేశాలు కలిసి గంగలో దూకనీ అని కూడా శపించారు. చమురు, గ్యాస్‌ వెలికి తీయడం కోసం అమెరికా పాకిస్థాన్‌కు సహకరిస్తుందట. భవిష్యత్తులో భారత్‌ తమకు ఏ మాత్రం కిట్టని పాకిస్థాన్‌ నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ట్రంప్‌ ఇలాంటి బెదిరింపులకు దిగడం భారత్‌కే పరిమితమైంది కాదు. బ్రెజిల్‌తో సహా అనేక లాటిన్‌ అమెరికా దేశాలను, ప్రస్తుతం అమెరికాతో పోటీ పడ్తున్న చైనానూ ఇలాగే హెచ్చరించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా ట్రంప్‌కు గట్టి సమాధానమే ఇచ్చారు. రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేయకపోతే చైనా మీద కూడా భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నారు. కానీ చైనా బెదిరిపోలేదు. పైగా ట్రంప్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. తమ దేశానికి ఏది ప్రయోజనకరమో ఆ మార్గాన్నే అనుసరిస్తామని చైనా దీటుగా సమాధానం చెప్పింది. ఒత్తిడి చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని కూడా తెగేసి చెప్పింది. అనేక లాటిన్‌ అమెరికా దేశాలు కూడా ట్రంప్‌కు తగిన సమాధానమే చెప్పాయి. భారత్‌ నుంచి మాత్రం కచ్చితమైన సమాధానం ఏదీ రాలేదు. అయితే ఎవరి సంతకమూ లేని ఒక ప్రకటన మాత్రం విడుదలైంది. ట్రంప్‌ ప్రకటనను గమనించామని, సంప్రదింపుల ద్వారా సముచితమైన, సమతూకంతో కూడిన, పరస్పరం ప్రయోజనం కలిగించే ఒప్పందం కుదుర్చుకుంటామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ మృతప్రాయం అవుతోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ కొద్ది కాలంగా చెప్తూనే ఉన్నారు. మన ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది మోదీయేనని రాహుల్‌ దాపరికం లేకుండానే చెప్పేశారు. మన ఆర్థిక వ్యవస్థ ధ్వంసం కావడానికి రాహుల్‌ గాంధీ కొన్ని కారణాలు కూడా బయట పెట్టారు. అదానీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి పాకులాండడం, పెద్ద నోట్ల రద్దు, అస్తవ్యస్తమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఇతర దేశాల విడిభాగాలను కూర్చి మన దేశంలో వస్తువులు తయారు చేయడంలో విఫలం కావడం, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు)మాయమై పోవడం, రైతుల మీద అణచివేత మొదలైనవి మన ఆర్థిక వ్యవస్థ కూరుకు పోవడానికి కారణం అని రాహుల్‌ ఆక్షేపించారు.
మన ఆర్థిక వ్యవస్థ మృత ప్రాయం అయిందని ట్రంప్‌ అవమానించినా ప్రధానమంత్రి మోదీ ఇప్పటిదాకా ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా నోరే విప్పలేదు. మోదీ తన స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల ట్రంప్‌ ను తప్పుపట్టలేదనుకుందాం. కానీ అవమానాన్ని సైతం సహించే స్థితిలో ఎందుకు పడిపోయినట్టో. ఈ అవమానం మోదీకి మాత్రమే కాదు. ట్రంప్‌ దేశవాసులందరినీ అవమానించారు. దేశ గౌరవాన్ని కాపాడే బాధ్యతను మోదీ విస్మరించారు. మన ఆర్థిక వ్యవస్థ మృత ప్రాయమైంది అని ట్రంప్‌ అనడాన్ని రాహుల్‌ సమర్థించారు. ఆయన ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నారు. బీజేపీ నేతలు ట్రంప్‌ను ఒక్క మాటైనా అనకుండా రాహుల్‌ మీద విరుచుకుపడ్తున్నారు. రాహుల్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే ట్రంప్‌ కూడా వ్యక్తం చేసినప్పుడు ఆయననూ బీజేపీ నేతలు దుయ్యబట్టాలిగా! అలా జరగడం లేదు. అంటే ట్రంప్‌ను చూస్తే ఇటీవల మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి 36 అంగుళాలకు కుంచించుకుపోయినట్టే బీజేపీ నాయకులు కూడా ఒణికి పోతున్నట్టూన్నారు. మోదీ వెనకేసుకొస్తున్న వ్యాపార వర్గాల వారు ట్రంప్‌ను విమర్శించకపోయినా కనీసం అభ్యంతరమైనా వ్యక్తం చేయడం లేదు. మోదీ కీర్తి గానంలో లీనమై పోయే గోదీ మీడియా, కరడుగట్టిన జాతీయవాదులు అందరూ కట్టగట్టుకుని ఎక్కడ మాయమై పోయారో? రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే మన మీద జరిమానా విధిస్తానంటున్న మోదీ పాకిస్థాన్‌ మాత్రం రష్యాతో సంబంధాలు పెంచుకుంటూ ఉంటే కిమ్మనకపోవడానికి కారణం ఏమై ఉంటుంది. భారత్‌-పాకిస్థాన్‌ దేశాలు రెండూ తనకు మిత్ర దేశాలే అంటున్న ట్రంప్‌ భారత్‌ మీద మాత్రమే జరిమానా విధిస్తానంటు న్నారు. పాకిస్థాన్‌లోని ఉక్కు పరిశ్రమలను ఆధునికీకరిం చడం కోసం రష్యాతో షాంఘై సహకార సంఘం సమావేశంలో గత జులై 12న ఒప్పందం కుదిరింది. అది ట్రంప్‌నకు అభ్యంతరకరం కాకపోవడం అంటే భారత్‌ మీదే కత్తిగట్టునట్టు ప్రవర్తిసున్నారనే. ట్రంప్‌ నోరు జారడం, ఆ విషయాన్ని తరవాతైనా గ్రహించకపోవడం పరిపాటే. అబద్ధాలు చెప్పడంలోనూ మోదీతో సహా ఏ దేశ నాయకుడూ ట్రంప్‌కు సాటి రారు. ట్రంప్‌ అన్న మాటలు మన సార్వభౌమాధికారాన్ని చులకన చేసేవిగా ఉన్నాయి. ట్రంప్‌ వైఖరి మనకు అవమానకరం అని మోదీ భావించకపోవడం ట్రంప్‌ అన్న మాటల కన్నా పెద్ద అవమానం. ఆలింగనాలు, సుదీర్ఘ కరచాలనాలతో విదేశాంగ విధానం కొనసాగదు. ట్రంప్‌ అవమానిస్తూ ఉంటే మోదీ మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడ్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు