Homeసంపాదకీయంరామమందిర ట్రస్ట్‌కు కొత్త నాయకుడు!

రామమందిర ట్రస్ట్‌కు కొత్త నాయకుడు!

- Advertisement -

రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవహారాలు నిర్వహించ డానికి ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ఉద్యోగ విరమణ చేసిన ఏయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను బుధవారం నియమించారు. ఇంతకు ముందెన్నడూ రామమందిర ట్రస్ట్‌కు ప్రధాన కార్య నిర్వహణాధికారి ఎవరూ లేరు. జితేంద్ర మిశ్రానే మొదట ఇలాంటి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఆయన అయోధ్య చేరుకున్నారు. పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి మూడు-నాలుగు రోజులు పడుతుందని ఆయన చెప్పారు. ఇటీవలే జూన్ 29వ తేదీన ఆయనకు సర్వోత్తమ్ యోధ పతకం అందజేశారు. పహల్గాం సంఘటన తరవాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు జితేంద్ర మిశ్రానే ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. అప్పుడు ఆయన పశ్చిమ ప్రాంత వాయు సేన అధిపతిగా ఉండేవారు. పూర్తి కాలం పని చేసే ప్రధాన కార్య నిర్వహణాధికారిని నియమించడం కూడా ఇదే మొదటిసారి. మిశ్రాను నియమించే ముందు పెద్ద ప్రయత్నమే సాగింది. రామ మందిర ట్రస్టు నిర్వహణకు ప్రధాన కార్యనిర్వహణాధికారి కావాలి అని ప్రకటన విడు దల చేసినప్పుడు 5,585 మంది దరఖాస్తు చేశారు. వారిలో 1,580 మందిని ప్రధాన కార్యనిర్వహణాధికారి బాధ్యతలు నిర్వహించడానికి తగిన వారు అనుకున్నారు. అందులో మళ్లీ 108 మందిని ఎంపిక చేసి వారితో ఆన్ లైన్‌లో సంప్రదించారు. చివరి జాబితాలో 16 మంది తేలారు. వీరితో ఆగస్టు 11-12 తేదీలలో ముచ్చటించారు. ప్రధాన కార్యనిర్వహణాధికారి స్థానం కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో పాటు సరైన అభ్యర్థిని అన్వేషించడం కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో మేజర్ జనరల్ సంజయ్, ప్రతాప్ బిష్త, శృతి హరిద్వారీ ఉన్నారు. పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తి ప్రమోద్ కోహ్లీ, ఉద్యోగ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, శాస్త్రవేత్త సురేశ్ హవార్ ఉన్నారు. ఈ కమిటీ మూడు పేర్లను సూచిస్తూ గత మంగళవారం నివేదిక అందజేసింది. ఆ మర్నాడే నియామకం జరిగిపోయింది. సాయుధ దళ మాజీ ఉన్న తాధికారిని ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమించడంతో రామమందిర ట్రస్ట్ కార్యకలాపాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సాయుధ దళాధికారికా పని చేసినందు వల్ల మిశ్రాకు నాయకత్వ లక్షణాలు ఉంటాయని, తగిన ప్రణాళికలు రూపొందించగలరని, సంక్లిష్టమైన రామమందిర తీర్థ ట్రస్ట్‌ను నడప డానికి మిశ్రాకు సకల అర్హతలు ఉన్నాయని భావించారు. రామమంది రానికి భక్తులు సమర్పించిన కానుకలు, చదివింపులు, విరాళాలు దుర్వినియోగం అయ్యాయని పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ప్రధాన కార్యనిర్వహణాధికారిని నియమించడమే మార్గం అనుకున్నారట. రాముడి సొమ్ము దోపిడీ జరిగిందన్న ఆరోపణలు వచ్చిన తరవాత ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో వ్యక్తి అనిల్ మిశ్రా రాజీ నామా చేయవలసి వచ్చింది. అప్పటి నుంచి నిర్వహణకు సరికొత్త మార్గం ఏమిటి అన్న చర్చ జరుగుతూనే ఉంది. మిశ్రాను నియ మించిన క్రమాన్ని చూస్తే వ్యవహారం అంతా దాపరికం లేకుండానే జరిగిందనిపిస్తుంది. రామమందిర ట్రస్ట్‌కు అత్యంత ప్రాధాన్యం ఉన్నందు వల్ల, అయోధ్యలోని శ్రీరాముడిపై భక్త కోటికి అపారమైన విశ్వాసం ఉన్నందు వల్ల, కారణాలు ఏమైనా రాముడి సొమ్ము దోపిడీకి గురైందన్న తీవ్ర ఆరోపణలు వచ్చినందు వల్ల పరిపాలనాభవం గల వ్యక్తిని నియమించాలనుకోవడంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ప్రధాన కార్యనిర్వహణాధికారిని నియమించాలన్న ఆలోచన మొదట రామమందిర నిర్మాణ కమిటీ అధిపతి నృపేంద్ర మిశ్రా చేశారు. ఆయన ప్రధానమంత్రి మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడంటారు. నృపేంద్ర మిశ్రా ప్రధానమంత్రి దగ్గర ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేశారు. రామ మందిర ట్రస్ట్ ప్రభుత్వ వ్యవస్థ కాదు. మోదీ ప్రభుత్వం మందిర నిర్మాణం తరవాత ఈ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. ఈ ట్రస్ట్‌కు దాదాపు స్వయం ప్రతిపత్తి ఉండేది. ప్రధానమంత్రి మోదీ మార్గదర్శకత్వం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అందులో ఉన్న వారందరూ సంఘ్ పరివార్‌కు చెందిన వారే. ఈ ట్రస్ట్ ఏర్పాటే ఓ విచిత్రం. అది సమాచార హక్కు పరిధిలోకి రాకుండా ముందే జాగ్రతపడ్డారు. అందుకని ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. రామ మందిర సొమ్ము దోపిడీకి గురైందన్న ఆరోపణలు గుప్పుమన్న తరవాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఓ ప్రత్యేక దర్యాప్తు సంఘం (సిట్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్న ఓ మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి మీద ఇప్పటికీ మోసగించాడన్న ఆరోపణపై 420వ సెక్షన్ కింద నమోదైన కేసు కొనసాగుతూనే ఉంది. రామమందిర ట్రస్ట్ ప్రభుత్వ వ్యవస్థ కాకపోయినా సకల వ్యవ హారాలు మోదీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రామ మందిరంలో జరిగింది కేవలం దొంగతనం కాదని అది బందిపోటు అన్నది కూడా నృపేంద్ర మిశ్రానే. కొత్తగా నియమితుడైన జితేంద్ర మిశ్రా రామా లయంలో జరిగిన దోపిడీ గురించి ఏం చేస్తారో, అసలు చేస్తారో లేదో ఇంతవరకు తెలియదు. రామమందిర నిధులు దోపిడీకి గురవు తున్నాయని మొట్టమొదట బయటపెట్టింది మహిపాల్ సింగ్. ఆయన ట్రస్ట్‌కు ప్రధాన అకౌంటెంట్‌గా ఉండేవారు. సొమ్ము దోపిడీకి గురవు తోందని గుర్తించి ఆ విషయం చంపత్రాయ్‌కు ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏమిటంటే చంపత్రాయ్ ఆయన్ను తొలగించారు. ఒక రోజు లెక్కలు పరిశీలించిన మహిపాల్ సింగ్ అయిదు లక్షల రూపాయలు మాయమయ్యాయని గ్రహించారు. ఆయన సంఘ్ పరివార్ కుదురు లోని వారే. రామ భక్తుడే. జితేంద్ర మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించగానే చేసిన పని రామ మందిర పరిసరాల్లోకి మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధించడం. “మీ సంగతేమిటో నాకు తెలుసు. మళ్లీ మీరు ఇటు వైపు రాకూడదు” అని హెచ్చరించారు. అంటే ఆయన వ్యవహార సరళిలో దాపరికం లేని తనం మచ్చుకు కూడా ఉండదనిపిస్తోంది. ఆయన ఎంపికా ప్రధానమంత్రి అనుమతితోనే జరిగి ఉంటుంది. దాపరికం లేకుండా జితేంద్ర మిశ్రా నియామకం జరిగినట్టు చూపడానికి సుదీర్ఘ ప్రక్రియ కొనసాగి ఉండవచ్చు. కానీ మొదటి రోజే జితేంద్ర మిశ్రా వ్యవహార సరళి చూస్తే ఆయనకు “పెద్దల” అండదండలు ఉన్నాయని అర్థం అవుతూనే ఉంది. రామ మందిర ట్రస్టు ఏర్పాటుకు చట్టం చేయలేదు. దాదాపు అన్ని దేవాలయాల నిర్వహణా కమిటీల ఏర్పాటుకు చట్టాలు చేశారు. రామ మందిర ట్రస్ట్‌ను ఏ బాదరబందీలతో సంబంధం లేకుండా సకల కట్టుదిట్టాలు చేశారు. అన్ని పనులూ సంఘ్ పరివార్ ప్రమేయంతో నడుస్తాయి. మోదీ కనుసన్నల్లోనే జరుగుతాయి. మార్షల్ జితేంద్ర సింగ్ నిజాయితీని శంకించే అవకాశం లేదు. కానీ ఆయన ఎవరి చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తారో మీడియాను దూరం పెట్టడంతోనే తేలిపోయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు