విద్యార్థులకు అండగా ఉంటామని హామీ
నీట్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నీట్ పేపర్ లీక్కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదని, తమకు జరిగిన అన్యాయంపై న్యాయం మాత్రమే కోరుతున్నారని అన్నారు.యువత శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని కేటీఆర్ హెచ్చరించారు. ‘‘ఇది భయపడే జనరేషన్ కాదు.. పాలకులను భయపెట్టే జనరేషన్్ణ్ణ అని వ్యాఖ్యానించారు. యువతతో ఘర్షణ పడిన నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితిని కేంద్రం గుర్తుంచుకోవాలని సూచించారు. గతంలో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర తమదేనని, ఇప్పుడు కూడా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తాము ధర్నా చేస్తుంటే, దానిని అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ను పంపడం ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి: కేటీఆర్
- Advertisement -
RELATED ARTICLES


