Homeరైతుల ఖాతాల్లో రూ.672 కోట్లు

రైతుల ఖాతాల్లో రూ.672 కోట్లు

- Advertisement -

. ధాన్యం బకాయిల జమకు కేబినెట్‌ నిర్ణయం
. మామిడి రైతులకు రూ.260 కోట్లు విడుదల
. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్‌కు నిధుల కేటాయింపు
. నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు అదనంగా 790 ఎకరాల సేకరణ
. ఏపీ స్పేస్‌ పాలసీ 2025-30కు ఆమోదం
. ఏపీ జలజీవన్‌ నీటి సరఫరా కార్పొరేషన్‌ ఏర్పాటు
. పరిశ్రమలు, కార్మిక బిల్లులో చట్ట సవరణలకు ఆమోదం

విశాలాంధ్ర-సచివాలయం:
రాష్ట్రంలో ధాన్యం బకాయిలు రూ.వెయ్యి కోట్లకుగాను ప్రస్తుతానికి రూ.672 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27వ ఇ-క్యాబినెట్‌ సమావేశంలో 19 అంశాలు అజెండాగా చర్చ జరిగింది. అనేక అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత రబీ సీజన్‌లో ప్రభుత్వం తరపున రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ రైతుల నుంచి ధాన్యం సేకరించింది. అయితే మద్దతు ధరను మాత్రం ప్రభుత్వం వారి ఖాతాల్లో ఇప్పటివరకూ జమ చేయలేదు. ఈ బాకీలు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 4న ఎన్‌సీడీసీ నుంచి వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో మార్క్‌ఫెడ్‌ తగు చర్యలు చేపట్టింది. అయితే ఇలా ధాన్యం బకాయిల మొత్తం రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆయన స్వయంగా ఈ బకాయిల విడుదలను పర్యవేక్షించనున్నారు. మార్క్‌ఫెడ్‌ ఖాతాలో ఇవాళ, రేపట్లో రుణం మొత్తం జమ కానుంది. వెంటనే రైతులకు బకాయిల మొత్తాన్ని విడుదల చేయనున్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం రూ.260 కోట్లు విడుదల చేసింది. గురువారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇదిలాఉండగా, ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్‌ నిర్మాణానికి రూ.500 కోట్లు నిధుల కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. అమరావతిలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సెంటర్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారులకు నివాస సముదాయ భవనాలు పూర్తి చేసేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రాజధాని అమరావతికి మలి విడతలో 34 వేల 964 ఎకరాల భూ సమీకరణ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీంతో 13 గ్రామాల పరిధిలో భూసమీకరణ చేపట్టనున్నారు. సీబీఐ, జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్‌ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి పరిధిలో ప్రభుత్వరంగ సంస్థ క్వాంటం కంప్యూటింగ్‌కు రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాలకు హడ్కో కింద రూ.వెయ్యి కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ రుణానికి ఆమోదించింది. హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు, అలాగే ఏపీ జలజీవన్‌ నీటి సరఫరా కార్పొరేషన్‌ ఏర్పాటుకు, ఆంధ్ర ప్రదేశ్‌ మోటార్‌ వెహికల్‌ బిల్లు, అలాగే పరిశ్రమలు, కార్మిక బిల్లులో అనేక సవరణలకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ పరిధిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు అదనంగా 790 ఎకరాలు సేకరించేందుకు ఆమోదం తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్‌ స్పేస్‌ పాలసీ 2025-30కు ఆమోదం, నెల్లూరు జిల్లాలో పెట్రో కెమికల్‌ పరిశ్రమ కోసం భూ సేకరణ, 6 యూనిట్ల ఏర్పాటుకు ఆమోదించింది. కోకో రైతులను ఆదుకునేందుకు 14.88 కోట్ల మంజూరుకు, రాజధాని అమరావతి పరిధిలో భూమి లేని దాదాపు 1,575 పేద కుటుంబాలకు పెండిరగ్‌లో ఉన్న పెన్షన్‌ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను కృష్ణా నది నుంచి డ్రెడ్జింగ్‌ చేసుకునేందుకు సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చింది. జలవనరుల శాఖలో 71 పనులకు ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖలో వివిధ మీడియం ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు