నిలోత్పల్ బసు
బీజేపీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేతృత్వంలో అయోధ్య రామమందిర వివాదంలోని ఒక్కో అంశం వెలుగుచూస్తోంది. రామమందిర విరాళాల కుంభకోణం, దొంగతనం, నిధుల దుర్వినియోగం వివాదం ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీకి, ఆర్ఎస్ఎస్లకు రాజకీయ సంక్షోభంగా పరిణమించింది. అయోధ్య ఆలయంలో భక్తులు సమర్పించిన నగదు, విలువైన వస్తువులను పద్ధతి ప్రకారం దుర్వినియోగం చేయడం, అనుమానాస్పద భూలావాదేవీలు, సీసీ టీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్ వంటి అంశాల చుట్టూ ఈ వివాదం కేంద్రీకృతమై ఉంది. ఈ విషయం అధికార వర్గాల్లో కొంతమందికి తెలిసినా, దానిని బయటకు రానీయకుండా దాచిపెట్టారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం బట్టబయలయ్యేసరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం ఈ చోరీలు చాలా కాలంగా జరుగుతున్నా ఎందుకు ఎవరూ గుర్తించలేదు, గుర్తించినా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2020లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లోని ఉన్నతస్థాయి సభ్యులకు ఈ దొంగతనాల విషయం తెలియకుండా ఇంతకాలం జరిగిందా? అనేదే పెద్ద ప్రశ్న. ఇది కేవలం డబ్బు లేదా నగల దొంగతనం మాత్రమే కాదు. కోట్లాది మంది భక్తులు రాముడిపై ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయడమే. రామజన్మభూమి ఉద్యమం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇప్పుడు ఒక్కొకక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశంలో ప్రజల్లో ఉన్న మత విశ్వాసాన్నే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయి. ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కాదు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తన బాధ్యత నుంచి పూర్తిగా తప్పించుకోలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రామమందిర నిర్మాణం అంశంపై, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ తన తీర్పులో మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమైన విధ్వంస చర్యగా అభివర్ణించారు. అయితే అదే తీర్పులో ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం న్యాయపరంగా, రాజ్యాంగపరంగా అనేక సందేహాలను కలిగించింది. ఈ కేసులో వివాదాన్ని ముగించినప్పటికీ సరైన న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆలయ నిర్మాణం, నిర్వహణ, రోజువారీ వ్యవహారాలను ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్వహించాలని కోర్టు చెప్పింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ట్రస్ట్ నిజంగా స్వతంత్రంగా పనిచేస్తుందని నమ్మడం కష్టం. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయంగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుడని, అందువల్ల ఆ సంస్థ ప్రభావం ట్రస్ట్‌పై కూడా ఉంటుంది. రామజన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించిన విశ్వహిందూ పరిషత్‌కు ట్రస్ట్‌లో ప్రాధాన్యం లభించడం సహజమే. ట్రస్ట్ సభ్యుల ఎంపిక కూడా ముందే ఊహించిన విధంగానే జరిగింది. ట్రస్ట్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా అప్పట్లో జ్ఞానేశ్ కుమార్ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. అందువల్ల ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలకు ఇది కారణమవుతోంది. ట్రస్ట్ ఏర్పాటుతోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ముగియలేదు. ఆలయ నిర్మాణ ప్రారంభం, శంకుస్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజారోహణ వంటి ప్రతి ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నాయకత్వం వహించారు. మోదీ తన 12 సంవత్సరాల పాలనలో సాధించిన ప్రధాన విజయాల్లో రామమందిర నిర్మాణాన్ని కూడా చేర్చుకుంటారు. దీంతో ప్రధాని ఇటు రాజకీయ నాయకుడిగానే కాకుండా అటు మత నాయకుడి పాత్రను కూడా పోషిస్తున్నారు. ప్రస్తుతం రామమందిరంలో చోరీల అంశంపై బయటపడినప్పటికీ ప్రధాని ఇంతవరకూ స్పందించలేదు. కనీసం ‘ఎక్స్’లో కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేయలేదు.
2020లోనే అంటే ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యే ముందు జరిగిన ఆడిట్లో లెక్కల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమైనట్లు వార్తలు కూడా వచ్చాయి. అంటే అప్పటినుంచే పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం బయటకొస్తున్న వివరాలు కూడా అదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ప్రధాన మీడియా ఈ అంశాన్ని పెద్దగా ప్రచారం చేయకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంత దూరం వచ్చాక నిజాన్ని దాచడం అనేది ఆ రాముడికి కూడా సాధ్యం కాదు. ఆలయంలో సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం అనేది ఆశ్చర్యంగానే ఉంది. ప్రస్తుతం అయోధ్య బార్ అసోసియేషన్ కూడా నిందితులకు న్యాయ సహాయం ఇవ్వకూడదని బహిరంగంగా డిమాండ్ చేస్తోంది. చోరీ సమయంలో సీసీ టీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేసినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. ఇలాంటి పని ఉన్నతస్థాయి అధికారుల సహకారం లేకుండా జరిగే అవకాశం లేదు అన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. మొదట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదని, తరువాత పరిస్థితి తీవ్రత పెరగడంతో పోలీసు దర్యాప్తు ప్రారంభించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉంటుందని నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదు. అందువల్ల ఈ వ్యవహారంపై వెంటనే స్వతంత్ర న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ ఏర్పాటు చేయాలి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని కాపాడడం, న్యాయాన్ని నిలబెట్టడం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కోసం ఇది అత్యవసరం.


