డా॥ జ్ఞాన్ పాఠక్
2027 మేలో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో మతపరమైన అంశాలు మరోసారి చర్చకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్-జ్ఞానవాపి మసీదు, మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గాహ్ మసీదు, సంభల్లోని జామా మసీదు వివాదాలు రాబోయే నెలల్లో రాజకీయంగా సామాజికంగా న్యాయపరంగా కేంద్రబిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మూడు వివాదాల్లో హిందూ, ముస్లిం వర్గాలు రెండూ సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యవర్తిత్వ పరిష్కారాన్ని తిరస్కరించి, కోర్టు తీర్పు ద్వారానే న్యాయం జరగాలని స్పష్టం చేశాయి.1991లో పార్లమెంట్ ఆమోదించిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ (స్పెషల్ ప్రొవిజన్స్) చట్టం ప్రకారం, 1947 ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలానికి ఉన్న మతపరమైన స్వరూపాన్ని మార్చకూడదు అన్న అంశం ఉంది. ఈ చట్టం అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో మత సామరస్యాన్ని కాపాడటం, చారిత్రక వివాదాలను ఆధారంగా చేసుకుని కొత్త మత ఘర్షణలకు అవకాశం లేకుండా చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అయితే ఇటీవలి కాలంలో దేశంలోని అనేక ఆలయ-మసీదు వివాదాలు కోర్టుల ముందుకు రావడం, రాజకీయ చర్చల్లో దారి తీయడం కొనసాగుతోంది. ఈ చట్టం ఉన్నప్పటికీ అనేక కేసులు విచారణకు స్వీకరించడం అలాగే వాటిపై రాజకీయంగా ప్రచారం జరగడం వల్ల మత రాజకీయాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి హిందుత్వ సంస్థలు ఈ అంశాలను రాజకీయంగా వినియోగిస్తున్నాయి. మధ్యవర్తిత్వం ద్వారా దేశ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఇటీవల ‘సమాచన్ సమారోహ్-2026’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆగస్టు 21 నుంచి 23 వరకు ప్రత్యేక లోక్`అదాలత్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాశీ, మధుర, సంభల్ కేసుల్లోని ఇరువర్గాలకూ రాజీ అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు లేఖలు పంపింది. అయితే ఇరు వర్గాలు ఈ రెండు ప్రతిపాదనలను తిరస్కరించాయి. తమ వాదనలు చట్టపరంగా బలంగా ఉన్నాయని, రాజీ కాకుండా కోర్టు తుది తీర్పే కావాలని అవి స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఇవే కాకుండా దేశ వ్యాప్తంగా మరికొన్ని మసీదులు, దర్గాలు కూడా ఇలాంటి వివాదాలకు కేంద్రంగా మారే అవకాశమున్నట్లు తెలుస్తోంది. లక్నోలోని టీలే వాలి మసీదు, దిల్లీలోని కుతుబ్ మినార్ సముదాయంలోని కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు, మధ్యప్రదేశ్‌లోని భోజ్శాల సముదాయం, బదాయున్ షంసీ షాహీ మసీదు, జౌన్పూర్ అతాలా మసీదు, మధుర షాహీ ఈద్గాహ్, సంభల్ జామా మసీదు, ఫతేపూర్ సిక్రీ జామా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్‌గా వంటి ప్రదేశాలు కూడా వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. కాశీ జ్ఞానవాపి వివాదంలో హిందూ వర్గం జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో సోమనాథ్ వ్యాస్ కుటుంబసభ్యులు 1993 వరకు పూజలు నిర్వహించేవారని, ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆ పూజలను నిలిపివేసిందని వాదిస్తోంది. అంతేకాకుండా ఔరంగజేబ్ పాలనలో పురాతన కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చేసి దాని స్థానంలో మసీదును నిర్మించారని కూడా హిందూ వర్గం వాదిస్తోంది. దీనికి విరుద్ధంగా ముస్లిం వర్గం ఈ వాదనలను ఖండిస్తూ, మసీదు మొత్తం తమ ఆధీనంలోనే ఉందని, మసీదు ఔరంగజేబ్ కాలానికి ముందే నిర్మితమైందని చెబుతోంది. ఈ అంశాలన్నీ ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గాహ్ వివాదంలో హిందూ వర్గం, షాహీ ఈద్గాహ్ మసీదు శ్రీకృష్ణ జన్మస్థలంలో నిర్మించారని, దానిని తొలగించాలని కోరుతోంది. ఈ కేసును 2020లో సివిల్ కోర్టు 1991 చట్టాన్ని ఆధారంగా చేసుకుని కొట్టివేసింది. అనంతరం మధుర జిల్లా కోర్టు ఆ ఉత్తర్వును రద్దు చేసి కేసు విచారణకు అనుమతించింది. సంభల్ జామా మసీదు కేసు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. 2024 నవంబర్ 19న మసీదు మతపరమైన స్వరూపాన్ని నిర్ధారించేందుకు సర్వే నిర్వహించాలని సివిల్ కోర్టు ఆదేశించింది. అదే రోజు తొలి సర్వే జరిగింది. రెండోసారి నవంబర్ 24న సర్వే బృందం వెళ్లినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ హింస చెలరేగింది. వాహనాలకు నిప్పంటించి రాళ్ల దాడులు చేయడంతో నలుగురు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయోధ్య తీర్పు విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్ చేసిన ఒక వ్యాఖ్య అప్పట్లో విమర్శల పాలైంది. అయోధ్య తీర్పులో ప్రార్థనా స్థలాల చట్టం 1991 ని సమర్థించినప్పటికీ, అనంతరం అప్పటి ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ జ్ఞానవాపి కేసులో “ప్రార్థనా స్థలం మతపరమైన స్వరూపాన్ని పరిశీలించడాన్ని చట్టం నిషేధించదు” అని మాట్లాడ¦ం వల్లనే దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరిగాయి. ఇది అయోధ్య తీర్పు స్ఫూర్తికి విరుద్ధం. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాన్ని ఎంతో మంది స్వాగతించారు. కాని అది అసలు స్ఫూర్తికి అనుగుణంగా లేదు. చట్టం లక్ష్యం ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చేయడమే తప్ప, మళ్లీ వాటిని రాజీ చర్చల ద్వారా పరిష్కరించడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్య తీర్పు స్వాతంత్య్రం భారతదేశ చరిత్రలో ఒక మలుపు. గత చారిత్రక గాయాలను మాన్పి భవిష్యత్తులో సామరస్యంగా ఉండే సమాజాన్ని నిర్మించేందుకు అది అవకాశం కల్పించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. చరిత్రలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలనే పేరుతో వర్తమాన తరాలను విభజించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాల చట్టం కూడా అదే సూత్రాన్‌ని ప్రతిబింబిస్తుందని, చరిత్రను ప్రస్తుత సమాజంపై ఒత్తిడి తెచ్చే సాధనంగా ఉపయోగించకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్ దానిని రూపొందించిందని ఆ తీర్పు పేర్కొంది. ఈ నేపథ్యంలో కాశీ, మధుర, సంభల్ ఆలయ-మసీదు వివాదాలు న్యాయపరమైన కేసులు మాత్రమే కాదు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలు.


