బీహార్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నిజానికి వాతావరణం వేడెక్కడం మూడు నెలల కింద ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా తయారీతోనే మొదలైంది. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ బృందం శని, ఆదివారాల్లో బిహార్‌లో పర్యటించింది. 12 రాజకీయ పార్టీల నాయకులతో కూడా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి, తదితరులు చర్చించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని జ్ఞానేశ్ కుమార్ షరా మామూలుగా హామీ పడేశారు. కానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా అన్న అనుమానాలు మాత్రం మిగిలే ఉన్నాయి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం అంటే పోటీలో అన్ని పక్షాలకు సమానావకాశాలు కల్పించాలి. జ్ఞానేశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల కమిషన్ ఈ పని చేయడంలో విఫలం అవుతూనే ఉంది. పర్యటన ముగియడానికి ముందు జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. అక్రమంగా వలస వచ్చిన వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే ఎస్‌ఐఆర్. ప్రధాన ఉద్దేశం అని ఎన్నికల కమిషన్ చెప్తూ వచ్చింది. అక్రమంగా వలస వచ్చిన ఎంతమంది పేర్లు తొలగించారు, ఒకే ఇంట్లో డజన్ల మంది ఓటర్ల పేర్లు ఎలా చేరాయి, అన్ని రాష్ట్రాలలో ఎస్‌ఐఆర్. చేపట్టినప్పుడు ఆధార్ కార్డును ప్రామాణికంగా స్వీకరిస్తారా అన్న ప్రశ్నల్లో వేటికీ జ్ఞానేశ్ కుమార్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కొన్ని ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు. కొన్నింటిని దాట వేశారు. కొన్నింటికి ఫిర్యాదులేమైన ఉంటే ఓటర్ల జాబితా సిద్ధం చేసిన ఈఆర్‌ఓలనో, జిల్లా కలెక్టర్లనో అడగండి అని జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ‘‘అక్రమంగా వలస వచ్చిన ఓటర్లను ఎంతమందిని తొలగించారు అన్న ప్రశ్నకు జ్ఞానేశ్ కుమార్ లెక్క చెప్పనే లేదు. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ల దగ్గర ఉందని, కలెక్టర్లు రాజకీయ పార్టీలకు వివరాలు అందజేశారని, ఇంకా అభ్యంతరాలు ఏవైనా ఉంటే నామినేషన్లు దాఖలు చేయడానికి పది రోజుల ముందు దాకా తెలియజేయవచ్చునని మాత్రం చెప్పారు. మొత్తం మీద ‘‘అక్రమంగా వలసవచ్చిన’’ఎంత మంది పేర్లు తొలగించారో మాత్రం చెప్పలేదు. భారత పౌరులు ఎవరు, కానిది ఎవరో నిర్ణయించే అవకాశం ఎన్నికల కమిషన్‌కు లేదు. అయినా ఎన్నికల కమిషన్ పౌరసత్వ నిర్ధారణను కొనసాగించింది. 47 లక్షల మంది పేర్లు తొలగించడానికి కారణాలు ఏమిటో కూడా బయట పెట్టలేదు. ఓటర్ల జాబితా సిద్ధం చేసే అధికారులు ఆయా ప్రాంతాలలో దర్యాప్తు చేసి అభ్యంతరాలను, విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే తొలగించారని చెప్పారు. దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈఆర్‌ఓలను సంప్రదించవచ్చునన్నారు. సరైన ప్రామాణిక పత్రాలు లేనందువల్ల ఎంత మందిని తొలగించారో కూడా వివరాలు ఇవ్వలేదు. తొలగించిన వారి పేర్లు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో ఉంచాలని ఆగస్టు 14 న సుప్రీంకోర్టు ఆదేశించేదాకా ఎన్నికల కమిషన్‌లో చలనమే కనిపించలేదు. తొలగించడానికి కారణాలేమిటో వెల్లడిరచాలని కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. కారణాలను వెల్లడిరచడానికి జ్ఞానేశ్ కుమార్ సిద్ధంగా లేరని ఆదివారం నాటి మీడియా సమావేశంలో ఆయన ధోరణివల్లే వ్యక్తమైంది. ఆధార్ కార్డును ప్రామాణికంగా పరిగణించాలని మొదట సుప్రీంకోర్టు సూచించినా పట్టించుకోలేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించవలసి వచ్చింది. క్రమంగా దేశమంతటా ఎస్‌ఐఆర్ నిర్వహిస్తామంటున్నారు కదా అప్పుడు ఆధార్ కార్డుని ప్రామాణికంగా పరిగణిస్తారా అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. కానీ ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రమే తప్ప అది పౌరసత్వాన్ని నిరూపించదని, పుట్టిన తేదీ, చిరునామాకు కూడా ఆధార్ పనికి రాదన్న పాత పాటే పాడారు. మృతి చెందిన వారి, భారత పౌరులు కానివారి, అనేక చోట్ల ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను, శాశ్వతంగా మరో చోటికి వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించామని తెలియజేశారు. తుది జాబితా విడుదల చేసినప్పుడు సవివరమైన వివరణ కూడా అందులో ఉండేది. కనీసం 2009 నుంచి ఇటీవలి దాకా సకల వివరాలూ అందించే వారు. ఇప్పుడదేమీ కనిపించదు. ఒకే ఇంట్లో వందలాది ఓటర్లు ఎలా ఉన్నారు అంటే జ్ఞానేశ్ కుమార్ విచిత్రమైన సమాధానం చెప్పారు. ఇల్లు లేనివారు, ఉన్నా ఇంటి నెంబర్లు లేనప్పుడు పొరుగింటి నెంబరు ఇచ్చామంటున్నారు. లేదా ఇంటి నెంబర్ సున్నా అని చూపించామంటున్నారు. ఎన్నికల కమిషన్ చేస్తున్న చెయ్యని పనులవల్ల ఆ వ్యవస్థను రహస్యమైందిగా, దొంగచాటు వ్యవహారంగా మార్చేశారు. ప్రజల అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ పట్టించుకోవడమే లేదు. ఇదంతా చూస్తూ ఉంటే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే శక్తే లేదని రుజువు అవుతోంది. వాస్తవాలు తెలుసుకో వడానికి వీలుందని ఎన్నికల కమిషన్ చెప్తున్నా వాస్తవాలే కనిపించడం లేదు. కర్నాటకలోని అలంద్ శాసన సభా నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇప్పటిదాకా పెదవే విప్పలేదు.
బిహార్‌లో ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా (ఎస్.ఐ.ఆర్.) సిద్ధం చేయడాన్ని సమర్థించు కున్నారు. ఎన్నికలు పూర్తి అయిన తరవాత ఓటర్ల జాబితా సవరించి ఉండాల్సిందన్న సూచనలను తోసి పుచ్చుతూ తాము చేపట్టిన సవరణ చట్టబద్ధమైందని, అవసరం అయిందని ఆయన అన్నారు. ఈ సవరణ ఎన్నికల తరవాత జరిపించి ఉండాల్సిందనడం ‘‘సమర్థనీయం’’ కాదని తేల్చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఇలాంటి సవరణ జరగాల్సిందేనని చెప్పారు. ఓటు వేయడానికి అర్హత లేని వారిని జాబితాలోంచి తొలగించడం ఎన్నికల ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల మునుపటికన్నా ఆరు శాతం ఓటర్లు తగ్గిపోయారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై దర్యాప్తు జరిపించడానికి కూడా ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. మొత్తం వ్యవస్థను కేంద్రీకృతం చేసేశారు. ఎన్నికల సంఘాన్ని నిరంకుశ వ్యవస్థగా మార్చేశారు. ఇలా జరిగే ప్రమాదం ఉందని 1984 లోనే సుప్రీంకోర్టు ఎ.సి.జోస్, శివన్ పిళ్లేకు మధ్య కేసు విచారణ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ భయాందోళనలు నిజం అవుతున్నాయి. ఎన్నికల వ్యవస్థను నిర్వహించ డానికి, పర్యవేక్షించడానికి, ఓటర్ల జాబితా సవరించడానికి రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉన్న మాట నిజమే అయినా సర్వాధికారాలు లేవు. ఉన్న అధికారాలు కూడా రాజ్యంగం ద్వారా సంక్ర మించినవే. ఎన్నికల కమిషన్‌కు అపరిమితమైన ఆధికారాలు, నిరంకుశాధి కారాలు ఉంటే దానిని నిర్వహించే వ్యక్తి తన రాజకీయ సిద్ధాంతం ప్రకారం నడుచుకోవడం మొదలు పెడితే రాజ్యాంగ సంక్షోభానికే దారి తీయవచ్చునని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యవసరమైన, అనివార్యమైన సూత్రాలను పక్కన పెడితే ఆ వ్యవస్థకే ముప్పు వస్తుంది. ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నాం.
సమాధానాలు ఎగవేస్తున్నఎన్నికల కమిషన్
- Advertisement -


