నేటి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే జనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక వాక్యం వెల్లడిస్తుంటారు. “సంపద సృష్ష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టిస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తాను” అని. అది ఒక నినాదంగా ఆయన వెల్లడిస్తుంటారు. ఆ నినాదాన్ని అమలుజరిపే విధానం మాత్రం వెల్లడించడం మరుస్తున్నారేమో అనిపిస్తూంది. రాష్ట్రాభివృద్ధిని కలలు గనే తపస్సులో ఫలసిద్ధి యింకా సూత్ర-బద్దమై ఆయనకు సానుకూల పడలేదేమోనన్న అనుమానము జనంలో తలెత్తుతూంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అప్పుల ఊబిలో తలమునకలై ఈదుతుంది అనేది నగ్నసత్యం. తెచ్చెడి అప్పులు ఏ పద్దుకు ఎంత కేటాయిస్తున్నారో, అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఎంత కేటాయిస్తున్నారో అనెడి మీమాంస తేటతెల్లమవడం లేదు. పారిశ్రామికాభివృద్ధి ముసుగులో ప్రభుత్వ భూములు అడ్డగోలుగా నామినల్ రేటుకు అసమ్మదీయులకు కట్టబెట్టడం రికార్డు ఎవిడెన్స్‌గా వెల్లడవుతూనే వుంది. భూములు దక్కించుకున్నవారు ఎంతవరకు పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారో వేచి చూడాల్సి వుంది. తిరుపతి ‘లడ్డు’ వివాదం సామాన్య జనంలో సైతం అలజడి సృష్టించింది. పాలనా వైఫల్యాలు వెంటనే జనం గమనించకుండా ఉండాలంటే, జనం గ్రుడ్డిగా నమ్మే నమ్మకం, విశ్వాసం మీద సామాజిక ప్రయోజం లేని గతించిన అంశాన్ని నిందారోపణలతో వెల్లడిస్తూ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం చేయించడం పాలకుల రాజకీయ నేర్పరితనంలో ఒక భాగమైపోతుంది. చివరకు ఈ నిందారోపణలకు రుజువులు దొరకని రుగ్మతలు గానే మిగిలిపోతుంటాయి. రాజకీయ ప్రత్యర్థులను అపఖ్యాతి పాలు చేయడమే యిందిమిడి ఉన్న రాజకీయం. రాజకీయ నాయకులు చేసే ఆరోపణలకు కచ్చితమైన సాక్షాధారాలు దొరకవు, అవి భవిష్యత్‌లో నిగ్గుతేల్చి శిక్షలు పడ్డ దాఖలాలు ఉండవు. నిందారోపణలు ఓ పెద్ద రగడగా సృష్టించి వారనుకున్న పని పూర్తికాగానే వదిలేస్తుంటారు. వాటి మీద నిగ్గు తేల్చే ఎంక్వయిరీలు కొనసాగవు అనేది అందరకు తెలుసు. అధికార దాహం రాజకీయాలకు ఆయువు పట్టై కూర్చుంది. రాజకీయ సిద్ధాంతాలు రాజకీయ పార్టీలు పెట్టిన వారికే తెలియవు. ఈనాడు రాజకీయ పార్టీలు కుల, మత మూలాల్లోంచి పురుడోసుకొంటున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ఈ పార్టీల ఆయువు చాలా తక్కువనే చెప్పొచ్చు. పార్టీ స్థాపించిన నాయకుడు అస్తమిస్తే ఆ రాజకీయ పార్టీ కూడా వాడితోనే అస్తమించిన సందర్భాలు కోకొల్లలు.
ఇటువంటి పార్టీలు క్షణభంగురంగా అస్తమించడానికి బలమైన కారణం అవి రాజకీయ సిద్ధాంతాల్లోంచి ఆవిర్భవించకపోవడమే! ప్రాంతీయతత్వంతో కుల, మత, వర్గ ఐక్యతతో ఏర్పాటైన రాజకీయ పార్టీలు ఒక ముఠాగానే ఉంటాయి. అక్రమ సంపాదనలుండి, రాజకీయ పదవులు వెలగబెట్టాలనే వాంఛలున్నవారు ఎన్నికల్లో నిలబడే అర్హత పొందేûందుకు ఇటువంటి పార్టీలను ఆశ్రయిస్తుంటారు. వారి ఆర్థికస్థోమత వలన కులబలం వలన వారు నిలబడ్డ పార్టీలో గెలుపు సాధించడం కూడా సర్వసాధారణమైపోయింది. ఎప్పటినుంచో సిద్ధాంతపరంగా రాజకీయాల్లో రాణిస్తున్న పార్టీలు, అధికారంలోకి రాలేకపోయినా, పార్టీ సైద్ధాంతిక విలువల్ని కాలరాయకుండా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పార్టీ మనుగడకు భంగం రానీయకుండా పార్టీలు సజీవంగానే సాగిపోవడం చూస్తున్నాం. ఈ పార్టీలకు నీతి, నిజాయితీ, Å£మిట్‌మెంట్ ఎక్కువ. ఈ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోతే క్రుంగిపోవు, గెలిస్తే పొంగిపోవు. ఈ పార్టీలు సైద్ధాంతిక విలువల నుండి జారిపోకుండా, అడ్డదారి గెలుపులకు గేట్లు ఎత్తి వేయకుండా నమ్మిన సిద్ధాంతం మూసలోనే తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బతుకుతుంటాయి. పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం సైద్ధాంతిక వ్యతిరేకమైన పార్టీలతో పొత్తుపెట్టుకోదు. అక్రమ లావాదేవీలకు తలవంచదు. సైద్ధాంతికపరమైన ఈ పార్టీలకు గ్రామస్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు సైద్ధాంతిక విలువలతో అంటకాగిన సైన్యంలాంటి కేడరుంటుంది. వారు పార్టీ ప్రిన్సిపల్స్‌కు కట్టుబడి జీవితాన్ని కొనసాగిస్తుంటారు.
వీరు నిరుపేదలుగా జీవిస్తున్నా, తాము నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తించరు. ఆర్థిక ప్రలోభాలకు లోబడి పార్టీ మారరు. క్రమశిక్షణ గల సైనికుల్లా ఎత్తిన జెండా దించరు. జీవితాంతం ఒకే పార్టీలో కొనసాగుతూ జీవితాన్ని చెమట చిత్తడిలో నాన్చి తరించిన వారు సైద్ధాంతికపరమైన పార్టీల్లోనే కనిపిస్తుంటారు. ఈనాడు ‘దేశం’ దగాకోరు మతఛాందస రాజకీయ పార్టీ లాలిత్యంలో సేద తీరుతుందో, చితికి పోతుందో అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. నేటికీ నిరుపేదల బతుకులు గ్రుడ్డి దివ్వెల మసక వెలుగుల్లో గతుకుతూనే వున్నాయ్. వెట్టిచాకిరీ వెతల్లో దీనాతిదీనంగా మలిగిపోతూనే వున్నాయ్. ఆర్థిక అసమానతలు పడగవిప్పి ఆడుతూనే ఉన్నాయ్. ఉపాధి హామీలు నోరూరిస్తూనే వున్నాయ్. ఉత్కంఠభరిత ఉద్యోగావకాశాలు ప్రభుత్వ ప్రకటనల్లోకి ఎక్కలేక నిమ్మకు నీరెత్తినట్లు జనానికి ముఖం చూపించలేకపోతున్నాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీతో కొత్త ఉద్యోగవకాశాల ప్రకటనలు వెలుగు చూడడానికి వెలుస్తున్నాయ్! నిరుద్యోగ యువత ఆశావాహక దృక్పధంతో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అప్పుల నిప్పుల సెగల్లోకి తల్లిదండ్రులను నెట్టి పట్టణాల్లో ఉన్న కోచింగ్ సెంటర్ల చుట్టూ యువత తిరుగుతున్నారు. అప్పుడప్పుడు బహిరంగ సభల్లో పాలకులు వినిపించే ఉద్యోగవకాశాల ప్రకటనల వాగ్దానాలను మన్నన చేసుకుంటూ నిరుద్యోగ యువత ఆశావాహక స్థితిలో బతుకీడుస్తున్నారు. ఏదిఏమైనా ముఖ్యమంత్రిగారు సంపద సృష్టించే సంస్కారవంతమైన చర్యల్లో నేటి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించి ఆర్థికంగా ఆదుకుంటారని ఆశిద్దాం. రాజకీయ గాలివాటం వాగ్దానాల్లాగే సంపద సృష్టించే కార్యక్రమాల్ని గాలికి వదిలేయకుండా త్వరితగతిన మార్గాన్వేషణలోకి దిగిపోతారని ఆశిద్దాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగారు సంపద సృష్టించే కార్యక్రమాన్ని వెంటనే తలపెడతారని, అప్పుల ఊబిలో కూరుకపోతున్న మన రాష్ట్రాన్ని ఆర్థికబలంతో అభివృద్ధిని కాంక్షిస్తూ, అడుగులు ముందుకు వేసే చొరవ తీసుకుంటారని ఎదురుచూస్తున్న ఆంధ్రావని ఆశలు నెరవేరుస్తారని ఆశిద్దాం. పాలకపక్షం ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షం పాలకపక్షాన్ని, నిందారోపణలతో బూతుపురాణం విప్పకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపునకు నలభై యేండ్లు పైబడిన అనుభవం గల రాజకీయ నాయకులుగా నడిపిస్తారని మన ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ వారు చూపే అభివృద్ధిని తిలకించేందుకు ఆబాలగోపాలం ఒళ్లంతా కళ్లు మొలిపించుకొని ఎదురు చూస్తున్నారనడం అతిశయోక్తికాదు.
సెల్ : 9948774243
సంపద సృష్టి నినాదమేనా…విధానంలోకి దిగుతారా?కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
- Advertisement -


