Friday, May 9, 2025
Homeవలంటీర్ల వ్యవస్థే లేదు

వలంటీర్ల వ్యవస్థే లేదు

. స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వం
. మండిపడ్డ విపక్షం
. అవినీతి, అక్రమాల చర్చ నుంచి వైసీపీ వాకౌట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాలపై రాష్ట్ర శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర రచ్చ చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడంలేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు నిలదీయడంతో దానికి దీటుగా మంత్రులు బదులివ్వడం, పరస్పర విమర్శల దాడితో మండలి వేడెక్కింది. సోమవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపైన వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ… రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని, రూ.2వేల కోట్లు వసతి దీవెన బకాయిలు ఉన్నాయని వివరించారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇంతవరకు ఇవ్వలేదని, వసతి దీవెన మొదలు పెట్టిందే జగన్‌ అని తెలిపారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన రూ.1778 కోట్ల బకాయిలను జగన్‌ చెల్లించారని, ఇప్పుడు ప్రభుత్వం బకాయి లను చెల్లించకపోవడం అన్యాయమని చెప్పారు. కల్పలతారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టేశారన్నారు. వలంటీర్ల తొలగింపుపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, వైసీపీ సభ్యులు వరుదు కల్యాణి, రమేశ్‌ యాదవ్‌కు మధ్య కొనసాగిన వాగ్వాదంతో మండలిలో వివాదం కొనసాగింది. రమేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ… వలంటీర్ల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చి… ఇప్పుడు వలంటీర్‌ వ్యవస్థనే లేదని చెబుతున్నారన్నారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ వ్యవస్థే లేకపోతే 2024 ఎన్నికల్లో ఊరూరా తిరిగి వలంటీర్ల వేతనాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. వలంటీర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని, వాళ్లని మోసగించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, వలంటీర్లు విధుల్లో లేకపోతే ఆనాడు ఎందుకు విపత్తుల శాఖ ఆదేశాలు జారీజేసిందని, లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారని నిలదీశారు. దీనిపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధాన మిస్తూ… రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని స్పష్టంచేశారు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని, వారికి సంబంధించి గత ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు వారితో రాజీనామా చేయించారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు పెంచేవాళ్ల మని తెలిపారు. మే వరకు కూటమి ప్రభు త్వం వలంటీర్లకు వేతనాలు చెల్లించామ న్నారు. వాలంటీర్లు లేనందున గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదనలు ఉత్పన్నం కాదన్నారు. వలంటీర్లపై వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న మంత్రి… వైసీపీ ప్రభుత్వానికి వలంటీర్లపై నిజంగా ప్రేమ ఉంటే వారిని పూర్తి స్థాయిలో నియ మించకుండా ఏడాది గడువుతో ఎందుకు కొనసాగిస్తూ వచ్చారని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వ బకాయిల చెల్లింపు: మంత్రి నారా లోకేశ్‌
గత వైసీపీ ప్రభుత్వం పెండిరగ్‌లో పెట్టిన రూ.4200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలన్నింటినీ కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో వాడీ వేడీగా చర్చ జరిగింది. 2019 ముందు అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను వైసీపీ ప్రభుత్వం 16 నెలలకు చెల్లించిందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని లోకేశ్‌ అన్నారు. విద్యావ్యవస్థపై చర్చించేటప్పుడు వైసీపీ వారు సభ నుంచి వాకౌట్‌ చేసి బయటకు వెళ్లి ఇప్పుడు మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై మంత్రి డోలా బాల వీరాంజనేయులు మాట్లాడుతూ, 2023-24 వరకు రూ.4064 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ వారే బకాయిలు పెట్టించి తిరిగి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది 787.84కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేశామని, త్వరలో కళాశాలల యజమాన్యాల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. కాగా ప్రశ్నోత్తరాల అనంతరం 2019`24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాల కుంభకోణాల అంశంపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేయగా… దాన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తప్పుపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు