పారిశుద్ధ్య కార్మికుల మహాధర్నా విజయవంతం
. పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని వేలాదిగా ముందుకు…
. సమస్యలు పరిష్కరించాలని పెద్ద పెట్టున నినాదాలు
. రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తాం
. ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్… ఏఐటీయూసీ నేతలు
విశాలాంధ్ర – విజయవాడ(చిట్టినగర్) : సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన చలో విజయవాడ మహా ధర్నాకు కార్మిక లోకం కదిలివచ్చింది. ఆయా ప్రాంతాల్లో కార్మికులను నిర్బంధిం చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ నిర్బంధాలను ఎదుర్కొని రాష్ట్ర నలుమూలల నుంచి కార్మికులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా బయలుదేరి ధర్నాచౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఆసుల రంగనాయకులు, నెక్కింటి సుబ్బారావు అధ్యక్షతన మంగళవారం ఈ మహాధర్నా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపల్ అవుట్ సోర్సింగ్, పారిశుద్ధ్య కార్మికుల శ్రమ లేకుండా స్వచ్ఛాంధ్ర సాధ్యం కాదని, సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం కార్మికులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల తరబడి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, డైలీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంటే వారికి దిక్కు ఎవరని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈ వ్యవస్థల్లో సంవత్సరాల తరబడి మగ్గిపోతున్న బడుగు జీవులయిన వీరికి శాశ్వత ఉద్యోగాలు కల్పించేందుకు బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని కోరారు. వేలాది మంది కార్మికుల సమస్యలు పరిష్కరించా లని, థర్డ్ పార్టీ కాంట్రాక్టు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో 14 రోజులు సమ్మె చేసిన సందర్భంలో ఆప్కాస్ సంస్థలో అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెబితే సంతోషించా మని గుర్తు చేశారు. మన ఉద్యమానికి మద్దతునిచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. అప్కాస్ సంస్థను రద్దు చేసి ఏజెన్సీల ద్వారా పాత విధానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకురావా లన్న ఆలోచనను విరమించుకోవాలని, ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారం వచ్చాక మరొక మాట సబబు కాదని ప్రభుత్వానికి హితవు పలికారు. నగరపాలక సంస్థలో పని చేస్తున్న కార్మికుల జీతాల చెల్లింపు నిర్వహణ సంస్థదే పూర్తి బాధ్యత అని, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, మూడు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ నగదు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, జనాభా ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, ఇల్లు లేని పేద కార్మికులకు ఇల్లు కేటాయిం చాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మునిసిపల్ కార్మికులంతా డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఉద్యమాలలో భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరుమామిళ్ల సుబ్బా రాయుడు, గౌరవ సలహాదారులు నెక్కంటి సుబ్బారావు, వీఎంసీ ఉపాధ్యక్షులు బిందెల రవికుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.మల్లేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు కోట మాల్యాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి దాసు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బి.శ్రీనివాసరావు కామేష్, ఉపాధ్యక్షులు దోన స్వామి, జాన్, చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, అన్నమయ్య జిల్లా నాయకులు వర్రి సురేశ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని, అప్కాస్ సంస్థను రద్దు చేయాలని యోచిస్తుందని, కార్మికులకు పనిముట్లు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులంతా ఉద్యమానికి సన్నద్ధంగా ఉందామని తెలిపారు. ఏఐటీయూసీ మాజీ నాయకులు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. పారిశుద్ధ్య కార్మికులంతా సోదరులే అంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెబుతున్నారని అన్నారు. అయితే మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ మహా ధర్నా కార్యక్రమానికి అనుమతిలిచ్చిన ప్రభుత్వం నిర్బంధం పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు హిట్లర్ మాదిరి నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. కార్మికులకు నష్టం జరిగినా అసెంబ్లీలో ప్రస్తావన లేకపోవడం బాధ కలిగిస్తోందని, ఎర్రజెండా ప్రతినిధులు అసెంబ్లీలో ఉంటే కార్మికుల పక్షాన నిలబడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మునిసిపల్ కార్మికులంతా నగరాన్ని సుందర వనంలా తీర్చిదిద్దుతుంటే ప్రభుత్వ అధికారులకు అవార్డులు వస్తున్నాయని, ఈ ప్రతిఫలమంతా కార్మికుల శ్రమ ఫలితమేనని తెలిపారు. కార్మికులంతా చేపట్టే ఐక్య ఉద్యమాలకు సీపీఐ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ విజయవాడ నగర అధ్యక్షులు కె.ఆర్.ఆంజనేయులు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.రాజా, ఎస్వీ చలం, వివిధ జిల్లాల నాయకులు కళ్యాణి, అప్పలరాజు, పలగం మద్దిలేటి, నిర్మల, అబ్బాస్, మంగళగిరి దుర్గారావు, తారక రామారావు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.