Homeవిశ్లేషణఆశాజీవులు

ఆశాజీవులు

- Advertisement -

చింతపట్ల సుదర్శన్

పేదోడి కడుపులో ఆకలి మంటలా చురుక్కుమంటున్నది ఎండ. సీజన్ మారింది కదా అంత తొందరగా చీకటవదు అనుకుంటూ అరుగు ఎక్కింది డాంకీ. ఇంటి లోపల నుంచి అలికిడి వినిపించి, పట్టపగటి దొంగలు పేట్రేగిపోయారు. అయినా కూలిన కొంపలో విరిగిన ఇటుకలు, మట్టిపెళ్లలు తప్ప ఏమి దొరుకుతయి ఎవడో ‘న్యూ ఎంట్రీ’ అయి ఉంటాడు అని డాంకీ అనుకుంటుంటే లోపల్నించి బయటకు వచ్చాడు అబ్బాయి కర్చీఫుతో మూతి తుడుచుకుంటూ. ఏంటి బ్రో ఈ వేళప్ప్పుడు వచ్చావు. లోపల్నించి బయటకు వస్తుంటే వాసన గుప్ప్పుమంది ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని తెలీనోడివేం కాదుగదా. ఎవడన్నాడా మాట ‘మద్యపానం ఆరోగ్యానికి హాయికరం’ అనాలి అంటూ మడతబడే మాటల్తో కూలబడ్డాడు అబ్బాయి. సర్లే! ఎవడి మాట ఎవడు వింటాడు కనక, మందు లేకపోతే సర్కార్లే కుదేలవుతయి. ఇంతకీ ఈ మధుపానం మహదానందానికి కారణమేమిటో అంది డాంకీ. ఏముంటుంది తట్టుకోలేనంత ఆనందమో, భరించలేనంత విషాదమో అయ్యుంటుంది కదా ‘బ్రో’ అంటూ అరుగు ఎక్కింది డాగీ. తట్టుకోలేనంత ఆనందమా ఈ ‘పూర్ ఫెలో’ కి. భరించలేనంత దుఃఖమే తప్ప మరోటి లేదీ జన్మకి అన్నాడబ్బాయి. అలాగనకు ‘తంబీ’ ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుంది అంటారు అంది డాంకీ. కుక్కకి కాని, కుక్కకన్నా హీనమైన మనిషికి కాదుగదా అన్నాడు అబ్బాయి. ఇద్దరూ ఇష్టం వచ్చినట్టు వాడేసుకోండి నన్ను అంది డాగీ చిరాగ్గా. మధ్యలో నువ్వు ఫీలవకు లోకోక్తులు ఇలాగే ఉంటయి. పర్సనల్‌గా భావించకు. అన్నట్టు బ్రో నీకిప్ప్పుడు భరించలేనంత దుఃఖం ఎందుకు కలిగిందో అంది డాంకీ. రాష్ట్ర బడ్జెట్‌లో తమరికేమీ కేటాయించనే లేదా ‘బ్రో’ అంది డాగీ. ఏడాదికి పన్నెండు నెల్లు. నెలకి ముప్పయి లేదా ఆపైన ఒకరోజు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై సెకన్లు. ఏంటి బ్రో మందు మంచిదేనా బ్రాండెడేనా? బెల్టు సరుకా? అని అడ్డుపడింది డాంకీ. నీకు వచ్చిన అంకెలన్నీ చెప్పేస్తున్నావు ఇప్ప్పుడెవడిగారని అంది డాగీ. అర్థం లేకుండా అంకెలు వల్లించాను కదూ. మరదే, మాయాజాలం అంటే. అంకెల మాయాజాలమే బడ్జెటంటే. అర్థం గురించి అర్థమయ్యేట్టు చెప్పామనుకుంటాయి ప్రభుత్వాలు కానీ ఏమీ అర్థమవదు. అంతా అనర్థమే అంటూ నిట్టూర్చాడు అబ్బాయి. అర్థం అన్న మొట్టమొదటి మాటకు అర్థం ‘డబ్బు’ అన్నమాట అని వివరణ ఇచ్చింది డాంకీ, డాగీకి. ఇంత గందరగోళం అంతా బడ్జెట్ గురించేనా?ఏటా వచ్చేదీ పోయేదే, జరిగేదేదో జరిగేదే, ఒరిగేదేమో ఒరిగేదే. ఏలుకున్నంత వారికి ఏలుకున్నంత, కోలుకోలేని వారికి కోలుకోలేనంత అంది డాగీ. డాగీ మాటలకి ముక్కు మీద వేలేసుకోదానికి చేయలేదు కదా అని ‘వరీ’ అయిన డాంకీ నోరు బార్లా తెరిచి పళ్లికిలించింది. బడ్జెటూ, అంకెలూ మనకెందుకు భాయ్ ‘సూపర్ సిక్స’ సేఫ్‌గా ఉంటే చాలు, మనకదే పదివేలు అంది డాంకీ పళ్లికిలించటం పూర్తయ్యాక అనే వాళ్లుంటే సూపర్ సిక్స్ కాదు సిక్స్‌టీ కూడా అంటారు.
కాగితాల మీద కోట్లు కుప్పలు పోస్తారు. పన్నుల బాదుడులో ప్రజలకు పంగనామాలు పెడ్తారు అన్నాడబ్బాయి. ఇంతకూ నీ సంగతేమిటి? ముఖంలో నామాలేవీ కనపడ్డంలేదే. అంది డాగీ. పోలీసోడి దెబ్బ, బడ్జెట్‌లో వాత కనపడవు కానీ మళ్లీ నా కొంప కొల్లేరయింది అన్నాడబ్బాయి, కర్చీఫుతో ముఖం తుడుచుకుంటూ. ఎంతసేపూ ఉద్యోగం ఉద్యోగం అంటావే కానీ సర్కారు వారు హామీ ఇచ్చిన నిరుద్యోగ భతి పుచ్చుకుని హాయిగా ఉండరాదూ అంది డాంకీ. అదే! అక్కడికే వస్తున్నా. ఈ దఫా అన్నా, ఈ రాష్ట్ర మూడో బడ్జెట్‌లోనన్నా ‘నిరుద్యోగ భతి’ వస్తుందని గంపెడంత ఆశ పెట్టుకున్నానా! గంప తిరగబడింది అన్నాడబ్బాయి ముక్కు పిండుకుంటూ. అరెరే పాపం! మళ్లీ నిరుద్యోగి కష్టాలు కష్టాలు తప్పవన్న మాట. ఈసారి రైతులకూ, ఆడబిడ్డలకూ ఖర్చు పెట్టాలనుకున్నారేమో, ‘బెటర్ýక్ నెక్స్ట్ టైం’ అంది డాగీ. నెక్స్ట్ టైమంటూరాదు. తల్లికి వందనం కోత, అన్నదాత కోత, దీపానికీ కోతే. పేదల ఇళ్లు కాగితాల మూటలు, సున్నా వడ్డీకి మంగళం, నిరుద్యోగ భతి, ఆడబిడ్డ నిధి మాయం. మాయామయామి జగమనిత్యం అని పాడుకోడానికే మందు పుచ్చుకున్నానంటూ, వెళ్లిపోవడానికి లేచి నిలబడ్డాడు అబ్బాయి. సారీ బ్రదర్! సూపర్ సిక్స్ కాదు ‘సూపర్ హండ్రెడ’ వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరవేమో! అంది డాంకీ. నిరుద్యోగ భతి ఇవ్వలేకపోతే కనీసం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినట్టు, ఉద్యోగాల వేటలో చెప్ప్పులు అరిగించుకునే నిరుద్యోగులకూ ఉచిత బస్సు పథకం అమలు చెయ్యాలనే మంచి బుద్ధి ఎప్ప్పుడు పుడుతుందో అధికారం చలాయించే వాళ్లకి అంది డాగీ.ఎవరికెవరు ఈ లోకంలో! ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక అని పాడుకుంటూ వెళ్లేడు అబ్బాయి. ఇలా ‘సాడ్ సాంగ్స’ పాడుతున్నాడు కానీ రేపు చూడు వచ్చే బడ్జెట్‌లో ‘నిరుద్యోగ భతి’ ఉంటుందంటాడు పాపం ఆశాజీవి! అన్నది డాంకీ.తమకేదో మంచి జరుగుతుందని, తమ కష్టాల్, నష్టాల్ తీరిపోతయని ప్రభుత్వాలను ఎన్నుకునే, ప్రభుత్వాలను మార్చే ఓటర్లంతా ఆశాజీవులే అంది డాగీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు