Homeవెనుకబడ్డ కులాలకు న్యాయం చేయాలి

వెనుకబడ్డ కులాలకు న్యాయం చేయాలి

- Advertisement -

తక్షణం కులగణన చేపట్టాలి: రామకృష్ణ

విశాలాంధ్ర`గుంటూరు కలెక్టరేట్‌ : తెలంగాణ, కర్నాటక తరహాలో రాష్ట్రంలో కూడా కులగణనకు చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జనగణనలో కులగణన తక్షణమే చేపట్టాలని… బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి అధ్వర్యంలో గుంటూరు మల్లయ్యలింగంభవన్‌లోని వీఎస్‌కే హాలులో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కులగణన చేయడమే కాకుండా ఆ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించారన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కులగణన చేపట్టారని, రానున్న రోజుల్లో ఆయా కులాలు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి పూనుకుంటున్నారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కులగణనతో కులాల వారీగా జనాభా, సామాజిక స్థితిగతులు తెలుస్తాయని, తద్వారా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో 143 బీసీ కులాలు ఉంటే కేవలం 10 కులాలకు చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందగా… మిగిలిన కులాల వారు ఇంకా వెనుకబడి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ అన్ని రంగాలూ ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్తున్నాయని, ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు ప్రైవేటు రంగం ఆధిపత్యం నెలకొందన్నారు. విద్య, వైద్య రంగాలు దాదాపు 70 శాతం ప్రైవేటు రంగం చేతుల్లో ఉన్నాయని, ప్రభుత్వ రంగం లేకపోతే రిజర్వేషన్లు ఉన్నా ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని ఇటీవల ఎన్నికల కమిషన్‌ ప్రకటించిందని… అయితే మూడు మాసాల ముందే ఎన్నికలు నిర్వహించాలని వారు భావిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేయాలని, జనాభా దామాషా ప్రకారం ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని… తద్వారా తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా న్యాయం జరుగుతుందని వివరిస్తామన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులగణన జరిగితే బీసీలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ యువతలో చైతన్యం నింపడంతో పాటు వారిని ఉద్యమంలో భాగస్వాములు చేసి చట్టసభలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్‌లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థి, యువజనులను ఉద్యమంలో భాగస్వాములను చేసి 60 శాతంగా ఉన్న మెజారిటీ ప్రజల చేతుల్లోకి రాజ్యాధికారం సాధించుకుందామని అన్నారు. ప్రముఖ వైద్యులు, బీసీ నాయకులు ఆలా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, టీడీపీ జిల్లా నాయకులు శివరామయ్య, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కొరివి వినయ్‌ కుమార్‌, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ముస్లిం లీగ్‌ రాష్ట్ర అధ్యక్షులు బషీర్‌ అహ్మద్‌, ఓబీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్‌ ప్రసంగించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఉత్తేజపరిచాయి. అనంతరం సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్‌ కుమార్‌ వక్తలకు స్వాగతం పలుకగా, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ ఎ.ఏడుకొండలు, బీసీ నాయకుడు సాంబశివరావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్‌ రావు, బీసీ ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరయ్య, నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర నాయకులు తాటికొండ నరసింహారావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జూపూడి శ్రీనివాసరావు, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కే ఖాజావలి, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్‌, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు కంచర్ల కాశయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, వలి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివ, శశి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి, నగర కార్యదర్శి లక్ష్మీ, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభుదాస్‌, కాబోతు ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విఠల్‌ రెడ్డి, జగన్నాధం, బీసీ సంఘం నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, కోలా అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు