. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ
. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు
. 25 నుంచి 45 శాతం రాయితీలు
. రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : స్పేస్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని అన్నారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా ఐదువేల మందికి, పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు సీఎం ఆమోదించి 2025-2035 కాలానికి సంబంధించి ఆ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం స్పేస్ పాలసీ 4.0పై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. విద్యాసంస్థలను భాగస్వాములు చేయడం ద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులు అయ్యేలా చూడాలన్నారు. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు రానున్నాయి. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వినియోగించుకు నేలా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని, ఇందుకోసం సాంకేతిక బృందాన్ని నియమించాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి టెక్నాలజీ అనుసంధానం జరగాల్సి ఉందన్నారు. సమీక్షలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. స్పేస్ విజన్ పాలసీ-2047 కింద కేంద్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులు చేపడుతోందని, స్టార్ లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని తెలిపారు. రాష్ట్రంలో రెండు స్పేస్ సిటీలు నిర్మించాలని కొత్త పాలసీలో నిర్దేశించారు. 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న లేపాక్షి స్పేస్ సిటీలో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రాధానత్య ఇస్తారని ఆర్‌అండ్‌డీ, స్పేస్ స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, స్పేస్ అప్లికేషన్లు-సేవలకు సంబంధించి సంస్థలు ఏర్పాటు కానున్నాయని, తిరుపతి స్పేస్ సిటీని మాన్యుఫ్యాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్ సేవలు అందించే సంస్థల ఏర్పాటుకు కేటాయించినట్లు అధికారులు వివరిం చారు. ఇక్కడ లాంచ్ వెహికల్ అసెంబుల్డ్, శాటిలైట్-పేలోడ్ అసెంబుల్డ్, మెకానికల్ సిస్టమ్-కాంపొనెంట్ మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రానిక్-ఏవియానిక్స్ అసెంబుల్డ్ సంస్థలకే సిటీలో అవకాశం కల్పిస్తారని, బెంగళూరుకు సమీపంలో లేపాక్షి స్పేస్ సిటీ, శ్రీహరికోట-చెన్నైకు సమీపంలో తిరుపతి స్పేస్ సిటీ ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. 2040 నాటికి చంద్రుడిపై మనిషి అడుగుపెట్టాలనేది ఆశయమని, కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పేస్ పాలసీ 4.0ను రూపొంది స్తోందన్నారు. దీంతో తిరుపతి స్పేస్ సిటీ నుంచి శ్రీహరికోటకు రోడ్ కనెక్టవిటీపైనా సీఎం అనేక సూచనలిచ్చారు.


