Wednesday, March 5, 2025
Homeఆర్థికంగా ఆదుకోండి

ఆర్థికంగా ఆదుకోండి

. కేంద్ర పథకాలకు వీలైనన్ని నిధులు కేటాయించండి
. అమరావతి ఓఆర్‌ఆర్‌, బనకచర్ల ప్రాజెక్టులకు సహకరించండి
. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అప్పుల్లో కూరుకున్న ఏపీకి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను కోరారు. బుధవారం దిల్లీ వెళ్లిన సీఎం… వరుసగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులను కలిశారు. నదుల అనుసంధానం, బనకచర్ల ప్రాజెక్టు ప్రాధాన్యతను, అమరావతి ఔటర్‌రింగ్‌ రోడ్డు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వచ్చిన భారీ విజయాన్ని వివరించారు. అలాగే ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కాపీలను ఆర్థికమంత్రికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను మంత్రికి వివరించారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున జరిగిన అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాలు మరోసారి మంత్రులకు వివరించారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పులు సహా బకాయిలు మిగి ల్చారు. గతంలో ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితులు కూడా దాటిపోయారని వివరించారు. అనంతరం మీడియాతో సమావేశమైన చంద్రబాబు దిల్లీ పర్యటన విశేషాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 12.94 శాతం వృద్ధి రేటు సాధించగా, ఈ ఏడాది 15 శాతం వృద్ధి రేటు లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. రెండు కీలక సమావేశాలు జరిగాయని తెలిపారు. రాజకీయ పరిణామాల గురించి హోం మంత్రి అమిత్‌ షాతో చర్చించామని, ఎన్డీయే మున్ముందు ఏవిధంగా ముందు కళ్లాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. అలాగే ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొవిజన్‌ బిల్లు గురించి చర్చించామని తెలిపారు. భూములకు సంబంధించి కంప్యూటరీ కరణలో కొన్ని సమస్యలు వచ్చాయి. గతంలో అధికారులు, నాయకులు కలిసిపోయారు.ప్రైవేటు భూములను బలవంతంగా 22ఈలో చేర్చారు. అటవీ భూములను కూడా ఆక్రమించారు. గుజరాత్‌లో ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లును విజయవంతంగా అమలు చేశారు. ఇదే బిల్లుతో ఏపీ శాసనసభ, మండలి ముందుకు తీసుకువస్తున్నాం. ఈ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయి. ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ కేసులు పెడతాం. రాష్ట్రంలో గంజాయి సాగు, డ్రగ్స్‌ పెద్ద సమస్యగా ఉంది. వీటి నిర్మూలను వ్యవస్థలు ఏర్పాటు చేశాం. గంజాయి కట్టడి చేస్తే ఉపాధితో పాటు ప్రోత్సాహకాలు ఇస్తాం. గంజాయి డ్రగ్స్‌ నిర్మూలనకు మరో బిల్లు తీసుకువస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏపీకి వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు అందించిన సాయంపై నిర్మలా సీతారామన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక పైనా ఇదే తరహా సహకారం ఉండాలని.. వీలైనన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, తమకు నిధులు కూడా అదే స్థాయిలో వచ్చేలా చూడాలని కోరామని తెలిపారు. అలాగే అమరావతి రాజధాని అభివృద్ధికి ఓఆర్‌ఆర్‌ ప్రాధాన్యతను వివరించి, దానిని 8 లైన్లుగా నిర్మించేందుకు సహకరించాలని నితిన్‌గడ్కరీని కోరామన్నారు. మిగిలిన రహదారుల ప్రాజెక్టులపై కూడా చర్చించామని తెలిపారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీ రమేష్‌, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు