Homeజాతీయంనీట్‌ లీక్‌ వ్యవహారంపై కేంద్రం,ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

నీట్‌ లీక్‌ వ్యవహారంపై కేంద్రం,ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -

నీట్‌-యూజీ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పరీక్షల నిర్వహణలో పదేపదే జరుగుతున్న లోపాలను ఇకపై సహించబోమని స్పష్టం చేసిన ధర్మాసనం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీసుకుంటున్న చర్యలపై సమగ్ర వివరాలు సమర్పించాలని ఆదేశించింది.
శుక్రవారం ఈ కేసును విచారించిన జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం.. నీట్‌ పరీక్షల నిర్వహణలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని పేర్కొంది.
ఈ అంశాన్ని తాము అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది.

సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం
నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన అనంతరం పరీక్షల నిర్వహణలో అమలు చేసిన మార్పులు,భవిష్యత్తులో చేపట్టనున్న సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం,ఎన్‌టీఏ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే అవకాశాలు,ఆ విధానంలో డేటా భద్రతను ఎలా నిర్ధారిస్తారన్న అంశాలపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా, ఁకంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తే డేటా భద్రతను ఎలా కాపాడతారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇక వరుస తప్పిదాలు కొనసాగనివ్వం
విచారణ సందర్భంగా ధర్మాసనం పరీక్షల నిర్వహణలో పదేపదే వెలుగుచూస్తున్న లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఁఇకపై వరుస తప్పిదాలను కొనసాగనివ్వం. ఈ అంశాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తాంఁ అని స్పష్టం చేసింది.కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని కోర్టుకు తెలిపారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి రూపొందిస్తున్న సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.

ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ
ఇక నీట్‌ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన అంశం కూడా న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నిరసనల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఇంటర్నెట్‌ నిలిపివేత నిర్ణయం చట్టబద్ధమా కాదా అనే అంశంపై కోర్టు విచారణ చేపట్టనుంది.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన నిరసనల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి.ఇప్పటికే నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసులో పలువురిని అరెస్టు చేసిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నీట్‌ పరీక్షల భవిష్యత్‌ నిర్వహణ విధానం, భద్రతా ప్రమాణాల బలోపేతం, సంస్కరణల అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు