. రాజధాని పునర్నిర్మాణంలో మరో అడుగు
. 45 వేల ఎకరాల భూసమీకరణకు నిర్ణయం
. త్వరలో రైతులతో అవగాహన సదస్సులు
. పెండిరగ్ భవనాల పూర్తికి శ్రీకారం
విశాలాంధ్ర- సచివాలయం: సకల సౌకర్యాలు, హంగులతో అమరావతిని రాజధాని నగరంగా అభివృద్ధిపర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం సరికొత్త ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాజధాని పరిధిలోని అనేక ప్రాంతాల్లో వివిధ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరలోనే పెండిరగ్ భవనాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉంది. ఓ వైపు రాజధాని పనులను చేపడుతూనే మరోవైపు రాజధాని పరిధిని మరింత విస్తరించే ప్రక్రియను చేపట్టారు. అందుకోసం రెండవ విడత భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా 45 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భూముల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలో రైతులతో అవగాహన సదస్సులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకోసం ప్రత్యేక అధికార బృందాలను కూడా నియమించనుంది. వారి అధ్వర్యంలో భూ సమీకరణ చేపట్టబోయే ప్రాంతాల్లో ముందుగా రైతులతో స మావేశమై వారికి అవగాహన కల్పిం చనుంది. ఆ తర్వాతే భూ సమీకరణ చేపట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే సంబంధిత మండలాల్లో నివేదికలు సేకరించే పనిలో నిమగ్నమైంది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు అధికారులు భవిష్యత్ ప్రణాళికలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిని ప్రపంచ ప్రాముఖ్యత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికను మరింత వేగవంతంగా చేపడుతున్నారు.
ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. సుమారు రూ.56 వేల కోట్ల నిధులతో వివిధ భవనాలు, టవర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ‘ఈ’లో అసెంబ్లీ భవనాన్ని 103.76 ఎకరాల్లో 11. 21 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. బేస్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడు అంతస్తుల్లో ఆకృతులు రూపొందించారు. హైకోర్టు సూపర్ బ్లాక్ ‘ఎఫ్’లో 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో రానుంది. బేస్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 7 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఐకానిక్ టవర్లలో సమీ కృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు రానున్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. పనులు దక్కించుకున్న గుత్త సంస్థలకు ఇటీవల సీఆర్డీఏ ఎల్వోఏలు అందజేసింది. వీలైనంత త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ క్యాంపు కార్యాలయాలను, క్వార్టర్స్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. రెండో విడత భూ సమీకరణలో సేకరించిన భూములను వివిధ సంస్థలకు కేటాయించబోతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో నేరుగా విదేశీ పెట్టుబడులు, పర్యాటక ప్రోత్సాహం, ప్రపంచ వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు ఎయిర్ కార్గో సేవలు, మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటుకు ఈ ప్లాన్ తోడ్పాటునందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఇండస్ట్రీన్ ప్రాజెక్టుతో ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అనేక కంపెనీలు రావడానికి వీలుగా కూడా ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నారు. ప్రత్యేకించి స్థానికంగా ఉండే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అత్యధికంగా 5 వేల ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భూముల్లో 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీకి ,మరో 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించనున్నారు.


