దశాబ్దాలుగా పేదల ఎదురుచూపు
లబ్ధిదారులను పట్టించుకోని పాలకులు
అడ్డగోలు హామీలు…నీరుగారుతున్న లక్ష్యం
ఉగాదికి 3 లక్షల ఇళ్లు సాధ్యమేనా?
నీడ కోసం గూడుకై ఎదురుచూస్తున్న నిరుపేదల ఆశలు అడియాశలు గానే మిగులుతున్నాయి. పాలకులు మారుతున్నా వీరి తలరాతలు మాత్రం మారటం లేదు. దశాబ్దాలుగా వేచి చూస్తున్నా సొంత ఇల్లు అందని ద్రాక్షగానే మిగులుతోంది. అధికారం కోసం అడ్డగోలు హామీలిస్తూ ఓట్లు దండుకుని గద్దెనెక్కి వీరిపై పాలకులు శీతకన్ను వేయడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.20 లక్షల కుటుంబాలకే ఇళ్ల స్థలాలు లేవని ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతుంటే…పీఏంఏవై -2.0లో భాగంగా సుమారు 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటేనే గృహాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థ్ధమౌతుంది. గత పాలకులు నివాసయోగ్యం కాని లోతట్టు ప్రాంతాలు, చెరువు గట్లు, కొండ వాగులు, శ్మశానాలకు సమీపంలో పట్టాలు ఇచ్చి తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. 80 శాతం లేఅవుట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ లేని ప్రాంతాల్లో ఇళ్లు ఎలా కట్టుకోవాలో చెప్పాలని నిలదీస్తున్నారు. టిడ్కో ఇళ్లైనా తక్షణం పంపిణీ చేస్తే తల దాచుకుంటామని కొందరు లబ్ధిదారులు వేడుకుంటున్నారు. ‘కూటమి’ పాలనలోనైనా ఇంటి కల నెరవేరుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణ రంగంపై భారీ ఆశలు రేకెత్తిస్తోంది. 2026 , ఉగాది నాటికి మూడు లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని, 2029 నాటికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని పాలకులు చెబుతున్న మాటలు వినడానికి ఇంపుగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ. 6,357 కోట్లు కేటాయించింది. కేవలం అంకెలు చూపడం కాదు, పెరిగిన సిమెంట్, ఇనుము, ఇసుక ధరలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ వ్యయాన్ని కనీసం పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం అసాధ్యమన్నది నగ్న సత్యం. రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని 2.20 లక్షల కుటుంబాలను గుర్తించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, పీఏంఏవై -2.0లో భాగంగా సుమారు 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటేనే రాష్ట్రంలో గృహాల కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థ్ధమౌతుంది. లక్షలాది మంది అర్హులు వేచి చూస్తుంటే, కేవలం ఉగాది నాటికి మూడు లక్షల ఇళ్లంటూ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. 2029 నాటికి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యం గొప్పదే. కానీ, అది నెరవేరాలంటే గతంలో ఇచ్చిన పట్టాలు చిత్తడి నేలల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తేనే నివాసయోగ్యంగా ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. ఎంపికలో రాజకీయ రంగు పూయకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు కేటాయించినప్ప్పుడు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు. ఉగాది గడువు కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా, పేదవాడి ఆత్మగౌరవం నిలిపేలా ఉండాలని, మూడు లక్షల ఇళ్ల హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటేనే ప్రజా విశ్వాసం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు నివాస యోగ్యం కాక, ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇచ్చే హామీలు కార్యరూపం దాల్చక పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన లక్షలాది పట్టాలు నేటికీ చిత్తుకాగితాలకే పరిమితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, చెరువు గట్లు, కొండ వాగులు, చివరకు శ్మశానాలకు సమీపంలో పట్టాలు ఇచ్చి పేదల ప్రాణాలతో చెలగాటమాడారు. పట్టాలు ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా, 80 శాతం లేఅవుట్లలో రోడ్లు లేవు, కనీసం తాగడానికి నీటి సౌకర్యం లేదు. విద్యుత్ లైన్లు లేని చోట ఇళ్లు ఎలా కట్టుకోవాలో పాలకులు చెప్పాలని లబ్ధిదారు లు నిలదీస్తున్నారు. ప్రభుత్వం కేవలం 2.20 లక్షల కుటుంబాలకే ఇళ్ల స్థలాలు లేవని లెక్కలు కట్టడం హాస్యాస్పదం. బీసీ లు 6.92 లక్షలు, ఎస్సీ 2.16 లక్షలు, ఎస్టీ 1.43 లక్షలు, దివ్యాంగులు 4,965 మంది ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నట్టు గణాకాలు చెబుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 77,353 దరఖాస్తులు రాగా, శ్రీకాకుళం, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో భారీగా నిరీక్షిస్తున్నారు. సుమారు 2.50 లక్షల మందికి కొత్తగా స్థలాలు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అయితే, ఇందు కోసం అవసరమైన వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఎక్కడ సేకరిస్తోంది అనేది ప్రశ్నార్థకమే. పేదలకు ఇచ్చే స్థలాలు ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో కాకుండా, నివాస యోగ్యమైన ప్రాంతాల్లోనే ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో పట్టాలు పొందిన సుమారు 1.84 లక్షల మంది పట్టణ ప్రాంత లబ్ధిదారులు నేటికీ నిర్మాణాలు ప్రారంభించలేకపోయారు. దీనికి కారణం స్థలాలు చదును చేయకపోవడం, మౌలిక వసతులు లేకపోవడమే. వీరికి ప్రభుత్వం అదనంగా .రూ 50,000 నుంచి రూ. 75,000 సాయం చేస్తామంటున్నా, పెరిగిన ధరల ముందు ఇది ఏమాత్రం అక్కరకు రాదు. రాష్ట్రవ్యాప్తంగా అద్దె ఇళ్లలో మగ్గుతున్న వారు, ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడి గూడు లేక ఇబ్బంది పడుతున్న వారు 10 లక్షలకు పైగానే ఉన్నారు. రాజకీయ వడపోతలు ఆపి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టణంలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


