Wednesday, February 18, 2026
Homeవిశ్లేషణరైతులకు, సామాన్యులకు మేలు చేయని కేంద్ర బడ్జెట్

రైతులకు, సామాన్యులకు మేలు చేయని కేంద్ర బడ్జెట్

- Advertisement -

వడ్డే శోభనాద్రీశ్వర రావు

సంయుక్త కిసాన్ మోర్చ రైతు ఉద్యమ సమయంలో రైతులకు న్యాయం చేస్తానని వారి డిమాండ్లను పరిశీలిస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన లిఖితపూర్వక హామీని ఈ బడ్జెట్లో విస్మరించారు. చట్టబద్ద సి-2G50 శాతం ఎంఎస్‌పీ ప్రస్తావన కూడా లేదు. ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలు, నాసిరకం విత్తనాలు, పురుగు మందుల కారణంగా నష్టపోయిన రైతులకు ఒక్క పర్యాయం రుణమాఫీ చేయమన్న రైతు సంఘాల డిమాండ్ ఊసేలేదు. గంగా, యమునా, బ్రహ్మాపుత్ర, నర్మద, తపతి, కృష్ణ, గోదావరి, పెన్నా, కావేరి వంటి నదులున్నప్పటికీ, సాగు విస్తీర్ణంలో 40 శాతం మంది రైతులు ఇప్పటికీ వరుణుడి దయపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడమే. అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులకు కేంద్రం నిధులు అందించి పూర్తి చేసే లక్ష్యంతో ఎ.ఐ.బి.పి పథకం ప్రారంభించింది. ఐతే ప్రధాని మోదీ హయాంలో ఈ వ్యవస్థ మొత్తం మార్పులకు లోనైంది. ఎ.ఐ.బి.పి, హర్ కేత్ కిసాని పథకాలను ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పి.యం.కె.యస్.వై) పథకంలో కలిపేశారు. నెమ్మదిగా వాటికి నిదుల కేటాయింపును తగ్గించేశారు. గత బడ్జెట్లో రూ.8,260 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో రూ.6,527 కోట్లు మాత్రమే కేటాయించారు. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 95 ప్రాజెక్టుల పనులు పూర్తికావాల్సి ఉంది. ఇప్ప్పుడు ఇంత తక్కువ మొత్తంలో నిధులను కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని విషయం. ఈ ప్రాజెక్టుల పని పూర్తికాకుండా “భారత్ విశార” అనే డిజిటల్ ఏఐ సంస్థతో పంటల ఉత్పాదకతను పెంచడం అసాధ్యం. పంటల ధరల స్థిరీకరణ నిధికి ఈ బడ్జెట్లో కేవలం రూ.4.100 కోట్లు మాత్రమే కేటాయించారు. వరి, గోధుమలు, తృణధాన్యాలకు మద్దతు ధర ఇచ్చేందుకు కాక ఈ నిధుల ద్వారా నాఫెడ్ సంస్థ చేత మినుములు, పెసలు, కందులు వంటి పప్పుధాన్యాలను కొనిపించి, తక్కువ రేట్లకు సూపర్ మార్కెట్లకు అందించే పద్ధతి గతం నుంచి అమలౌతోంది. ప్రభుత్వ సబ్సిడీతో తక్కువ ధరలకే అపరాలు సూపర్ మార్కెట్లకు లభించినా వినియోగదారులకు మాత్రం ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు.వాటర్ షెడ్లు, కాంటూరు కందకాలు, ఫారం పాండ్స్, ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు బడ్జెట్లో కేవలం రూ.2,580 కోట్లు కేటాయించారు. సమ్మిళిత అభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదల హోరే తప్ప కష్టనష్టాలను ఎదుర్కొంటున్న రైతున్నల సంక్షేమానికి ఈ కేటాయింపులు ఏమూలకు? ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది సన్న, చిన్న రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు, పేదలకు ఉపమోగపడిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండానే పేరు మార్చి వి.బి.జి.రాంజీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వాలపైన భారాన్ని మోపింది. వ్యవసాయ జి.డి.పిలో కనీసం ఒక్క శాతం దీనికి ఖర్చు చేయాలని ఐక్యరాజ్యసమితితో సహా పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నా మోదీ ప్రభుత్వం ఈ అంశం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ఈ బడ్జెట్లో రూ.9.967 కోట్లు కేటాయించింది. ఈ విషయంలో అమెరికా 6.7 శాతం, జపాన్ 14 శాతం వ్యవసాయ జీడీపీని ఖర్చు చేస్తూ ఉండగా మన దేశంలో 2008-09 లో 0.75 శాతం ఖర్చు చేసేది కాస్తా రానురాను 0.4 శాతానికి మోదీ తగ్గించేశారు. ఎరువులు, ఆహార సబ్సిడీలను తగ్గించటం వలన రైతులు, పేదలపైన అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు పామాయిల్ తోటల్లో, కోకోను అంతరపంటగా సాగుచేస్తూ, అదనపు ఆదాయాన్ని రైతులు పొందేవారు. దాని వలన పామాయిల్ తోటల విస్తీర్ణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెరుగుతూ వచ్చింది. ఇటీవల మన దేశం యూరోపియన్ యూనియన్ (ఈయు) తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన యూరప్ నుంచి చాక్లెట్లు, పెస్త్రీలు తక్కువ ధరలకే లభించనున్నందున కోకో పైన ప్రభావం పడే అవకాశం ఉంది. అన్నింటికన్నా దురదృష్టకరమైన విషయం ఏమంటే ఆస్తుల కల్పనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపుగా రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది కానీ వ్యవసాయ ప్రగతి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు మేలు చేయాలంటే పి.యం.కె.యస్.వై పథకానికి ఎక్కువ నిధులు కేటాయించాలన్న జ్ఞానం కేంద్ర ప్రభుత్వానికి లేకపోవటం భారత రైతాంగం చేసుకున్న దౌర్భాగ్యం. మన దేశంలో అటవీ విస్తీర్ణం కనీసంగా 33 శాతం ఉండాల్సింది ఇప్ప్పుడు 20శాతం మాత్రమే ఉండటం వలన గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజులు వ్యవసాయ రంగాన్ని నష్టపరుస్తున్నాయి. కార్బన్ ఉద్గారాలను గ్రహించడంలో అడవులు, వృక్షాలు కీలకపాత్ర వహిస్తాయి. ఐతే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో అడవులలో మైనింగుకు అనుమతులివ్వడం వలన లక్షలాది చెట్లను నరికేస్తున్నారు. తాజాగా గ్రేట్ నికోబార్ దీవిలో రూ.తొంబై వేల కోట్లతో అంతర్జాతీయ నౌకాశ్రయం, విమానాశ్రయాల వంటి వాటి నిర్మాణం కోసం దాదాపు అరవై లక్షల చెట్లు నరికేయొచ్చంటూ ప్రభుత్వమే చెప్తోంది. ఈ బడ్జెట్లో కార్బన్ ఉద్గారాలు తగ్గింపునకు రూ.ఇరవై వేల కోట్లు ఖర్చు చేయడమంటే అంతకన్నా మోసం మరొకటి ఉండదు. ఏటా జాతీయ రహదారుల కోసం రూ.2.50 లక్షల కోట్లు నిధులు ఇచ్చేది. ఈ బడ్జెట్లో రూ.3.10 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. తూర్పు భారతదేశంలోని దన్కుణి (పశ్చిమ బెంగాల్) నుంచి పశ్చిమ తీరంలోని సూరత్ (గుజరాత్) వరకు ‘డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార’కి అమోదం లభించింది. అనేక ప్రధాన మార్గాల్లో వందేభారత్, రాజధాని వంటి హైస్పీడ్ రైళ్లు నడుస్తూ ఉండగా ఇప్ప్పుడు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ముంబై`అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు 12 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది.
రూ.1.లక్ష కోట్లు ఖర్చైనా ఇప్పటికీ పూర్తికాలేదు. 7 మార్గాల్లో జరగాల్సిన ఈ పనుల పూర్తికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతాయో అంచనాకు అందదు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తూ దేశ సంపదను నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్ సంస్థలు, ఇనుము-బొగ్గు గనులు, జాతీయ రహదారులు, గౌతం అదాని, అంబానీ సోదరులు, వేదాంత అగర్వాల్ మున్నగు క్రోనీ క్యాపిటలిస్ట్ సంస్థలకు కట్టబెట్టడమే పరమావధిగా పెట్టుకుంది. 40 శాతం దేశ సంపద కేవలం ఒకే ఒక్క శాతం అత్యంత ధనికుల వద్ద పోగుపడింది. తక్కువ ఆదాయం ఉన్న డెబ్భై కోట్ల మంది ప్రజల సంపద కేవలం 10 శాతం మాత్రమే అని సర్వేలు చెప్తున్నాయి. 2026-2027 బడ్జెట్ వలన కార్పొరేట్లు, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుతుంది తప్ప రైతులు, కార్మికులు, పేదలకు ఒరిగేది ఏమీలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు లోబడి విధించిన సుంకాల నేపథ్యంలో చిరకాల మిత్రదేశమైన రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్ మాటలకు దాసోహం అనడం సిగ్గుచేటు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు