కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ
‘ఎప్స్టీన్ ఫైల్స్’ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. ఏమిటా? అని అంతర్జాలంలోకి కొంచెం తొంగిచూస్తే చాలు, ఒళ్లు ఝల్లుమంటుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. అందులో నిక్షిప్తమై వున్నది ఏమిటి? దేశ దేశాల రాజకీయ నాయకుల చదరంగానికి సంబంధించిన వ్యూహ ప్రతివ్యూహాల ఎత్తుగడల చిట్టా. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాల మధ్య సంప్రదింపుల సయోధ్యల రాజీల కుట్రల రహస్యాలు. అందుకోసం అనుసరించిన జుగుప్సాకరమైన కిరాతక హింసాక్రీడ. రాజకీయ, పరిపాలన, ప్రచురణ-ప్రసార మాధ్యమ వ్యవస్థలు అన్నీ అందుకు వెన్నుదన్నుగా నిలిచిన దుర్మార్గపు తీరు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ నిజస్వరూపాన్ని, దాని వెనుక దాగివున్న అసలు స్వభావాన్ని ‘ఎప్స్టీన్ ఫైల్స్’ బహిర్గతం చేస్తున్నాయి.
ఏమిటీ ఎప్స్టీన్ ఫైల్స్? ఎప్స్టీన్ అనే అంతర్జాతీయ నేరచరితుని కార్యకలాపాలను వెల్లడించే పత్రాలు. ఎవరీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆమోదం పొందిన అంతర్జాతీయ నేరస్తుడు. అత్యంత క్రూరుడు. అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఆ వ్యవస్థ చేతిలోనే జైలుశిక్షకు గురై, జైలులోనే ఆత్మహత్యతో జీవితాన్ని అంతం చేసుకున్నవాడు. అతని మరణం అనుమానాస్పదం అనే అభిప్రాయాలూ ఉన్నాయి. అతడి సమస్త నేర కార్యకలాపాల చిట్టానే ఎప్స్టీన్ ఫైల్స్.
‘ఎప్స్టీన్ ఫైల్స్’ అనేవి 1990 నుండి 2019 వరకు సుమారు మూడు దశాబ్దాల కాలానికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు పత్రాలు. బాధితురాలు వర్జీనియా గిఫ్రే జరిపిన న్యాయపోరాటం ఫలితంగా ‘ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్సÎరెన్సీ యాక్ట్ – 2025’ ద్వారా సుమారు 30 లక్షల ఫైల్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైల్స్‌లో రహస్య డైరీలు, ప్రైవేట్ జెట్ ప్రయాణ వివరాలు, రెండు వేలకు పైగా వీడియోలు, ఒక లక్షా ఎనభై వేల చిత్రాలు ఉన్నాయి. 50కి పైగా దేశాలకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల ప్రమేయంపై ఈ పత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సాగిన ఈ నేర నెట్వర్క్ తీరుతెన్నులను ఈ దర్యాప్తు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయపోరాట ఫలితంగా తప్పని పరిస్థితుల్లో ఈ ఫైల్స్ ఇప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. వాటిని సీనియర్ పాత్రికేయులు కృష్ణ కానూరి ఎంతో శ్రమకోర్చి తెలుగుపాఠకుల కోసం పుస్తకంగా తీసుకొచ్చారు.
ఎప్స్టీన్ పుట్టుపూర్వోత్తరాలు, ఆదినుండీ అతనిలో ఉన్న మోసకారి స్వభావం, వంచనా నైపుణ్యాలను పరిచయం చేయడంతో ‘ఎప్స్టీన్ ఫైల్స్’ పుస్తకం ప్రారంభం అవు తుంది. ఇందులో ఎనిమిది చాప్టర్లు ఉన్నాయి. తొలి చాప్టర్ లో… 1. ఎవరీ ఎప్స్టీన్? 2. ఏమిటీ ఫైల్స్?, 3. జాబితా లోని ప్రముఖులు, 4. ‘అరాచక సామ్రాజ్యం’ నేపథ్యం, ప్రారంభం, విస్తరణ – దాని లక్ష్యం, 5. ఎప్స్టీన్ రాజ్యంలో దారుణాలు, హింస, పాపాలదీవి… అద్దాల మేడల వెనుక అనంతమైన చీకటి!, 6. జఫ్రీ ఎప్స్టీన్, ఘిస్లేన్ మాక్సెÇల్ నేర సామ్రాజ్యం, 7. చీకటి సామ్రాజ్యాన్ని నడిపించిన కీలక సూత్రధారులు… అనే అంశాలను వివరించారు. రెండో చాప్టర్లో 1. బాధితుల వ్యధారœ గాథలు, 2. గుట్టు బట్టబయలు, 3. నిఘాసంస్థలు ఏమయ్యాయి?, 4. వెండి వెలుగుల ముందు మోకరిల్లిన న్యాయదేవత, 5. జైల్లో నేరస్తుడి మరణం, 6. ఎప్స్టీన్ ది హత్యా, ఆత్మహత్యా? మూడో చాప్టర్ లో నేరగాళ్లకు న్యాయశాఖ ‘రక్షణ కవచం’, నాలుగో చాప్టర్లో ఎప్స్టీన్ ‘యమకూపం’ లో బ్రిటన్ రాజవంశం, ఐదోచాప్టర్లో ఐకాన్ల ముసుగులో సామాజిక వంచన… అంటూ 39మంది ఐకాన్ల పేర్ల జాబితాను, వారి వివరాలను రచయిత చేర్చారు. ఆరో చాప్టర్లో హాలివుడ్ లెజెండ్స్ తిరుగుబాటు, ఏడో చాప్టర్లో 1. అక్షర సైన్యం: ఎప్స్టీన్ కోటను కూల్చిన కలం యోధులు, 2. గ్లోబల్ ఎప్టోన్… వికృత సామ్రాజ్యాలు!, 3. ఐక్యరాజ్య సమితి ఆగ్రహం, చివరి చాప్టర్-8లో ఇండియాలో ఎప్‌స్టీన్‌లు. ఇలా అంతర్జాలంలో అందుబాటులో ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ ఆధారంగా వీలయినంత సంక్షిప్తంగా రచయిత ఎప్స్టీన్ పుట్టుపూర్వో త్తరాలు మొదలు నేరసామ్రాజ్య స్థాపన, విస్తరణ, అందుకు దోహద పడిన శక్తులు, వ్యక్తుల వివరాలను, అది కూలిపోయిన తీరుతెన్నులను, అందుకోసం అన్నింటికీ తెగించి కృషిచేసిన జర్నలిస్టులను, పోరాటాలను తెలుగు పాఠక లోకానికి అందించారు.
ఏడో చాప్టర్లో మొదటిఅంశం ‘అక్షర సైన్యం: ఎప్స్టీన్ కోటను కూల్చిన కలం యోధులు’. ఇందులో ఎప్స్టీన్ పుట్టుపూర్వోత్తరాలు మొదలు నేరసామ్రాజ్యం గుట్టును రట్టుచేసిన కలం యోధులను పరిచయం చేశారు. వారి సాహసాలను, పోరాట పటిమను ఉత్తేజకరంగా చాటారు. ఏకంగా పరిపాలన, రాజ్యాంగ వ్యవస్థల పైనే వారి పోరాటం సాగిన తీరు ఇందులో కనిపిస్తుంది. ‘కడుపులోని బిడ్డలకు ప్రాణహాని ఉన్నా భయ పడకుండా ఎప్స్టీన్ రాక్షసత్వాన్ని రికార్డు చేసిన వికీక్క వార్డ్, ఒక మాజీ డిటికిట్వ్ పదునుతో ఆ అద్దాల మేడల వెనుక ఉన్న నేరసామ్రాజ్య పునాదులను తొలిసారిగా కదిలించిన జాన్ కానోలీ… పరిశోధనాత్మక జర్నలిజానికి కొత్త నిర్వచనం. న్యాయం నిద్ర పోతున్న వేళ, మయామి హెరాల్డ్ వేదికగా జూలీ కె. బ్రౌన్ సాగించిన ఒంటరి పోరాటం ఒక అద్భుతం. సేకరించిన 80మందికి పైగా బాధితుల కన్నీటి గాథలకు, ఆమె అన్వేషణకు, బాధితుల మౌనరోదనకు తన కెమెరా కంటితో దృశ్యరూపం ఇచ్చారు ఎమిలీ మిచాట్. అవి అక్షరానికి అమేయమైన శక్తినిచ్చాయి. తన సొంత గాయాన్నే స్ఫూర్తిగా మలచుకొని కోర్టు గదిలో మాక్సెÇల్ లాయర్ల గర్జనల మధ్య బాధితుల పక్షాన నిలబడ్డారు లూసియా ఓస్బోర్న-క్రౌలీ. జర్నలిజంలో ‘ట్రామా ఇన్ఫార్మ్’ రిపోర్టింగ్‌కు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. ప్రపంచాన్ని శాసించే అపర కుబేరులు, అగ్రరాజ్యాల అధినేతలు, రాజవంశీకులు ఒకవైపు, ఈ అసమాన యుద్ధంలో వ్యవస్థల మౌనాన్ని చీల్చుకుంటూ, అధికార గర్వాన్ని మట్టికరిపించిన ఈ ఐదుగురు సామాన్య జర్నలిస్టులు ఒకవైపు’ అంటారు రచయిత.
ఈ పుస్తకానికి సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ ‘ఒక నీచుడు మరణిస్తే…’ అంటూ ముందుమాట రాశారు. అందులో ఈ వ్యవస్థ క్రూర, జుగుప్సాకర నగ్నత్వాన్ని ఆవిష్కరించారు. ‘రాజకీయాలు, గూఢచర్యం, సెక్స్, నోట్లకట్టలతో అగ్రరాజ్యాల పాలకులనే తన కాళ్ల దగ్గరకు రప్పించుకున్న అంతర్జాతీయ కిరాతకుడు జెఫ్రీ ఎప్స్టీన్ నిర్మించిన అభేద్యమైన చీకటి సామ్రాజ్యం అది! సముద్రపు అలల మధ్య అతడు సృష్టించిన ‘సుఖలాలస దీవి’లో నిస్సహాయులైన ఆడపిల్లల కన్నీళ్లు, వేదనల వెనుక దాగిన భయంకరమైన నరకకూపాన్ని ప్రపంచం ముందుకు తెచ్చిన అపూర్వ పరిశోధన ఇది. అంతర్జాతీయ సెక్స్ స్కాండల్స్, గ్లోబల్ కుంభకోణాలపై ఇంగ్లీషులో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. తెలుగులో అలాంటి ప్రయత్నం దాదాపు శూన్యం. ‘నిజాల వెనుక ఉన్న ప్రతి నిగూఢ సాక్ష±యూన్ని వెలికితీస్తూ… అతి చిన్న వివరాల నుంచి, వాడుకున్న ఆడవాళ్ళని నరికి చంపిన కిరాతకం దాకా… శ్రద్ధగా, ఒక నిబద్ధతతో నిజాయితీగా ఆవిష్కరించాడు కృష్ణ. ఎప్స్టీన్ ఫైల్స్ అరాచకాలను మన కళ్ల ముందు పరిచి, ఈ సంచలన రచనతో తెలుగు జర్నలిజంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మనం జల్సాగా బతికేస్తున్న ఈ లోకం వెనుక ఇలాంటి వికృత ప్రపంచం కూడా ఒకటి ఉంటుందా? అని అడుగడుగునా గుండెల్ని పిండేసే నిజాన్ని నిబద్ధతతో రికార్డు చేసిన అసాధారణ గ్రంథం ఇది’ అంటారు ప్రకాష్.
విద్యార్థి దశ నుండి వామపక్ష ఉద్యమ నేపథ్యం కలిగి వున్న రచయిత కృష్ణ. సహింపరాని దుర్మార్గం పట్ల తన ఆందోళన, ఆగ్రహాల సహజ స్పందన ఇందులో ప్రతి సందర్భంలోనూ కనిపిస్తాయి. రచయిత పాత్రికేయ వృత్తిలోంచి వచ్చినవాడు కావడం వల్ల రచనాశైలి పాఠకులను మరింత ఆకర్షించే విధంగా ఉంది. ‘… ఆ సమాధి వెనుక దాగిన రహస్యాలు, కుట్ర సిద్ధాంతాలు నేటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఒక వెలుగు వెలిగిన అరాచక శక్తి, చివరకు ఏ గుర్తూ లేని మట్టిదిబ్బ కింద నిశ్శబ్దంగా కలిసిపోవడం ఒక చారిత్రక పరిణామం’. ఎప్స్టీన్ జీవిత చరమాంకానికి రచయిత ఇచ్చిన ముగింపు వ్యాఖ్య ఇది.
సెల్: 94911 28554


