న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఏడుగురు కొత్త సభ్యులు ప్రమాణం చేశారు. ఖడ్గే కర్నాటక నుండి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన విషయం విదితమే. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన ఛాంబర్లో ఖడ్గే, ఇతర సభ్యులతో ప్రమాణం చేయించారు. ఖడ్గే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడంతో ఆయన తిరిగి ఎగువసభ ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, హిందీ భాషలో ఖడ్గే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మల్లికార్జున ఖడ్గే సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు. ప్రజల గొంతుకను, వారి ఆకాంక్షలను పార్లమెంట్లో పూర్తి చిత్తశుద్ధితో వినిపిస్తానని అన్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ, జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఒత్తిడి తీసుకురావడమే తన ప్రధాన బాధ్యతని ఖడ్గే ప్రకటించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగే అవకాశం లభించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా ప్రత్యేకంగా హాజరై ఖడ్గేకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పాల్గొన్నారు. ఖడ్గేతో పాటు బీజేపీ నేత తరుణ్ చుగ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురు కొత్త సభ్యులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.


