Tuesday, July 15, 2025
Homeవాస్తవాలు చర్చిద్దాం

వాస్తవాలు చర్చిద్దాం

. పార్లమెంటును సమావేశపర్చండి
. ‘ఇండియా’ డిమాండ్‌
. ప్రధానికి 16 పార్టీల లేఖ

న్యూదిల్లీ : పార్లమెంటుకు ప్రభుత్వం జవాబుదారీ కాగా ప్రజలకు పార్లమెంటు జవాబుదారీగా ఉంటుందని ఇండియా ఐక్య సంఘటన నొక్కిచెప్పింది. పార్లమెంటులో ప్రజల గొంతుక వినిపించేదే ప్రతిపక్షమని వక్కాణించింది. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌`పాక్‌ ఉద్రిక్తతలు, కాల్పుల వివరణపై అమెరికా ప్రకటన, ఉగ్రవాదం అంతానికి వ్యూహాలు తదితర కీలకాంశాలపై చర్చించడం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్‌ చేసింది. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ‘ఇండియా’లోని 16 పార్టీల ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం కోసం ఉమ్మడిగా డిమాండ్‌ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేశ్‌, దీపేంద్ర సింగ్‌ హుడా, టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, ఆర్‌జేడీ ప్రతినిధి మనోజ్‌ రaా, శివసేన యూబీటీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ తదితరులు సమావేశానికి హాజరు కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌ పవార్‌) గైర్హాజరయ్యాయి. ఆప్‌ బుధవారం వేరుగా మోదీకి లేఖ రాయనుంది. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ దీపీందర్‌ సింగ్‌ హుడా మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతం చేసే వ్యూహాలపై చర్చించడమే కాకుండా సాయుధ దళాలకు ధన్యవాదాలు తెలిపేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించడం అవసరమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ క్రమంలో సర్కారుకు ప్రతిపక్షాలు అండగా నిలిచాయని, భారత్‌`పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రకటన చేసిన సమయంలోనే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పర్చాలని డిమాండ్‌ చేసినట్లు హుడా తెలిపారు.
తమ అభిప్రాయాలు, వ్యూహాలను ప్రపంచానికి తెలియజేస్తున్న మోదీ ప్రభుత్వం… అదే పనిని పార్లమెంటులో ఎందుకు చేయలేదని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్‌ ప్రశ్నించారు. పూంచ్‌, యూరి, రాజౌరీ తదితర అంశాలను మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు. పార్లమెంటులో ఈ అంశాలన్నింటిపై స్వేచ్ఛగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధానికి లేఖ రాసిన పార్టీల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, శివసేన (యూబీటీ), ఆర్‌జేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), ఐయూఎంఎల్‌, ఆర్‌ఎస్‌పీ, జేఎంఎం, వీసీకే, కేరళ కాంగ్రెస్‌, ఎండీఎంకే, సీపీఐ(ఎంఎల్‌) ఉన్నాయని చెప్పారు. ఆప్‌ వేరుగా ప్రధానికి లేఖ రాయనుందని డెరెక్‌ వెల్లడిరచారు. పార్లమెంటులో ప్రతిపక్ష గళానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, ప్రతిపక్షం అంటే ప్రజల గొంతకని సంజయ్‌ రౌత్‌ అన్నారు. ప్రధానికి ప్రతిపక్షం రాసినది సాధారణ లేఖ కాదన్నారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు రౌత్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహా మేరకు కాల్పుల విరమణ జరిగిందా? ప్రతిపక్షం పదేపదే డిమాండ్‌ చేస్తున్నా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఎందుకు నిర్వహించడంలేదు? ప్రత్యేక సమావేశం కోసం ట్రంప్‌ వద్దకు వెళ్లాలా అని ప్రభుత్వాన్ని రౌత్‌ ప్రశ్నించారు. శరద్‌ పవార్‌ పార్టీ గైర్హాజరీపై విలేకరులు ప్రశ్నించగా ఎన్‌సీపీ (ఎస్‌పీ) కూడా ఇండియాలో భాగమేనని చెప్పారు. సుప్రియా సూలే విదేశీ పర్యటనలో ఉన్నారని గుర్తుచేశారు. ముంబై చేరుకున్న తర్వాత శరద్‌ పవార్‌తో మాట్లాడతానని సంజయ్‌ రౌత్‌ వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు