Sunday, November 16, 2025
Homeసంపాదకీయంసంఫ్‌ును మాలిమి చేస్తున్న మోదీ

సంఫ్‌ును మాలిమి చేస్తున్న మోదీ

- Advertisement -

సంఫ్‌ు పరివార్‌ గురుపీఠం అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ుకు, ప్రధానమంత్రి మోదీకి మధ్య తెరచాటుగా రగులుతున్న సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. అందుకే బీజేపీ అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకం ఇంత జాప్యం అయిన సందర్భం బీజేపీ చరిత్రలోనే ఉన్నట్టు లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను మచ్చిక చేసుకోవడా నికి, తాను క్రమశిక్షణగల ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తను అని నమ్మించడానికి ప్రధానమంత్రి మోదీ గురువారం వివిధ పత్రికల్లో సుదీర్ఘ వ్యాసం రాశారు. మోహన్‌ భగవత్‌కు 75 ఏళ్లు నిండిన సందర్భంగా మోదీ ఈ వ్యాసం రాసి భగవత్‌ను కీర్తించడంలో నిమగ్నమైనారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 75 ఏళ్లు నిండిన వారు పదవి నుంచి తప్పుకోవాలని సంఫ్‌ు నాయకుడు మేరోపంత్‌ పింగ్లే అన్నారని మోహన్‌ భగవత్‌ గుర్తు చేశారు. ఇది అన్యాపదేశంగా వచ్చే 17 వ తేదీన మోదీకి 75 ఏళ్లు నిండుతాయి కనక ఆయన పదవి నుంచి తప్పుకోవాలని భగవత్‌ ఉద్దేశం అనేది స్పష్టంగానే తెలుస్తోంది. కానీ సూటిగా చెప్పకుండా మోహన్‌ భగవత్‌ పూర్వోదంతాలను ఉటంకించారు. కానీ ఇక్కడే ఒక చిక్కు సమస్య ఎదురైంది. అధికారికంగా సంఫ్‌ు కానీ, బీజేపీ కానీ 75 ఏళ్లు నిండిన వారు పదవుల్లోంచి తప్పుకోవాలన్న సూత్రాన్ని శంఖంలో పోయలేదు. అదీ కాకుండా మోదీ కన్నా వారం రోజుల ముందే మోహన్‌ భగవత్‌కు గురువారం 75 ఏళ్లు నిండాయి. కానీ తనకు పదవి నుంచి తప్పుకునే ఉద్దేశం లేదని భగవత్‌ అరమరికలకు తావు లేకుండానే చెప్పేశారు. అంటే మోదీ మీద సంఫ్‌ుకు ఎంత అసంతృప్తి ఉన్నా దిగిపొమ్మని ఒత్తిడి చేసే అవకాశం లేకుండా పోయింది. అధికారంలో ఉన్న వారికి అహంకారం ఉండకూడదని, విద్య ఆరోగ్య రంగాల్లో ఇంకా చేయవలసింది ఎంతో ఉందని గతంలో భగవత్‌ చేసిన వ్యాఖ్యలు సైతం మోదీని ఉద్దేశించినవే. నిజానికి ఈ దశలో మోదీని పదవి నుంచి తప్పించే స్థితిలో సంఫ్‌ు లేదు. బీజేపీ ఎటూ లేదు. మోదీ సంఫ్‌ు అధినేత భగవత్‌ను పొగడడానికి మరో కారణమూ ఉంది. సంఫ్‌ు అవతరించిన పాతికేళ్లకు భగవత్‌ జన్మించారు. భగవత్‌ సమాజ సేవలో భాగంగా అనేక త్యాగాలు చేశారని కూడా మోదీ రాశారు. కానీ అవేమిటో మాత్రం చెప్పలేదు. భగవత్‌ కేవలం సంఫ్‌ు నాయకుడే కాదని, ఆయన అనేక సంగీత వాద్యాలు వాయించగలరనీ మోదీ గుర్తు చేశారు. సాధారణంగా సంఫ్‌ు నేతల గురించిన ఇలాంటి వివరాలు చర్చకురావు. భగవత్‌ ఎదుటి వారి వాదనను శ్రద్ధగా వింటారని కూడా మోదీ అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటినా ఆయన భగవత్‌ను కలుసుకున్న సందర్భాలు తక్కువ. ఆ మధ్య నాగపూర్‌ వెళ్లినప్పుడు మోదీ సంఫ్‌ు ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. భగవత్‌ అనేక సందర్భాలలో దిల్లీ వస్తూ ఉంటారు. కానీ మోదీతో సంభాషించిన వార్తలేవీ బయటకు రాలేదు. భగవత్‌కు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినప్పుడైనా మోదీ సంఫ్‌ు అధినేత గురించి నాలుగు మంచి మాటలు చెప్పి ఉండొచ్చు. కానీ ఆయనకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రత్యేక వ్యాసమే రాయడానికి 75 అన్న సంఖ్యకు ఇటీవలి కాలంలో బీజేపీ వర్గాలలో వచ్చిన ప్రాధాన్యానికి సంకేతం. 75 ఏళ్లు నిండితే నేను సంఫ్‌ు బాధ్యతల నుంచి తప్పుకుంటాననీ లేకపోతే మరెవరైనా తప్పుకోవాలని అనలేదని భగవత్‌ వివరణ ఇచ్చారు. ఆయన సూటిగా ఈ మాట చెప్పని మాట నిజమే. మేరోపంత్‌ పింగ్లేకు 75 ఏళ్లు వచ్చిన సందర్భంలో ఓ సత్కారం జరిగింది. ఆ సందర్భంగా సత్కరించడం అంటే పదవి నుంచి తప్పుకోవాలని పరోక్షంగా చెప్పడేమేనని పింగ్లే అన్నారు. దీన్నే భగవత్‌ గుర్తు చేశారు. అక్కడితో మోదీకి భగవత్‌కు మధ్య అంత సయోధ్య లేదేమోనన్న భావన రాజకీయ వర్గాలలో కలిగింది. కానీ పదవీ విరమణ ఉత్తుత్తిదేనని స్వయంగా భగవతే తేల్చేశారు.
మోదీ అధికారం అంతా తన గుప్పెట్లోనే పెట్టుకున్నారన్న భావన మాత్రం భగవత్‌ మాటల్లో పదే పదే కనిపించింది. మోదీ కార్యశైలి సంఫ్‌ు పరివార్‌కు మింగుడు పడ్తున్నట్టు లేదు. తమది కేవలం సమాజ సేవకోసం ఏర్పడిన సాంస్కృతిక సంఘం అని ఆర్‌ఎస్‌ఎస్‌ విరామం లేకుండా చెప్తూనే ఉంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కచ్చితంగా బీజేపీకి తల్లి వేరు లాంటిదే. ఆర్‌ఎస్‌ఎస్‌ సమ్మతి లేకుండా బీజేపీలో చీమైనా కుట్టదు. బీజేపీ సంఫ్‌ుకు అనుబంధ సంస్థ కనకే బీజేపీ ఏం చేయాలన్నా సంఫ్‌ు ఆమోదముద్ర ఉండాల్సి వస్తోంది. ఇది మొదటి నుంచీ ఉన్న సంప్రదా యమే. వాజపేయి, అడ్వాణీ లాంటి వారు బీజేపీ అగ్ర నేతలుగా ఉన్న సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తమకు నచ్చని రీతిలో ఈ అగ్ర నేతలు ఇద్దరూ పని చేస్తే సుతి మెత్తగానైనా మందలించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సంఫ్‌ు అధినేత మోహన్‌ భగవత్‌కు, మోదీ మధ్య వైరుధ్యాలు అడపాదడపా బహిర్గతమవుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న విషయంలో ఈ విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంలో తాత్సారం జరుగుతోంది. ‘‘బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో మేం నిర్ణయించం. నిర్ణయించాలనీ మేం అనుకోవడం లేదు. మీకు ఎంత సమయం కావాలంటే అంత తీసుకోండి’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌. అధినేత చెప్పారు. అదే నోటితో తాము సలహాలు ఇస్తామని అంగీకరించారు. అయితే ప్రభుత్వ, రాజకీయ నియామకాలలో తాము జోక్యం చేసుకోబో మని కూడా భగవత్‌ చెప్పారు. ఇవన్నీ జనం కోసం చెప్పిన మాటలేనని చెప్పాల్సిన అగత్యమే లేదు. అంతర్గ తంగా ప్రతి విషయంలో సంఫ్‌ు ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. ‘‘కొంత ఘర్షణ ఉండొచ్చు. కానీ జగడం ఉండదు’’ అని కూడా భగవత్‌ అనడం సంఫ్‌ు ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడానికి ఉపకరిస్తుంది. బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో సంఫ్‌ు పాత్ర లేదని ఎవరెంత చెప్పినా చరిత్రను తరచి చూస్తే సంఫ్‌ు ఆమోదం లేకుండా ఏమీ జరగదని అందరికీ తెలుసు. బీజేపీ అధ్యక్షుడు ఎవరుండాలి అన్న విషయంలో సంఫ్‌ు సమ్మతే కాదు అనుమతి ఉండక తప్పని పరిస్థితి ఉంది. 2009 లో నితిన్‌ గడ్కరీని బీజేపీ అధ్యక్షుడిని చేయడం సంఫ్‌ు చలవే. అంతకు ముందు గడ్కరీ పలుకుబడి నాగపూర్‌కే పరిమితం. సంఫ్‌ును మాలిమి చేసుకోవడానికీ మోదీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో బీజేపీ అధ్యక్షుడి నియామకమే తేలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు