Friday, March 6, 2026
Homeసంపాదకీయంయుద్ధోన్మాదానికి మోదీ మద్దతు!

యుద్ధోన్మాదానికి మోదీ మద్దతు!

- Advertisement -

ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఒక్కుమ్మడిగా దాడి చేసి బీభత్సం సృష్టిస్తూ ఉంటే మనం ఎక్కడున్నాం? ఈ యుద్ధంపై మోదీ ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఎప్పుడూ నైతికత గురించి ఉపన్యాసాలు గుప్పించే ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు నిర్దిష్టమైన ప్రకటన చేయనే లేదు. మన దేశంలో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి కార్నీతో మాట్లాడుతూ మోదీ ఇచ్చిన శాంతి సందేశం ఎవరిని ఉద్దేశించిందనుకోవాలి? మొట్టమొదట దాడి చేసింది ఇరాన్ కాదు. శాంతికి భంగం కలిగించిందీ ఇరాన్ కాదు. ఏకపక్షంగా ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించాయి. ఈ పరిస్థితిలో అసలు భారత విధానం ఏమిటి? భారత్ ఏ పక్షాన నిలబడినట్టు? ఈ ప్రశ్నలకు మోదీ నుంచి గానీ, ఆయన మంత్రుల నుంచి గానీ ఏ సమాధానమూ లేదు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగించుకు వచ్చిన వెంటనే యుద్ధం ప్రారంభం కావడం అంటే మోదీకి ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ ఏ మాత్రం విలువ ఇచ్చినట్టో! ఇరాన్ అధినేత అలీ ఖామేనీని యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే హతమార్చారు. ఇరాన్‌తో మనకు శతాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి స్థితిలో ఇరాన్ పక్షాన నిలబడవలసిన అగత్యం ఉందని మోదీ భావించడం లేదేమో. తనకు ట్రంప్ సన్నిహిత మిత్రుడని మోదీ బాకా ఊదుతూ ఉంటారు. ఈ యుద్ధం ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ఒక్క మాటైనా చెప్పలేదంటే మోదీని ఆయన ఏ మేరకు పట్టించుకుంటున్నట్టు? “ప్రపంచంలో కొనసాగుతున్న అనేక ఉద్రిక్తతల విషయంలో భారత్ ఆలోచన స్పష్టంగానే ఉంది. మేం ఎప్పుడూ శాంతి నెలకొనాలనే అంటున్నాం. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి నిలబడితే ప్రజాస్వామ్య స్వరం మరింత స్పష్టంగా వినిపిస్తుంది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. సంప్రదింపులు, దౌత్యం ద్వారానే అన్ని వివాదాలను పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానం” అని మోదీ కెనడా నాయకుడు కార్నీ సమక్షంలో గంభీరమైన ప్రకటన చేశారు. కానీ ఈ ప్రకటనలో భీకర సమరం జరుగుతున్న సమయంలో మనం ఏ పక్షాన నిలబడ్డామో మోదీ మాట మాత్రంగా కూడా చెప్పలేదు. ఖామేనీని హతమార్చడం గురించి మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శాంతి పునరుద్ధరించాలని ఆయన ఎవరికి విజ్ఞప్తి చేస్తున్నట్టో! యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్లు మోదీ ఎత్తనే లేదు. మన దేశంలోని అనేక నగరాల్లో యుద్ధాన్ని, ఖామేనీ హత్యను నిరసిస్తూ భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. కశ్మీర్, అమ్రోహా, లక్నో, హైదరాబాద్‌తో సహా అనేక నగరాల్లో జనం యుద్ధాన్ని నిరసించారు. యుద్ధ వ్యతిరేకతను నిర్ద్వంద్వంగా తెలియజేశారు.ఈ ప్రదర్శనల్లో షియాలతో పాటు సున్నీలూ పాల్గొన్నారు. ఇరాన్ రాయబార కార్యాలయంలో ఖామేనీని హతమార్చినందుకు సంతాప సభ కూడా జరిగింది. ఈ ప్రదర్శనల పరంపర చూస్తే దేశ ప్రజలు యుద్ధాన్నీ నిరసిస్తున్నారని తెలుస్తూనే ఉంది. కానీ భారత ప్రభుత్వ వైఖరి ఏమిటో మోదీ గంభీరమైన ప్రకటన తరవాత కూడా అంతుపట్టనే లేదు. భారత ప్రభుత్వ విధానం ఏమిటో మోదీ వినిపించిన “శాంతి మంత్రం”లో ఎక్కడా కనిపించలేదు. ప్రయోజనం లేని సూక్తి ముక్తావళితో ఏం సాధించదలచుకున్నారు? 2024 మే 20న ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రాహిం రయీసీ, విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పుడు భారత ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆ మర్నాడు దేశమంతటా సంతాపం పాటించాలని కోరింది. మరి ఇప్పుడు ఇరాన్‌లో అత్యగ్ర నాయకుడైన అలీ ఖామేనీని హతమారిస్తే పెదవి బిగించి కూర్చున్నారు. గత 21వ తేదీ రాత్రి పాకిస్థాన్ హఠాత్తుగా అఫ్గానిస్థాన్ పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను మన విదేశాంగ శాఖ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను, స్వాతంత్య్రాన్ని భారత్ సమర్థిస్తుందని ఆ ప్రకటనలో తెలియజేశారు. కానీ ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెలలో ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తే, ఈ దాడుల్లో వందలాది మంది నిరాయుధులు, మహిళలు, బాలలు నేలకొరుగుతున్నప్పుడు మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించరేమో! జెనీవాలో ఇరాన్‌తో చర్చలు జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించడం మొదలైంది. ఇది ఇరాన్ సార్వభౌమాధికారం మీద దాడిగా మోదీ ప్రభుత్వానికి కనిపించలేదు. నైతికతా ప్రభోదాలతో విదేశాంగ నీతి నడవదు. భౌగోళిక రాజకీయాలు కేవలం నైతికత మీద ఆధారపడి ఉండవు. ఏ దేశ విదేశాంగ విధానమైనా దేశ ప్రయోజనాల దృష్టితోనే సాగుతుంది. ఇరాన్ మీద యుద్ధాన్ని చివరకు పాకిస్థాన్ కూడా ఖండించింది. మనం మాత్రం డొంక తిరుగుడు సూక్తిముక్తావళి వినిపించి సంతృప్తిపడ్తున్నాం. ఈ దాడిని ఖండించకపోగా కనీసం ఖామేనీ మృతికి సంతాపమైనా తెలియజేయలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి మాట్లాడినప్పుడు మోదీ భారత్ తటస్థంగా లేదని శాంతి పక్షాన నిలబడుతుందని మోదీ చెప్పారు. అధర్మ యుద్ధాన్ని ఖండించకుండా శాంతి పక్షాన నిలబడడం అసాధ్యం. సంఘర్షణ కొనసాగుతున్నప్పుడు తటస్థతకు అవకాశం ఉండదు. కానీ ఇదే మోదీ ప్రభుత్వం గత డిసెంబర్ లో రష్యా-ఉక్రెయిన్Ž మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెడ్తే ఆ తీర్మానం మీద ఓటు వేయకుండా తప్పించుకుంది. ఇది పచ్చి పలాయనవాదం. ఈ తీర్మానంపై 107 దేశాలు కాల్పుల విరమణకు అనుగుణంగా ఓటు వేశాయి. 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌కు మద్దతుగా శిఖరాగ్ర సభ జరిగినప్పుడు మోదీ రష్యా అధినేత పుతిన్‌తో ఈ యుగం యుద్ధాలకు అనువైంది కాదని చెప్పారు. మరి ఇప్పుడు నెతన్యాహూకు, ట్రంప్‌కు ఇదే హితబోధ చేసే సాహసం లేదు. ఆ జాడే లేదు. భారత్‌తో పోలిస్తే స్పెయిన్ చాలా చిన్న దేశం. స్పెయిన్ అధినేత పెడ్రో సాంచెజ్ ఇరాన్ మీద యుద్ధాన్ని అరమరికలు లేకుండా ఖండించారు. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల్లో అనేక మందిని కాల్చి చంపడాన్ని నిందిస్తూనే అంతమాత్రం చేత అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధంగా యుద్ధానికి దిగడాన్ని కూడా తూర్పారబట్టారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ మీద యుద్ధానికి దిగడానికి ట్రంప్‌కు అమెరికా పార్లమెంటు మద్దతూ లేదు. ఐక్యరాజ్య సమితి అనుమతీ లేదు. ఇది దాష్టీకమని, అనైతికమనీ మోదీకి తట్టనే లేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు