Homeవిశ్లేషణఅగ్రవర్ణాలకు పెద్దపీట వేసే కులవ్యవస్థ

అగ్రవర్ణాలకు పెద్దపీట వేసే కులవ్యవస్థ

- Advertisement -

డి.రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి

ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వం నెలకొనేలా చేయడం కోసం విశ్వవిద్యాలయాల నిధుల కమిషన్ (యూజీసీ) ఇటీవల కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీచేసింది. అగ్రకులాలకు చెందిన వారు ఈ మార్గదర్శక సూత్రాల వల్ల తమ ఆధిపత్యానికి విఘాతం కలుగుతుందని భావించి వీధి పోరాటాలు మొదలుపెట్టారు. కుల వ్యవస్థ ఎప్పుడూ అగ్రకులాల వారిని ఆదరిస్తుందని, కింది కులాల వారిని తృణీకరిస్తుందని డా.అంబేద్కర్ చెప్పిన మాట వాస్తవం అని ఈ ఆందోళనలు రుజువు చేస్తున్నాయి. అగ్రకులాల వారి ఈ ఆందోళనలు కొన్ని వ్యవస్థల్లో నెలకొన్న అసమానత్వాన్ని పెంచి పోషించేలా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులను కొన్ని వ్యవస్థలో చిన్న చూపు చూసే విధానాన్ని మార్చడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నిరాదరణకు గురవుతున్న వారు తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఇవ్వడానికి ఈ మార్గదర్శకాలు అవకాశం కల్పిస్తున్నాయి. కుల వివక్ష కొనసాగుతున్న సంస్థల్లో దీన్ని నివారించడానికి కమిటీలను ఏర్పాటుచేయడానికి కూడా అవకాశం కల్పించారు. వివక్ష నిరోధించడానికి అనువైన చర్యలు తీసుకున్నట్టు ఈ సంస్థలు తెలియజెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ మార్గదర్శక సూత్రాలను అమలు చేయాల్సిందే. అలా చేయని సంస్థలపై చర్య తీసుకునే అవకాశమూ ఉంటుంది. ఇది అగ్ర కులాల వారికి కంటగింపే అయింది. ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష గత అయిదేళ్లలో వంద శాతం పెరిగిందన్న నికర సమాచారం ఉన్నందువల్లే కొత్త మార్గదర్శకాలు జారీ చేయవలసి వచ్చింది. ఈ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్న వారు తమకు ఏదో నష్టం కలుగుతోందని కాక కింది కులాల వారికి మేలు జరుగుతుందేమోనన్న భయంతో ఆందోళనకు దిగారు. సమానత్వాన్ని, న్యాయాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగబద్ధమైన నియమాలను ఉల్లంఘించడమే. దీన్నిబట్టి అంబేద్కర్ చెప్పిన మాట అక్షరసత్యం అని రుజువు అవుతోంది. ఈ ఆందోళనలు కింది కులాల వారి మీద వివక్షతను పెంచి పోషించడానికే. అనేక శతాబ్దాలుగా, సామాజిక స్థాయిలో ఈ వివక్ష ఎంత పాతుకుపోయి ఉందో భారత చరిత్రలోనే అనేక దాఖలాలు ఉన్నాయి. స్వామీ వివేకానంద “నా ప్రచార ప్రణాళిక” అన్న ఉపన్యాసంలో తాను శూద్రుడిని కనక సన్యాసి కావడానికి వీలులేదని చెప్పారు. “నన్ను శూద్రుడిని అన్నందుకు బాధ లేదు” అని వివేకానంద స్పష్టంగా తెలియజేశారు. నా మునుపటి తరాల వారు పేదల మీద తరతరాలుగా వివక్ష చూపినందుకు నేను చెల్లించగలిగిన నష్టపరిహారం కూడా ఏమీ లేదని వివేకానంద అన్నారు. 1997లో కె.ఆర్.నారాయణను రాష్ట్రపతి అయినప్పుడు మీడియా వారు “మొదటి దళితుడిగా రాష్ట్రపతి అయినందుకు మీకేం అనిపిస్తోంది” అని అడిగారు. నిజానికి ఆయన రాష్ట్రపతి కావడంలో కులం ప్రస్తావనే లేదు. మీడియా వారు తన కులాన్ని ప్రస్తావించినందుకు నారాయణను “రాష్ట్రపతి అంటే రాష్ట్రపతే” అని మొహం మీద గుద్దినట్టు సమాధానమిచ్చారు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలోనే దుర్భావన ఉంది. ఇటీవలే బీఆర్.గవై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తరవాత ఆయన మీద ఒక న్యాయవాది చెప్పు విసిరారు. ఆ న్యాయవాది “హిందుస్థాన్ సనాతనత్వానికి అవమానం సహించదు” అని నినదించారు. కానీ హిందుత్వవాదులు గవై మీద చెప్పు విసరడాన్ని చూసి తెగ ఆనందపడిపోయారు. రాహుల్‌గాంధీ మీద బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన అవమానకర వ్యాఖ్యలను చూసి విచారించవలసిందీ ఏమీ లేదు. ఎందుకంటే నేను పార్లమెంటులో అలాంటి అవమానాలే ఎదుర్కున్నాను.
యూజీసీ జారీచేసిన కొత్త మార్గదర్శక సూత్రాలపై అగ్రవర్ణాల వారి ఆందోళన చూస్తూ ఉంటే హిందుత్వం అందరినీ సమైక్య పరుస్తుంది అన్న వాదనలోని డొల్లతనం పస ఏమిటో తేలిపోతోంది. కులవ్యవస్థ కేవలం పని విభజనకు ఉద్దేశించింది మాత్రమే కాదని అంబేద్కర్ అనే వారు. ఈ ఆందోళనలను చూస్తూ ఉంటే ఆయన క్రాంతదర్శి అని మరోసారి రుజువు అవుతోంది. యూజీసీ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు సబబే అయినా ఆ వ్యవస్థే పార్లేంటరీ కమిటీలు చేసిన అనేక సిఫార్సులను అటకెక్కించినందుకు బాధ్యత కూడా తీసుకోవాలి. మొత్తం మీద ఈ వివక్షకు వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. హిందుత్వ సిద్ధాంతమే అసమానతలను ప్రోది చేస్తుంది. అది వివిధ మతాల మధ్య అంతరాలు చూపడమే కాదు హిందూ సమాజంలోనే అంతరాలు పాటిస్తుంది. కులం జాతి వ్యతిరేకమైంది అని అంబేద్కర్ అనేకసార్లు చెప్పారు. కులనిర్మూలనకు అడ్డుపడడాన్ని, సమానత్వాన్ని పెంపొందించడం వ్యతిరేకించడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. హిందుత్వ కులనిర్మూలనను అంగీకరించకపోవడమే కాదు, సామాజిక సంబంధాలకు అడ్డంకిగా ఉంది. హిందుత్వ కోరుకునేది కులరహిత హిందూ సమాజం కాదు. తరతరాలుగా వస్తున్న అగ్రకులాల ఆధిపత్యాన్ని హిందుత్వ మరింత ప్రోత్సహిస్తుంది. కింది కులాల వారు లొంగిపోయి ఉండేట్టు చేస్తుంది.
(వ్యాస రచయిత సీపీఐ ప్రధాన కార్యదర్శి)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు