11న పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ‘ఇండియా’ మార్చ్: డి.రాజా
న్యూదిల్లీ: స్వాతంత్య్ర పోరాటం ద్వారా సాధిం చుకున్న ఓటు హక్కుకు ఎట్టిపరిస్థితు ల్లోనూ విఘాతం కలగనివ్వబోమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తేల్చిచెప్పారు. ఓటు హక్కును హరిస్తే సహించే ప్రసక్తే లేదని, అలా ఎప్పటికీ జరగనివ్వబోమని స్పష్టంచేశారు. ఓటర్ ఎమ్యునరేషన్, బీహార్ ఎస్‌ఐఆర్‌తో పాటు ఎన్నికల మోసాలపై ఈసీ నుంచి స్పష్టత రావాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఇండియా ఐక్య సంఘటన నిర్ణయించినట్లు రాజా వెల్లడిరచారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో ‘ఇండియా’ నాయకుల భేటీలో కీలక అంశాలపై నిశితంగా చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం పని తీరుపై అనుమానాల దృష్ట్యా రాహుల్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, ఆరు నెలల విచారణలో వెల్లడైన వివరాలను ఇండియా నాయకులకు వివరించారని చెప్పారు. ప్రాథమిక హక్కుగా ఉన్న ఓటు హక్కు పరిరక్షణకు, దాని తొలగింపు చర్యలకు వ్యతిరేకంగా ఇండియా ఐక్య సంఘటన ఒకే మాటపై ఉందని, కలిసికట్టుగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళుతున్నదని రాజా అన్నారు.


