Homeరుణ భారతం

రుణ భారతం

- Advertisement -

మార్చి నాటికి కేంద్రం అప్పు రూ.200 లక్షల కోట్లు
కేంద్రం, రాష్ట్రాల అప్పులు రూ.280 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధిలో భారత్ దూసుకుపోతోతందని, తీవ్ర సంక్షోభ సమయంలోనూ జీడీపీ గణనీయంగా పెరిగిందని మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పకుంటుంది. అయితే, దేశ ఆర్థిక సార్వభౌమాధికారం, భవిష్యత్తు ప్రగతిపై ప్రముఖ విశ్లేషకులు ఆనంద్ రంగనాథన్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ఆర్థిక, రాజకీయ చర్చకు తెరలేపాయి. భారతదేశం సమష్టి ప్రభుత్వ రుణం (కేంద్రం, రాష్ట్రాల అప్పులు) రూ.280 లక్షల కోట్లకు పైగా దాటిందని ఆనంద్ రంగనాథన్ చెప్పడం ఆర్థిక వేత్తల్లోనూ, సాధారణ పౌరుల్లోనూ కలవరం పుట్టిస్తోంది. రంగనాథన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ ఆర్థిక వ్యవస్థపై అనేక అంశాలను ప్రస్తావించారు. అధికారిక రికార్డులు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సర్దుబాటు చేసిన నికర రుణం 2026 మార్చి నాటికి దాదాపు రూ.200.53 లక్షల కోట్లుగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఇది రూ.218.63 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో అంతర్గత రుణాలు రూ.207.70 లక్షల కోట్లు కాగా, విదేశీ రుణాలు రూ.7.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రాల అప్పులు కలిపితే మొత్తం ప్రభుత్వ రుణం రూ.270 నుంచి రూ.280 లక్షల కోట్లకు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణం జీడీపీలో 40 శాతంగానూ, ఉమ్మడి రుణం 60 శాతంగానూ ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ పరిమితి దాటి అప్పులు పెరిగిపోవడం ఆర్థిక క్రమశిక్షణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ రుణ భారంపై ప్రధానంగా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి వడ్డీల భారం-అనుత్పాదక వ్యయం. ఆనంద్ రంగనాథన్ హెచ్చరించినట్లుగా 2026-27 బడ్జెట్లో వడ్డీ చెల్లింపులకే రూ.14 లక్షల కోట్లకు పైగా కేటాయించాల్సి వస్తోంది. ప్రభుత్వ పన్ను ఆదాయంలో ప్రతి రూపాయిలో దాదాపు 40 పైసలు కేవలం వడ్డీలకే చెల్లించాల్సి వస్తోంది. ఇది భవిష్యత్తులో విద్య, వైద్యం, సంక్షేమం వంటి రంగాలకు చేసే వ్యయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. రెండోది మూలధన వ్యయం-వృద్ధి వ్యూహం. బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ వంటి నాయకులు దీన్ని సమర్థిస్తున్నారు. మౌలిక వసతులు, రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణానికి (మూలధన వ్యయం) చేసే అప్పులు దేశ భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి ఆస్తులు సృష్టిస్తాయని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం వల్ల ఈ రుణం ప్రమాదకరం కాదని వాదిస్తున్నారు. చివరిగా వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నంత కాలం డెట్-టు-జీడీపీ నిష్పత్తి అదుపులోనే ఉన్నట్లు అనిపించినా… ఏ కారణంగానైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తే సమస్య మొదలవుతుంది. పెరుగుతున్న వడ్డీల భారం వల్ల పన్నుల భారం పెంచడమో లేదా ప్రజా ఉపయోగకర పథకాలకు నిధుల కోత విధించడమో చేయాల్సి ఉంటుంది. ఆస్తుల సృష్టికి చేసే అప్పు స్వాగతించదగినదే అయినప్పటికీ ఉచితాలు, అనుత్పాదక వ్యయాల కోసం చేసే అప్పులు రాబోయే తరాల భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజాధనం వడ్డీలకు జమ కాకుండా దేశ ప్రగతికి వినియోగపడేలా కఠిన ఆర్థిక నియంత్రణ అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు