రాజ్ కసిరెడ్డి సుదీర్ఘ విచారణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణ ముగిసింది. సిట్ కార్యాలయంలో దాదాపు 12 గంటల పాటు విచారణ సాగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ సేకరించిన ఆధారాలను చూపించి రాజ్ కసిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని కసిరెడ్డి చెప్పినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారిగా సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో రాజ్‌కు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. సిట్ అధికారులకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అతడిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే అతని ఆర్థిక లావాదేవీలు, సన్నిహితులు, బంధువుల ఇళ్లపై కూడా ఆకస్మిక దాడులు జరిపి కొన్ని ఆధారాలు సంపాదించారు. ఈ క్రమంలో విచారణకు హాజరవుతానని అజ్ఞాతంలో ఉండి ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి, వ్యూహాత్మకంగా వేరే పేరుతో గోవా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ నుంచి చెన్నై వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మాటు వేసి సోమవారం రాత్రి కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. రాత్రి సమయంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి నేరుగా రోడ్డుమార్గం గుండా తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ రూపాల్లో రాజ్‌ను విచారించారు. విచారణలో భాగంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు మద్యం లావాదేవీలపై, డిస్టలరీ కంపెనీలకు అనుమతులు ఏ విధంగా ఇచ్చారనే అంశాలపై ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో కొందరి నుంచి సేకరించిన స్టేట్‌మెంట్లను కసిరెడ్డి ముందు ఉంచి విచారించారు. ఈ వ్యవహారంలో కొన్ని మంతనాలు చేసినట్టు కసిరెడ్డి ఒప్పుకున్నప్పటికీ మరికొన్నింటితో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మరికొంత మంది నుంచి సేకరించిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు సంధించినప్పటికీ కసిరెడ్డి తనకు తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరోసారి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో విడతగా విచారణ జరిపారు. అనేక అంశాలు ప్రస్తావించినప్పటికీ కసిరెడ్డి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదని సమాచారం. అయితే సోమవారం సాయంత్రం 6 గంటల ముందే ఆయనను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలలోపు కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. దీంతో విచారణను ముగించి కసిరెడ్డిని నేరుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నేరుగా విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. రెండు పక్షాల న్యాయవాదుల వాదనలు వాడివేడిగా సాగాయి.