Sunday, December 1, 2024
Homeరాజధాని పనులు షురూ

రాజధాని పనులు షురూ

జనవరి నుంచి పరుగులు

. డిసెంబరు ఆఖరుకల్లా టవర్లు, ట్రంకురోడ్ల టెండర్లు పూర్తి
. భారీస్థాయిలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌, మెడికల్‌ కాలేజీ
. వివిధ సంస్థల నిర్మాణానికి భూకేటాయింపులు
. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయని మున్సిపల్‌ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్‌ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయన్నారు. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ శుక్రవారం సచివాల యంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, దుర్గేశ్‌, సంధ్యారాణి జూమ్‌ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడిరచారు. గతంలో పనులు నిలిచిపోయిన వాటికి సంబంధించి టెండర్ల ఒప్పందాలు రెండు, మూడు రోజుల్లో రద్దు చేస్తామన్నారు. ఆ వెంటనే కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదన్నారు. 2019కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా, వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాల ఏర్పాటు ప్రారంభించాయ న్నారు. భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. 2019కి ముందే టీడీపీ ప్రభుత్వంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఆయా సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి కాల పరిమితి ముగియడంతో తిరిగి వారి నుంచి రాతపూర్వకంగా అంగీకారం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తాజాగా అమరావతిలో భారీస్థాయిలో ఈఎస్‌ఐ ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఆయా సంస్థలకు భూములు కేటాయించినట్లు తెలిపారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ అండ్‌ డిజైన్‌కు ఐదు ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో)కి 0.8 ఎకరాలు, బసవతారకం కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 15 ఎకరాలు, లార్సన్‌ అండ్‌ టర్బో స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఐదు ఎకరాలు, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్‌ సొసైటీకి 10 ఎకరాలు, టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిం చారు. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు. దీంతో పాటు ఆయా సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎంత భూమి కేటాయించారు. ప్రస్తుతం ఎంత అవసరం అనేదానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుం టామన్నారు. కొత్తగా భూ కేటాయిం పులు చేసే సంస్థలకు ధరల అంశంలో పాలసీ తయారు చేస్తామన్నారు. రాజధానికి కొత్తగా వచ్చే సంస్థలకు డిసెంబరు నెలాఖరులోగా భూకేటాయిం పులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశిం చామన్నారు. గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేకుండా తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పడానికి రాజధాని విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలే ఉదాహరణ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు