Homeసంపాదకీయంఅపూర్వంగా ఖామేనీ అంతిమ యాత్ర

అపూర్వంగా ఖామేనీ అంతిమ యాత్ర

- Advertisement -

ఇరాన్ మీద ఇస్రాయెల్, అమెరికా ఒక్కుమ్ముడిగా యుద్ధం ప్రకటించిన మొదటి రోజే, ఫిబ్రవరి 28న ఇరాన్ అగ్రనాయకుడు అయతుల్లా అలీ ఖామేనీని అంతమొందించారు. ఆయన మరణించి నాలుగు నెలలు దాటాక 131వ రోజున అంటే శుక్రవారం (జులై 3న) ఖామేనీ అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభం అయింది. శుక్రవారం ప్రార్థనలు జరిగాయి. శనివారం అంతిమ యాత్ర మొదలవుతుంది. ఈ అంతిమ యాత్ర ప్రపంచ చరిత్రలోనే అత్యంత విశిష్టమైందిగా నిలిచిపోనుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ అంతిమ యాత్ర దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాటు సాగుతుంది. వచ్చే గురువారం కానీ ముగియవు. పైగా ఈ శవ యాత్ర ఇరాన్ సరిహద్దులను దాటి ఇరాక్‌లోని నజఫ్, కర్బలా నగరాలకు కూడా వెళ్తుంది. ఇరాన్‌లో షియాలు అధిక సంఖ్యలో ఉంటారు. ఇరాక్లోనూ షియాలు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. అందుకని ఖామేనీ పార్థివ శరీరాన్‌ని ఇరాక్ కూడా తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరణించిన తరవాత వీలైనంత త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయడం ఏ మతంలోనైనా అనుసరించే పద్ధతే. కానీ ఇరాన్ మీద యుద్ధం కొనసాగుతుండడం వల్ల ఖామేనీ అంత్యక్రియలు వెంటనే జరపడం సాధ్యం కాలేదు.
ఈ అంతిమ యాత్రలో లక్షలాది మంది పాల్గొననున్నారు. అనేక దేశాల ప్రతినిధులు కూడా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా పిలిచినా ఆయన వెళ్లడం లేదు. బిహార్ గవర్నర్, ఉద్యోగ విరమణ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించనున్నారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా కూడా ఈ ప్రతినిధి వర్గంలో ఉంటారు. ఇరాన్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను సైతం ఖామేనీ అంత్యక్రియల్లో పాల్గొనాలని కోరింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అంత్యక్రియలలో పాల్గొంటారు. నిజానికి అంత్యక్రియల్లో పాల్గొనాలని ఇరాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేను, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడానూ పిలిచింది. జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రాటిక్ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీని కూడా ఇరాన్ పిలిచింది. ఆమె హాజరయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల అగ్ర నేతలు ఈ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే విమానాలు అంతగా అందుబాటులో ఉండవు కనక ఇరాన్ ప్రత్యేక విమానాలను పంపే ఏర్పాటు చేస్తోంది. దాదాపు వంద రోజులకు పైగా జరిగిన యుద్ధంలో ఆక్రమణదార్లైన ఇస్రాయెల్, అమెరికాకు అండగా నిలిచిన యూరప్ దేశాల నాయకులను మాత్రం ఇరాన్ పిలవలేదు. అయతుల్లా అలీ ఖామేనీ జన్మస్థానం అయిన మసాద్‌లో ఆయన పార్థివ శరీరాన్‌ని సమాధి చేస్తారు. సరిహద్దులు దాటి ఇరాక్‌లోని నజఫ్, కర్బలాకు ఖామేనీ పార్థివ దేహాన్ని తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేకత ఉంది. నజఫ్‌లో హజ్రత్ అలీ, కర్బలాలో ఇమాం హుసేన్ దర్గాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేక మంది నాయకుల అంతిమయాత్రలు అత్యంత గౌరవప్రదంగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. వివిధ దేశాల నాయకులు మరణించిన నేతల అంతిమ దర్శనం కోసం ఒకటి రెండు రోజులు అంత్యక్రియలను వాయిదా వేసిన ఉదంతాలూ ఉన్నాయి. కానీ ఖామేనీ అంతిమ యాత్ర వీటన్నింటికన్నా విశిష్టమైందిగా నిలిచిపోతుంది. దాదాపు 30 దేశాల అధ్యక్షలో, ప్రధానమంత్రులో లేదా వారి ప్రతినిధులో ఖామేనీ అంతిమయాత్రలో పాల్గొంటారనుకుంటున్నారు. చైనా, రష్యా అగ్రనాయకులు పుతిన్, షీ జిన్ పింగ్ హాజరుకాకపోయినా ఇతర అగ్రనేతలను తమ ప్రతినిధులుగా పంపుతున్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ హాజరుకానున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌తో పాటు ఇతర నాయకులు కూడా ఖామేనీకి స్వయంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. యుద్ధం మొదలైన రోజున ఖామేనీని అంతం చేసినప్పుడే ఆయన కుటుంబలోని అనేక మంది కూడా అంతమయ్యారు. ప్రస్తుతం ఇరాన్ అగ్రనాయకుడు మొజ్తబా ఖామేనీ కూడా గాయపడ్డారు. అయితే ఆయన తన తండ్రి అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఆయనకు భద్రత కల్పించడం కష్టతరమైంది కనక ఆయన స్వయంగా పాల్గొనకపోవచ్చు. ఇరాన్ రాజధాని తెహ్రాన్ నుంచి శనివారం ప్రారంభం అయ్యే ఖామేనీ అంతిమయాత్ర ఖోమ్ లాంటి ఇరాన్ ప్రధాన నగరాల ద్వారా ఇరాక్‌లోని నజాఫ్, కర్బలా నగరాలకు వెళ్లి మళ్లీ ఇరాన్‌లో ప్రవేశిస్తుంది. ఖోమ్ ఇస్లామిక్ విద్యా కేంద్రం. అనేక మంది ఇరాన్ సీనియర్ నాయకులు ఇక్కడే మత సంబంధ విద్య అభ్యసించారు. ఈ అంతిమ యాత్రలో మూడు కోట్ల 50 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ఇంత భారీ సంఖ్యలో ఏ నాయకుడికీ, ఏ దేశంలోనూ నివాళులు అర్పించిన పూర్వోదంతాలు లేవు. శనివారం గ్రాండ్ మసల్లా నుంచి అంతిమ యాత్ర మొదలై అయిదో తేదీన తెహ్రాన్‌లో భారీ స్థాయిలో ప్రజలు నమాజులో పాల్గొని నివాళులు అర్పిస్తారు. సోమవారం తెహ్రాన్‌లో ఖామేనీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనారœం ఉంచవచ్చు. సోమవారం షియాలు పవిత్ర నగరంగా భావించే ఖోమ్కు అంతిమ యాత్ర సాగుతుంది. అక్కడ సంస్మరణ సభ జరుగుతుంది. బుధవారం ఇరాక్‌లోని నజఫ్, కర్బలాకు ఈ అంతిమ యాత్ర వెళ్తుంది. ఖామేనీ అంతిమ యాత్ర ఇరాన్ మత, రాజకీయ, దౌత్య ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ అంతిమ యాత్ర భవిష్యత్తులో పశ్చిమాసియాలో రాజకీయ సమతూకాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. అంతిమ యాత్ర ఏయే నగరాల ద్వారా వెళ్లాలో అని నిర్ణయించడంలోనే ఇరాన్ తన శక్తి సంపన్నత ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం అవుతోంది. నాయకులు మారొచ్చు. నాయకత్వం మారొచ్చు. కానీ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సైద్ధాంతికత మారదు అని ఇరాన్ నిరూపించదలచుకున్నట్టు ఉంది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన యుద్ధంలో దాడికి పాల్పడ్డ ఇస్రాయెల్, అమెరికా మెడýను ఇరాన్ వంచగలిగింది. ఆ రెండు దేశాల దగ్గరా అణ్వస్త్రాలున్నాయి. ఇరాన్ దగ్గర లేవు. కానీ తమ దగ్గరున్న క్షిపణులలాంటి వాటితోనే ఇరాన్ నిర్ణాయక విజయం సాధించింది. ఖామేనీ అంతమైన తరవాత కూడా తమ దేశం బలహీనపడక పోగా మరింత బలోపేతమైందని రుజువు చేయడానికి ఇరాన్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇరాన్ ధాటికి ఆగలేక ట్రంప్ రెండు సార్లు కాల్పుల విరమణ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ విరామ సమయాన్ని మరింత యుద్ధ సన్నద్ధం కావడానికి అమెరికా వినియోగించుకుని కూడా ఉండొచ్చు. అంతిమ యాత్ర సందర్భంగా ఇస్రాయెల్ ఎలాంటి ఆగడాలకు పాల్పడినా అది సర్వనాశానికి దారి తీయవచ్చు. ఇస్రాయెల్కు అలాంటి దుశ్చర్యలకు పాల్పడే అలవాటు ముందు నుంచే ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు