Wednesday, June 4, 2025
Homeకొల్లేరు సమస్యకు చెక్‌

కొల్లేరు సమస్యకు చెక్‌

. పర్యావరణం కాపాడుతూ మానవీయ కోణంలో పరిష్కరిద్దాం
. ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవడంతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణం, కాంటూరు అంశాలపై సచివాలయంలో సోమవారం సీఎం సమీక్షించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారని… కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. దీని పరిష్కారం కోసం 2014 నుంచి 2019 మధ్య నాటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందని… ఇందులో భాగంగా 2018లో నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు 20 వేల ఎకరాల జరాయితీ, డీ పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దులను నిర్థారించేందుకు సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీకి సిఫారసు కూడా చేయగా… దీనిపై కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిందన్నారు. కాగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదన్నారు. కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా చూడాలని, కొల్లేరులోకి వెళ్తున్న డ్రైన్‌ వాటర్‌కు పరిష్కారం జరగాలని, విచ్చల విడిగా డ్రెయిన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడాల్సి ఉందన్నారు.
ముఖ్యంగా కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు అక్రమణలను తొలగించాలి. అవుట్‌ లెట్లు పూర్తిగా క్లియర్‌ చేయాలి. ఈ పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. కొల్లేరు రైతుల సమస్యలపై మాట్లాడుతూ…కొల్లేరు పరిధిలో 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములు ఉన్నాయి. కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీని, సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలి. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షకు చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌తో పాటు అధికారులు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్‌ హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు