Homeయుద్ధ బీభత్సం

యుద్ధ బీభత్సం

- Advertisement -

ఇజ్రాయిల్, అరబ్ దేశాలపై క్షిపణుల వర్షం
తెహ్రాన్‌పై విస్తృతంగా వైమానిక దాడులు
మేం కాల్పుల విరమణ కోరలేదు: ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని వెల్లడి

తెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 33వ రోజుకు చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా…తెహ్రాన్ కాల్పుల విరమణ కోరిందంటూ ట్రంప్ బాంబు పేల్చారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలు ‘అవాస్తవం, నిరాధారం’ అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి చేసింది. అయితే డేటా సెంటర్ ఇరాన్ ప్రధాన లక్ష్యం కానప్పటికీ, దాని సమీపంలో జరిగిన దాడి వల్ల డేటా సెంటర్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత భారీ స్థాయిలో సేవలు స్తంభించకుండా తమ వర్క్‌లోడ్‌ను ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని అమెజాన్ తన క్లౌడ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. దీనికి ఒక రోజు ముందు.. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై అటాక్ చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. కాగా ఇరాన్ కొత్త అధ్యక్షుడు కాల్పుల విరమణను కోరుకుంటున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల’లో పోస్టు పెట్టారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు ట్రంప్ ఈ పోస్ట్ పెట్టారు. కానీ వాస్తవానికి ఇరాన్‌లో పాత అధ్యక్షుడే కొనసాగున్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధి “తెరిచుకొని, స్వేచ్ఛగా” ఉన్నప్పుడు మాత్రమే కాల్పుల విరమణ జరుగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. లేకుంటే ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని లేదా తిరిగి రాతియుగంలోకి నెట్టేస్తామని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇరాన్‌తో యుద్ధం మరో రెండు మూడు వారాల్లో ముగిస్తామని ట్రంప్ తెలిపారు. ఇక ఇరాన్‌పై యుద్ధం విషయంలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ట్రంప్‌తో విభేదించారు.
అమెరికా చేస్తున్న యుద్ధంతో మాకు సంబంధం లేదన్నారు. ీVAర్మూజ్ సంక్షోభంపై ప్రభావిత దేశాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. కాగా నాటో నుంచి తాము వైదొలిగే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్ల ట్రంప్ చెప్పారు.
తెహ్రాన్‌పై వైమానిక దాడి
బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని తెహ్రాన్‌పై వైమానిక దాడి జరిగింది. ఆ దాడి అక్కడ ఉన్న పాత అమెరికా రాయబార కార్యాలయంపై జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక తెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా అనేక లక్ష్యాలపై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధవిమానాలు విరుచుకుపడుతున్నాయి. కీలక రాజకీయ నాయకులు, సైనికస్థావరాలు, క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు, ఐఆర్‌జీసీ కమాండ్ సెంటర్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తెహ్రాన్‌లో తోఫిగ్ దారు అనే ఔషధ తయారీ కేంద్రంపై ఐడీఎఫ్ దాడి చేసింది. ప్రాణాదారమైన ఔషధాల తయారు కేంద్రంపై దాడి చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని ఇరాన్ తీవ్రంగా మండిపడింది. జంజన్ నగరంలో ఉన్న ప్రసిద్ధ షియా మసీదుపై ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో మసీదు ధ్వంసమైంది. శిథిలాలు మీదపడి ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి.
ఇజ్రాయిల్, అరబ్ దేశాలపై ఇరాన్ దాడులు
ఇజ్రాయిల్‌తో పాటు అరబ్‌దేశాల్లోని అమెరికా స్థావరాలు, యూనివర్సిటీలు, టెక్ కంపెనీలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. చాలా వాటిని ఆయా దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి. ఇరాన్ క్షిపణుల రాకతో టెలఅవీవ్ అంతటా సైరన్‌లు మోగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా విక్టోరియా ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఎర్బిల్‌లోని అమెరికా ఆస్తులపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడగా..ఆ ప్రాంతంలో నల్లని పొగ వ్యాపించింది.
మా షరతులకు ఒప్పుకుంటేనే ఏదైనా: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
అమెరికా- ఇజ్రాయెల్‌తో కొనసాగుతోన్న యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. అయితే, తమకు కొన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. యుద్ధం ముగించాలంటే తాము విధించిన షరతులకు అంగీకరించాలని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావనే బలమైన హామీ ఇవ్వాలన్నారు. అప్పుడు ఈ యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడితో జరిగిన సంభాషణ తర్వాత ఆంటోనియో కోస్టా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను తగ్గించుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు