కె. సుజాతారావు
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పదం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పి.పి.పి). అంటే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలు కలిసి చేపట్టే ప్రాజెక్టులను పిపిపి మోడల్ అంటారు. ప్రైవేట్ సంస్థల సహకారంతో పాలనను మరింత సులభతరం చేసుకోవడమే పిపిపి లక్ష్యం. ఐతే ప్రస్తుతం పి.పి.పి విధానంపై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆస్తులుగా ఉండాల్సిన జిల్లా ఆసుపత్రులను ప్రైవేటీకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యావకాశాలు సన్నగిల్లుతాయని, ప్రభుత్వ ఉద్యోగాలు హరించుకుపోతాయనే ఆందోళన నెలకొంది. ప్రైవేటు పెట్టుబడిదారులు రిక్రూట్‌మెంట్‌లో కోటా విధానాన్ని పాటిస్తారని గానీ, అలవెన్సులు చెల్లిస్తారన్న గ్యారెంటీ ఉండదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడిదారులకు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఆసుపత్రిలో 70శాతం పడకలలో ఆయుష్మాన్ భారత్ పథకం రేట్లకు వైద్యసేవలు అందించాల్సి రావడం, ప్రభుత్వ చెల్లింపుల్లో జాప్యం వంటి రిస్కులను భరించాల్సి వస్తుందన్న భయం నెలకొంది.
కాబట్టి ఈ ‘రిస్క’లను తట్టుకోవడానికి ప్రైవేటు పెట్టుబడిదారులు దొడ్డిదారిన క్యాపిటేషన్ ఫీజు వసూళ్ళకు పాల్పడే అవకాశం లేకపోలేదు. అలాగే ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్ధేశంతో బోధనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకుండా చూడొచ్చు. ఆరోగ్య సేవల నాణ్యతా లోపాలు, సేవల నిరాకరణకు పాల్పడవచ్చు. డిమాండ్ లేదు, పేషెంట్లు లేరనే పేరుతో 70శాతం పడకలలో కావలసిన మేరకు మార్కెట్ రేట్లతో వైద్యం చేసుకునే వాటిగా మార్చేసుకునే అవకాశం ఉంది. అన్నిటికన్నా మించి ప్రభుత్వంతో పేచీ వచ్చి కోర్టులకెక్కితే పరిష్కారానికి ఏళ్ళకేళ్ళు పట్టొచ్చు. జిల్లా ఆసుపత్రుల మీద సర్వాధికారాలను ప్రైవేటు సంస్థలకు 66ఏళ్ళపాటు కట్టబెట్టే పద్ధతి న్యాయంగా లేదు. దీనిని పునఃసమీక్షించాలి.సమగ్ర ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పిస్తే 30 శాతం ఆసుపత్రుల చేరికలను నివారించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతాలవారీగా తరచూ వచ్చే రోగాలను, వాటిలో మార్పులను అంచనావేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 650పడకల ఆసుపత్రులను నెలకొల్పాల్సిన అవసరం ఉందో లేదో నిర్ధారించవచ్చు. పి.పి.పి పద్ధతిన జిల్లాస్థాయిలో ఆసుపత్రులు నిర్మిస్తే ప్రజారోగ్య వ్యవస్థ క్షీణించిపోతుంది.
కళాశాలలు ఎన్ని : మూడేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వైద్య కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వీటితో కలిపితే ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కి పెరుగుతుంది. ప్రైవేటు రంగంలో 19 వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో 10 వైద్య కళాశాలలను పి.పి.పి పద్ధతిన నెలకొల్పాలని భావిస్తోంది. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే కొత్తగా 6500సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రతిపాదిత 10వైద్య కళాశాలలకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 835ఎకరాల భూమి సేకరించింది. ఈ కళాశాలల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఒక్కో వైద్య కళాశాల స్థాపనకు 450 కోట్ల రూపాయల చొప్పున 4500 కోట్ల నిధులు అవసరమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, నాబార్ట్ రుణాలతో ఈ నిధులు సమకూరుతాయి. ప్రతి వైద్యకళాశాలలో 150 ఎం.బి.బి.ఎస్ సీట్లు, దానికి అనుబంధంగా 650 పడకల జిల్లా ప్రభుత్వాస్పత్రి భవిష్యత్తులో అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ వైద్యకళాశాలలో ఫీజు రాయితీ కల్పిస్తారు. ఆర్థిక నిర్వహణ భారంకాకుండా ప్రభుత్వం మూడంచెల విధానంలో ఫీజులు నిర్ణయించింది. 50శాతం సీట్లకు ఏడాదికి 15,000 రూపాయిలు ఫీజు చొప్పున, 35శాతం సీట్లు 12లక్షల ఫీజు చొప్పున, 15శాతం సీట్లు ఎన్నారైలకు 20 లక్షల ఫీజు చొప్పున వసూలు చేస్తే ఏడాదికి ఒక్కో బ్యాచ్ నుండి 11కోట్ల ఆదాయం లభిస్తుంది. ఐదేళ్ళ కోర్సు పూర్తయ్యేసరికి 55కోట్ల ఆదాయం వస్తుంది. వీటికి తోడు కాలేజీలో విద్యాబోధన మొదలైన రెండవ ఏడాదిలో 28 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు లభిస్తాయి. ఇవి 50 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సీట్ల ఫీజు ఎం.బి.బి.ఎస్ ఫీజుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2024లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా నీతిఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం 11వైద్య కళాశాలలను పి.పి.పి పద్ధతిన నిర్వహించడానికిగల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చెయ్యడానికి కె.పి.యం.జిని నియమించింది. పి.పి.పి పద్ధతిన కళాశాల, జిల్లా ఆసుపత్రుల నిర్వహణకు అవసరమయ్యే భూమిని ఎకరాకు 100 రూపాయల చొప్పున 33ఏళ్ళకు లీజుకు ఇవ్వాలి అవసరమైతే మరో 33ఏళ్లకు పొడిగించాలి. ప్రాజెక్టు ఖర్చులో ప్రభుత్వం 25శాతం వాటా ‘వయబిలిటీ ఫండింగ’ పేరుతో సమకూర్చాలి. రాష్ట్ర ఆరోగ్య బీమా సదుపాయం కింద సేవలు అందించే ఆసుపత్రిగా ప్యానల్‌లో చేర్చాలి. జాతీయ వైద్య కమిషన్ తదితర సంస్థల నుండి అనుమతులు తెచ్చిపెట్టాలి.70 శాతం పడకలు నిండేందుకు హామీ ఇవ్వాలి. ఇందుకు ప్రతిగా పెట్టుబడి పెట్టే సంస్థ రెండేళ్ళలో నిర్మాణ పనులు పూర్తిచెయ్యాలి. ఔట్ పేషెంట్లకు ఉచిత వైద్యసేవలు అందించాలి. ‘ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా’ కింద ప్రభుత్వం సిఫార్సు చేసే పేషెంట్లకు 70 శాతం పడకల ఉచిత వైద్యసౌకర్యం కల్పించాలి. మిగిలిన 30 శాతం పడకలకు సంబంధించి మార్కెట్ రేటుకు వైద్యం చేసుకోవచ్చు. నిర్దిష్ట గడువు పూర్తయ్యేలా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక ఇంజనీరుని నియమించాలి. జనఔషధి ఫార్మసీకి, మెడికో లీగల్ కేసుల నిమిత్తం చెరో 500 చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసి అందించాలి.
ఆరోగ్యం ప్రజలందరి ప్రాథమిక హక్కు : మన రాష్ట్రంలోని ప్రజారోగ్య వ్యవస్థలో చాలా లోపాలున్నాయి. తగినంత మంది సిబ్బంది, స్పెషలిస్టుల కొరతతో, మౌలిక సౌకర్యాలు, నిధుల లేమితో కునారిల్లుతున్నాయి. ప్రభుత్వమే వైద్యకళాశాలలను నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడానికి ముందుకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అరడజను కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. కనీసం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని అమలు చేయకలేకపోయింది.చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించిన ఉదాహరణ చూశాం. ఇటువంటి పీపీపీ మోడల్స్ వల్ల ఆశించిన ఫలితాలు రావు. అసలే వైద్యవిద్య సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్య వ్యవస్థను ప్రైవేటీకరించడం శ్రేయస్కరం కాదు. ఒకప్ప్పుడు ఐ.టి బూమ్ సమయంలో విచ్చలవిడిగా నెలకొల్పిన ఇంజినీరింగ్ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరతతో ఎన్ని కాలేజీలు మూతపడ్డాయో తెలిసిన విషయమే. తగినంత మంది బోధనా సిబ్బంది లేకుండా వైద్యకళాశాలలు నెలకొల్పితే అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు ఎలా అందుతున్నాయో చూస్తున్నాం.ఆంధ్రప్రదేశ్ ప్రైవేటీకరణ వైపు కాకుండా ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. ఆరోగ్యం ప్రజలందరి ప్రాథమిక హక్కు, దానిని వ్యాపార వస్తువుగా మార్చడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
కేంద్ర ప్రభుత్వ మాజీ ఆరోగ్య కార్యదర్శి
(‘హిందూ’ సౌజన్యంతో)


