Homeక్రీడలుసీఎస్కేను వెంటాడుతున్న గాయాలు

సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు

- Advertisement -

. తాజాగా జట్టుకు దూరమైన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే
. ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ 2026లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎడమ కాలి గాయం (హామ్‌స్ట్రింగ్) కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇవాళ సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతనికి ఈ గాయమైంది. ఆయుష్ మాత్రే గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి 6 నుంచి 12 వారాల విశ్రాంతి అవసరమని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 195 పరుగుల ఛేదనలో గుర్‌జపనీత్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా ఆడాడు. కేవలం 12 బంతుల్లోనే 30 పరుగులు చేసి జోరుమీద కనిపించాడు. అయితే, ఐదో ఓవర్‌లో రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతనికి గాయమైంది. నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ కొనసాగించిన అతడు కాసేపటికే తన వికెట్ కోల్పోయాడు. ఈ గాయంపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందిస్తూ.. “ఇది హామ్‌స్ట్రింగ్ టియర్. గాయం తీవ్రత ఎలా ఉందో కచ్చితంగా తెలియదు కానీ, చూస్తుంటే పరిస్థితి కాస్త గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న ఆయుష్ దూరం కావడం జట్టుకు పెద్ద లోటే. యువ ప్రతిభావంతుడు అయిన అతడు దూరం కావడం నిరాశ కలిగించినా.. బెంచ్‌పై అవకాశం కోసం ఎదురుచూస్తున్న మరో మంచి ఆటగాడికి ఇప్పుడు ఛాన్స్ దక్కుతుంది” అని వివరించాడు. ఈ సీజన్‌లో సీఎస్కే నుంచి గాయంతో తప్పుకున్న మూడో ఆటగాడు ఆయుష్ మాత్రే. ఇప్పటికే బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ టోర్నీకి దూరమయ్యారు. మరోవైపు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ప్రాక్టీస్ సెషన్‌లో తగిలిన కాలి గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నాడు. దీంతో అతడు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సన్‌రైజర్స్‌పై 10 పరుగుల తేడాతో ఓడిన చెన్నై.. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. గురువారం నాడు ముంబై ఇండియన్స్‌తో సీఎస్కే తన తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సీఎస్కే ప్లేఆఫ్ సజీవంగా ఉంటాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు