Homeతెలంగాణఅధికార పార్టీకే అగ్ర తాంబూలం

అధికార పార్టీకే అగ్ర తాంబూలం

- Advertisement -

. 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం
. సీపీఐ1, బీజేపీ1
. 11 చోట్ల చైర్మన్ల ఎన్నిక వాయిదా
. రసవత్తరంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేశాయి. అయితే అనూహ్యంగా సుమారు 30 మున్సిపాలి టీల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడం… చాలా చోట్ల స్వతంత్రులు అధిక సంఖ్యలో గెలవడంతో వారిని తమ పార్టీలోకి లాక్కునేందుకు అన్ని పార్టీలు నజరానాలు ప్రకటించాయి. అదేవిధంగా చాలా చోట్ల ఇతర పార్టీల నుంచి గెలుపొందిన వారిని తమ పార్టీలోకి రప్పించుకోవడంలో కొన్ని పార్టీలు కొంతమేర సఫలం అయ్యాయి. ఈ క్రమంలో క్యాంపు రాజకీ యాలు నడిచాయి. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం ఎంతచేసినా అధికార కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా కరీంనగర్ మేయర్ స్థానం తాము కైవసం చేసు కుంటామని మంత్రి పొన్నం చెప్పడంతో అందరీ దష్టి కూడా ఈ స్థానం పై పడింది. కానీ చివరి నిమిషంలో అక్కడ బీఆరఎస్ తటస్థంగా ఉండడంతో ఈ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే చాలా మున్సిపాలిటీల్లో ముందుగా ఉహించిన వారి పేర్లు కాకుండా కొత్త వారి పేర్లను కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో అసమ్మతి మొదలైంది.
ముందుగా కార్పోరేషన్ల విషయానికి వస్తే మొత్తం 7 కార్పోరేషన్లలో కాంగ్రెస్ 5, సీపీఐ 1, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో కాంగ్రెస్ 87, బీజేపీ 1, బీఆరఎస్ 17 సొంతం చేసుకున్నాయి. ఈ ఫలితాలతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధించినట్లు స్పష్టం అవుతోంది. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. నిజామాబాద్ కార్పోరేషన్ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా అక్కడ మేయర్‌గా ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా ఏఐఎంఐఎంకు చెందిన సల్మాతాహిస్ ను ఎన్నుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు పూర్తి స్థాయి మేజారిటీ రాకపోవడంతో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అలాగే కరీంనగర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా ఇక్కడ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావులను ఎన్నుకున్నారు. అలాగే రామగుండం కార్పోరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్గొండ కార్పోరేషన్ లో కాంగ్రెస్ కు చెందిన ముర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మేయర్ గా డిప్యూటీ మేయర్ గా మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్ (ఏఐఎంఐఎం)ను ఎన్నుకున్నారు. మంచిర్యాల కార్పోరేషన్ నుండి మేయర్ గా ధరణి మధుకర్ (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ ఎస్ రమ్య మహేశ్ (కాంగ్రెస్)లు ఎన్నికయ్యారు. అలాగే మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మేయర్‌గా గుమాల్ మమత(కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ గా ఎం.సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)లను ఎన్నుకున్నారు.
కొత్తగూడెం కార్పోరేషన్ విషయానికి వస్తే ఇక్కడ సీపీఐ మెజార్టీ స్థానాలు సాధించగా కాంగ్రెస్ సహకారంతో తొలివిడత సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్`సీపీఐ ఒప్పందం ప్రకారం మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను పంచుకున్నారు. తొలుత మేయర్ పదవిని సీపీఐకి ఇవ్వడంతో మేయర్‌గా ఆ పార్టీకి చెందిన మూడ గణేశ్, డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన సిరిపురపు లలితా కుమారిని ఎన్నుకున్నారు.
11 స్థానాల్లో చైర్మన్ ఎన్నికలు వాయిదా
రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వివిధ కారణాల వల్ల ఈ 11 పురపాలికల్లో ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల అధికారులు వెల్లడిం చారు. అయితే వీటికి మళ్లీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేది ప్రకటించలేదు. దీంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్ వీడలేదు. చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీల జాబితాలో జనగామ, ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్‌నగర్, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, జహీరాబాద్, ఖానాపూర్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ స్థానాల్లో కూడా చైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆరఎస్ కౌన్సిలర్లు, నాయకుల మద్య వాగ్వాదం, కౌన్సిలర్ల కిడ్నాప్ వంటి ఘటనల వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అన్నీ కుదిరితే మంగళవారమే ఈ స్థానాల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జనగామలో కొనసాగుతున్న సస్సెన్స్
ఇక జనగామ మున్సిపాలిటీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. జనగామలోని 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయం సాధించగా… దాని మిత్రపక్షమైన సీపీఎం ఒక వార్డును దక్కించుకుంది. ఇక ప్రతిపక్ష బీఆరఎస్ కూడా 13 సీట్లలో గెలిచింది. మరో నలుగురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఇక ఎక్స అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా తన ఓటును నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీంతో మళ్లీ ఇరుపార్టీలకు సమానంగా చెరో 14 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దృష్టి మొత్తం ఇండిపెండెంట్ కౌన్సిలర్లపై పడింది. నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్‌కు ఇద్దరు, బీఆరఎస్‌కు ఇద్దరు మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం జరగడంతో జనగామ మున్సిపల్ రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. మరి చివరి నిమిషం వరకు ఇక్కడ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడంలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనే విషయం సర్వత్రా చర్చనీయంశమైంది.
కరీంనగర్‌లో చివరివరకు ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కూడా కరీంనగర్ మేయర్ ఎన్నిక పై అందరి ద్రుష్టి కేంద్రీకతమైంది. కాగా ఈ స్థానం కైవసం చేసుకునేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అందరీ దష్టి బీఆరఎస్, ఇండిపెండెంట్లపైనే పడింది. దీంతో వీరు ఎవరికి మద్దతు ఇస్తారు? ఎవరికి మేయర్ పీఠం దక్కుతుందన్న ఉత్కంఠ ఏర్పడింది.
ముఖ్యంగా కరీంనగర్ మేయర్ స్థానం కోసం కాంగ్రెస్ కూడా పోటీలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం… అందుకనుగుణంగానే సోమవారం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే ఇక్కడ మొత్తం 66 స్థానాలు ఉండగా మెజార్టీకి కావాల్సిన 33 స్థానాలు ఏ పార్టీకి కూడా దక్కలేదు. బీజేపీ 30 స్థానాలకు, బీఆరఎస్ 9 స్థానాలకు, కాంగ్రెస్ 21 స్థానాలకు పరిమితం అవ్వగా 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. అయితే వీరిని బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. అలాగే ఎంపీగా ఉన్న బండిసంజయ్ ఎక్స్ అఫిషియో ఓటును నమోదు చేసుకోవడంతో బీజేపీ ఓటింగ్ సంఖ్య 34కు చేరింది. కాంగ్రెస్ మాత్రం బీఆరఎస్ సహకారంతో పాటు మరికొంతమంది ఇతర పార్టీల కార్పోరేటర్ల సహకారంతో గెలిచే ప్రయత్నం చేసింది. కాని కాంగ్రెస్ కు బీఆరఎస్ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండడంతో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి.
బీఆరఎస్ ఖాతాలో పడిన మున్సిపాలిటీలు….
ఉమ్మడి మెదక్ జిల్లాలోని గడ్డపోతారాం, గుమ్మడిదల, ఇస్నాపూర్ (బీజేపీ మద్దతు), జిన్నారం, గజ్వేల్, తూఫ్రాన్, దుబ్బాక మున్సిపాలిటీలను బీఆరఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే ఆలంపూర్, అయిజల్లో చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. ఉమ్మడి రంగారెడ్డిలోని మూడు చింతలపల్లి, ఎల్లంపేట (బీజేపీ మద్దతు), ఉమ్మడి కరీంనగర్ లోని రాయికల్ (కాంగ్రెస్ మద్దతు), సిరిసిల్ల, జమ్మికుంటల చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ లోని చేర్యాల, ఉమ్మడి నల్గొండలోని తిరుమలగిరి, ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ఆసిఫాబాద్ ను కైవసం చేసుకోగా అనూహ్య రీతిలో అమన్ గల్ మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా కూడా చివరి నిమిషంలో కొందరు బీఆరఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఈ స్థానం హస్తం పార్టీకి దక్కింది. అలాగే కామారెడ్డిలో బీఆరఎస్‌కు కాంగ్రెస్‌కు మద్దతు పలికింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు