Homeఆరోగ్యాన్ని హరిస్తున్న రిగ్‌ బ్లాస్టింగ్‌ !

ఆరోగ్యాన్ని హరిస్తున్న రిగ్‌ బ్లాస్టింగ్‌ !

- Advertisement -

. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన రాతిక్రషర్లు
. నిబంధనలకు తిలోదకాలు… అనారోగ్యం బారిన గ్రామస్థులు
. ఫిర్యాదులు పట్టించుకోని మైనింగ్‌, కాలుష్య నియంత్రణ అధికారులు
. క్వారీ యజమానులతో ఉన్నతాధికారులు కుమ్మక్కు
. నియంత్రించకుంటే ప్రత్యక్ష ఆందోళనంటూ హెచ్చరిక

రిగ్‌ బ్లాస్టింగ్‌ ప్రాణాంతకంగా మారింది. రాతి క్రషర్లు పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. నిత్యం వెలువడుతున్న దుమ్ము, ధూళి పీల్చి ప్రజలు అనారోగ్యం బారిన పడుతు న్నారు. గాలి, నీరు, నేల కలుషితమౌతోంది. రిగ్‌ బ్లాస్టింగ్‌ వల్ల పెద్దపెద్ద శబ్దాలు రావడంతో గ్రామస్థులు భయకంపితులవు తున్నారు. ప్రజావేదికలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా … అర్జీలను బుట్టదాఖలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. క్వారీ యజమానులతో కుమ్మక్కై తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని పది గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. గతంలో పచ్చటి పంట పొలాల నడుమ ఆరోగ్యకరంగా జీవించే వారమని, క్వారీల వల్ల ఉపాధికి గండి పడడమే గాకుండా ఆరోగ్యం దెబ్బతింటోందని లబోదిబోమంటున్నారు. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి గరళంగా మారిన రిగ్‌ బ్లాస్టింగ్‌ను అరికట్టాలని లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

విశాలాంధ్ర – వేపాడ : విజయనగరం జిల్లా వేపాడ మండలం వావిలపాడు రెవెన్యూ పరిధిలో గల రాతి క్రషర్లు ప్రాణాంతకంగా మారాయి. పెద దుంగాడ లోని సర్వే నెంబరు 7లో ఉన్న రాతి క్వారీలలో నిర్వహిస్తున్న రిగ్‌ బ్లాస్టింగ్‌తో వెలువడే దుమ్ము, ధూళి ప్రజలను ఊపిరాడకుండా చేస్తోంది. కాలుష్యం కోరలు చాచడంతో బెంబేలెత్తుతున్నారు. వావిలపాడు, చామలాదేవి అగ్రహారం, దొర్లకొంపలు, వీలుపర్తి, వెళ్దాం, కోలుకుపాలెం, పెద దుంగాడ, చిన దుంగాడ, కడకండ గ్రామాల మధ్య రాతి క్వారీలు అనేకం ఉన్నాయి. క్రషర్ల వలన వెదజల్లే కాలుష్యంతో పాటు రిగ్‌ బ్లాస్టింగ్‌ పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. గాలి, నీరు, నేలను కలుషితం చేస్తోంది. రిగ్‌ బ్లాస్టింగ్‌లతో భూమి కంపిస్తూ పెద్దపెద్ద శబ్దాలు వెలువడడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. కలుషితమైన గాలిని పీలుస్తూ రోగాల బారిన పడుతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. రాతి క్వారీలపై ప్రజావేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. కాలుష్య నియంత్రణ, మైనింగ్‌శాఖ అధికారులు… క్వారీల ను సాధారణ డ్రిల్లింగ్‌తో తక్కువ మోతాదులో బ్లాస్టింగ్‌ చేసి పర్యావరణానికి ముప్పు లేకుండా చేస్తామని, ఉపాధి కల్పిస్తామని , ప్రతినెల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని, క్రషర్‌ నిర్వహణలో దుమ్ము ధూళి రాకుండా వాటర్‌ స్ప్రింకర్లు పెట్టి పనులు చేయిస్తామని, ఉపాధి కల్పిస్తామని ముందు హామీ ఇస్తారు… అనుమతులు మంజూరైన తరువాత హామీలను గాలికి వదిలేసి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు తుంగలోతొక్కి రాతి క్వారీ క్రషర్లు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు పచ్చని పంట పొలాల మధ్య ఆరోగ్యవంతమైన జీవితం గడిపేవారిమని అంటున్నారు. క్వారీ యజమానులకు కొందరు స్వార్థపరులు వత్తాసు పలికి… ప్రజల ఉపాధికి గండి కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తున్నారని మైనింగ్‌ శాఖ, కాలుష్య నియంత్రణ అధికారులకు పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పైగా క్వారీ యజమానులతో కుమ్మక్కై అర్జీలను కొట్టు పారేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారుల అండతోనే రిగ్‌ బ్లాస్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు స్వయంగా క్వారీ యజమానులు చెప్పడం దీన్ని రుజువు చేస్తోందన్నారు. రాతి క్వారీలలో రిగ్‌ బ్లాస్టింగ్‌ పనులు చేయకూడదని ప్రజావేదికలో అధికారులే ప్రజల సమక్షంలో చెప్పారని, తీరా దానికి విరుద్ధంగా పనులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యావరణానికి , ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిని రిగ్‌ బ్లాస్లింగ్‌ను అరికట్టి తమ ప్రాణాలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు