Homeస్మార్ట్‌ మీటర్లపై వెనక్కి

స్మార్ట్‌ మీటర్లపై వెనక్కి

- Advertisement -

. విద్యుత్‌ భారం నుంచి ప్రజలకు విముక్తి
. సీపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్‌
. ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ముట్టడి
. వామపక్ష నేతల నినాదాలతో దద్దరిల్లిన తిరునగరి

విశాలాంధ్ర-తిరుపతి: పేదలు, రైతుల రక్తాన్ని పీల్చేస్తున్న స్మార్ట్‌ మీటర్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని, విద్యుత్‌ భారం నుంచి విముక్తి కల్పించాలని సీపీఐ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షంలో ఉండి స్మార్ట్‌ మీటర్లు పగులగొడతామ న్నారు కానీ అధికారంలోకి వచ్చాక మాటమార్చి, కార్పొరేట్‌ దోపిడీకి దాసోహమయ్యారంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. కార్పొరేట్లకు ఊడిగం చేయడం మాని, ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్‌ చేశారు. నారాయణ సోమవారం వామపక్షాల అధ్వర్యంలో జరిగిన తిరుపతి బైరాగిపట్టెడలోని ఏపీఎస్పీడీసీఎల్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వామపక్ష శ్రేణులు ఆ ప్రాంతాన్ని దద్దరిల్లించారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందం భారీ లంచాలు, దోపిడీలతో కూడుకున్నదని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని నారాయణ అన్నారు. 20 ఏళ్ల పాటు రూ.2 లక్షల కోట్ల భారాన్ని ప్రజలపై మోపేసేలా అదానీ సహా మరో మూడు కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారన్నారు. కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు రైతులు, పేదలకు ఉరి తాళ్లుగా మారాయని, లక్షల కోట్ల భారాన్ని మోయలేక ప్రజలు అదోగతి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగర్తలా, త్రిపుర, అసోం, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే తిరుగుబాట్లు జరుగుతున్నాయని, ఆంధ్రాలోనూ అదే జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని నారాయణ ప్రశ్నించారు. స్మార్ట్‌ మీటర్ల దోపిడీ వివరాలు వింటే షాక్‌ తగులుతుందని వ్యాఖ్యానించారు. కార్పొరేట్లు నిర్దేశించే కంపెనీల్లోనే రైతులు, వినియోగదారులు విద్యుత్‌ పరికరాలు కొనాలని నిబంధనలు పెట్టి… ధరలు పెంచి దోచుకుంటున్నారని నారాయణ తెలిపారు. 63 కిలోవాట్ల విద్యుత్‌ లైన్‌ ధర రూ.1,07,392 మాత్రమే కాగా, కొనుగోలు రేటు రూ.2,74,000కి పెంచేసి రూ.1.67 లక్షలు లూటీ చేస్తున్నారంటూ ఆధారాలతో సహా వెల్లడిరచారు. గతంలో చంద్రబాబు తీసుకున్న విద్యుత్‌ సంబంధిత నిర్ణయాలే ఆయనను ఓడిరచాయన్నారు. ‘చంద్రబాబూ.. నువ్వు మోదీని నమ్ముకున్నావు, మోదీ… అదానీని నమ్ముకున్నారు. ఇదే కొనసాగితే ఇబ్బంది పడతారు. ప్రజలు కావాలా లేక మోదీ, అదానీలకు వత్తాసు పలకాలో తేల్చుకోండి!’ అంటూ చంద్రబాబుకు నారాయణ సూచించారు. విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేసి, స్మార్ట్‌ మీటర్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు వెంకటరత్నం మాట్లాడుతూ ప్రజోపకరమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారో లేక గత ప్రభుత్వాన్ని అనుసరిస్తారా తేల్చుకోండి అంటూ సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్‌, కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, చంద్రశేఖర్‌ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు శివ, రవి, పద్మనాభరెడ్డి, బలరాం, మంజుల, జింక నాగరాజు, మహేంద్ర, రామకృష్ణ, వైయస్‌ మణి, రామచంద్రయ్య, వెంకటేశ్‌, మునీశ్వర్‌, విజయమ్మ, ప్రమీల, నాగరాజు, సీపీఎం నగర కార్యదర్శి వేణుగోపాల్‌, జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం, జైచంద్ర, సాయిలక్ష్మి, ఆర్‌.లక్ష్మి, మాధవ్‌, బుజ్జి, నరేంద్ర, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు బాబు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు