Homeఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ విజయం

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ విజయం

- Advertisement -

న్యూదిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికలో సీపీ రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఇండియా ఐక్యసంఘటన అభ్యర్థి జస్టిస్‌ బీఎస్‌ సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. దీంతో భారత 17వ ఉపరాష్ట్రపతి అయ్యారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల ఆధిక్యంతో రాధాకృష్ణన్‌ విజయం సాధించినట్లు రాజ్యసభ సెక్రెటరీ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్‌ కాలేజ్‌లో మొత్తం 781 మంది సభ్యులు ఉండగా, అందులో 752 ఓట్లు పోల్‌ అయ్యాయి. అందులో 15 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. 14మంది ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కావాలంటే 377 ఓట్లు సాధించాలి. జగదీప్‌ ధన్కర్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి భర్తీ చేసేందుకు మంగళవారం పోలింగ్‌ జరిగింది. మొదట ప్రధాని నరేంద్రమోదీ ఓటు వేశారు. తర్వాత వరుసగా కేంద్రమంత్రులు ఓటు వేశారు. ఈ ఎన్నికలో ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలు పంపిణీ చేయగా తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఎంపీలు ఓట్లు వేశారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర సీనియర్‌నేతలు వరుసగా వచ్చి ఓటు వేశారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ సహా ఇండియా ఐక్యసంఘటన నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో 781మంది ఎంపీలు ఓటు వేసేందుకు అర్హులు కాగా… నలుగురు సభ్యులు ఉన్న బీఆర్‌ఎస్‌, ఏడుగురు సభ్యులు ఉన్న బీజేడీ, ఒక సభ్యుడు ఉన్న శిరోమణి అకాలీదళ్‌ ఓటింగ్‌లో పాల్గొనడం లేదని ముందే ప్రకటించాయి. ఈ పన్నెండు మందిని మినహాయిస్తే, ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో 769 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలో గెలిచేందుకు 391 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా, అధికార ఎన్డీఏకి 425 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన 11మంది కూడా ఎన్డీఏకి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ గణాంకాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమే అయింది. అయితే ఈ ఎన్నికలో ప్రతిపక్ష పార్టీలన్నీ చివరి వరకు కలిసికట్టుగా ఉండడం గమనార్హం.
రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల అభినందన
దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ప్రభృతులు అభినంద నలు తెలిపారు. ప్రజాజీవితంలో దశాబ్దాల తరబడి రాజకీ యంగా, పాలనాపరంగా తనకున్న అపార అనుభవం దేశ పురోగతికి ఎంతగానో ఉపయోగప డుతుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
బలమైన సంఫ్‌ు నేపథ్యం….
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ 1957 అక్టోబర్‌ 20న తమిళనాడులోని తిరుప్పుర్‌లో సి.కె.పొన్నుస్వామి-జానకి దంపతులకు జన్మించారు. బలమైన సంఫ్‌ు నేపథ్యమున్న రాధాకృష్ణన్‌కు బీజేపీలో అత్యంత విధేయుడిగా పేరుంది. ధన్కర్‌ రాజీనామాతో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ ఆయన్ను ఎంచుకొంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపి గెలిపించింది. ఆయన కాలేజీ సమయంలో టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌. బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తి చేశారు. రాధాకృష్ణన్‌ 16 ఏళ్ల వయసులో తొలిసారి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌), భారతీయ జన సంఫ్‌ు సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన 1974లో సంఫ్‌ు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూర్‌ స్థానం నుంచి బీజేపీ నుంచి విజయం సాధిం చారు. బీజేపీ తమిళనాడు శాఖకు ఆయన 2004, 2007లో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మోదీ సర్కారు 2023లో జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమించింది. దాదాపు ఏడాదిన్నర అక్కడ పనిచేసిన తర్వాత గతేడాది మార్చిలో తమిళసై సౌందర రాజన్‌ రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కానీ, జులైలో ఆయన్ను మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించారు. మిగిలిన రాష్ట్రాల బాధ్యతలను ఇతరులకు అప్పగించారు.
తీర్పును స్వీకరిస్తున్నా: జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి
ఉపరాష్ట్రపతి ఫలితాలపై ‘ఇండియా’ అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి లేఖ విడుదల చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.. ‘‘ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నా.. ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చింది.. న్యాయం, ప్రతీ వ్యక్తి గౌరవం కోసం నిలబడే అవకాశం అందించింది. నన్ను కూటమి అభ్యర్థిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభా కాంక్షలు.’’ అని లేఖలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
20 మంది ఎంపీల క్రాస్‌ ఓటింగ్‌…!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 752 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మిగతా15 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. సీపీ రాధాకృష్ణన్‌ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందగా, ఇండియా ఐక్యసంఘటన అభ్యర్థి బీ సుదర్శన్‌ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇండియా కూటమికి చెందిన కనీసం 20 మంది ఎంపీలు క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఊహించిన దానికంటే 25 ఓట్లు ఎక్కువగా పొందారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి మద్దతుదారుల ఓట్లు పూర్తి స్థాయిలో రాకపోవడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు