Thursday, December 5, 2024
Homeసర్వం సిద్ధం

సర్వం సిద్ధం

నేడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీకి పోలింగ్‌

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకటే దశలో…జార్ఖండ్‌లోని 38 స్థానాలకు రెండవ దశలో పోలింగ్‌ బుధవారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించినట్లు వెల్లడిరచారు.
మహారాష్ట్రలో 288 స్థానాల నుంచి 4,136 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీల (మహాయుతి), కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) (మహా వికాస్‌ అగాడీ)కి మధ్య పోటీ ఉంది. రెండు వర్గాలు గెలుపుపై దీమాగా ఉన్నాయి. బీజేపీ 149, శివసేన 81, ఎన్‌సీపీ (అజిత్‌) 59 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎంవీఏ తరపున 101 స్థానాల్లో కాంగ్రెస్‌, 95 చోట్ల శివసేన (ఉద్ధవ్‌), 86 సీట్లలో ఎన్‌సీపీ (ఎస్‌పీ) పోటీ చేస్తున్నాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ), ఏఐఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. బీఎస్‌పీ 237 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఏఐఎంఐఎం తరపున 17 మంది పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి అభ్యర్థుల సంఖ్య 28శాతం మేర పెరిగింది. 4,136 మంది అభ్యర్థులలో 2,086 మంది స్వతంత్రులు ఉన్నారు. 150 స్థానాల్లో రెబల్స్‌ నిలబడ్డారు. రాష్ట్రంలో 9,70,25,119 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 5,00,22,739 మంది పురుషులు, 4,59,96,279 మంది మహిళలు, 6,101 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 6,41,425 మంది కాగా రాష్ట్రంలో 1,16,170 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి.
జార్ఖండ్‌లో మొత్తం 24 జిల్లాలోని 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో 44 జనరల్‌, 28 ఎస్‌టీలకు, 9 ఎస్‌సీలకు రిజర్వుడ్‌ స్థానాలు ఉన్నాయి. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇందులో 27 జనరల్‌ స్థానాలు కాగా ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వుడ్‌ స్థానాలు మూడు, ఎనిమిది చొప్పున ఉన్నాయి. ఇండియా ఐక్య సంఘటనలో భాగంగా 20 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ 13, సీపీఎం 4, ఆర్‌జేడీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. ధన్వర్‌లో జేఎంఎం, సీపీఐ(ఎంఎల్‌) మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుంది. ఛత్తర్పూర్‌, బిష్రంపూర్‌లో కాంగ్రెస్‌, ఆర్‌జేడీకి మధ్య స్నేహపూర్వకంగా తలబడుతున్నాయి. బీజేపీ 32 స్థానాల్లో పోటీ చేస్తుండగా దాని మిత్రపక్షం ఏజేఎస్‌యూ ఆరు చోట్ల పోటీచేస్తోంది. తుది దశ ఓటింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, 31 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.రవి కుమార్‌ తెలిపారు. మొత్తం 528 మంది అభ్యర్థుల్లో 472 మంది పురుషులు, 55 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ అన్నారు. 585 కంపెనీల పారామిలటరీ దళాలు, 60 కంపెనీల జేఏపీని మోహరించినట్లు అధికారి తెలిపారు. 1.23 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, వీరిలో 62.8లక్షల మంది పురుషులు, 61లక్షల మంది మహిళలు, 145 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నరని సీఈఓ తెలిపారు. మొదటిసారి ఓటు వేసే వారు 55వేల మంది, 85ఏళ్లుపైబడిన వారు 50 మేల మంది ఉన్నట్లు చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు