. ఐబీఎం, టీసీఎస్,ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో ఏర్పాటు
. సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి
. బహుళజాతి సంస్థలు త్వరపడాలి
. జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి…2026 జనవరి 1 నాటికి దీనిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఈ క్వాంటం వ్యాలీ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, క్వాంటం కంప్యూటింగ్‌ను భారత్ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. స్టార్టప్ కంపెనీలు పెద్దసంఖ్యలో రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. నేషనల్ క్వాంటం మిషన్‌ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. క్వాంటం వ్యాలీ పార్క్ కు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్‌ను పరీక్షిస్తాం. ఓ మిషన్ తీసుకువచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదు. వివిధ ఉపకరణాల నుంచి రియల్-టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమ వంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ అవసరం. క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలు ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవం. ఈ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15 నుంచి వందశాతం పౌరసేవలు వాట్సప్ ద్వారానే అందిస్తాం. డేటా లేక్‌పై ఏపీ ప్రస్తుతం పనిచేస్తోంది. పౌరుల నివాసాలు జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్ లైన్ పైల్స్, క్లౌడ్ డేటాలను పాలనలో వినియోగిస్తున్నాం. సీసీ కెమెరాలు, సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటా వస్తోంది. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరం. వ్యవసాయ రంగంలో భూమిలో తేమ, ఎరువుల వినియోగం లాంటి అంశాలను కూడా క్వాంటం కంప్యూటింగ్ తో అనుసంధానిస్తే అద్భుతాలు చేయొచ్చు. క్వాంటం టెక్నాలజీలో స్టార్టప్‌లు కూడా వస్తే అవకాశాలు విస్తృతం అవుతాయి. ఫార్మా రంగంలోనూ, వ్యక్తుల ఔషధ వినియోగం వంటి వాటిపై కూడా పరిశోధనలు సాగించవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను మరో స్థాయికి చేరుస్తుంది. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నాం. బహుళజాతి కంపెనీలు భాగస్వాములు కావాలి. ఇప్పుడే పెట్టుబడులతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్‌లోనే ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడి మార్కెట్‌ను వినియోగించుకోవాలని చంద్రబాబు కోరారు.
వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యం: మంత్రి లోకేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సృష్టించిన సాంకేతిక విప్లవంలో రెండో అధ్యాయం క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజారాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్యాంటం వ్యాలీగా మార్చాలనేది మా లక్ష్యం. ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలుగా, ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా నిలవబోతోంది. క్యూబిట్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు, ఆల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటం ప్రమాణాల వరకు మేం పూర్తిస్థాయిలో క్వాంటం సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన 156 క్యూబిట్లను కలిగిన ఐబీఎం క్యాంటం సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి రానుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఆసియాలో మొట్టమొదటి క్వాంటం ప్రమాణాల టెస్ట్‌బెడ్‌ను ఎన్పీఎల్, ఐఈఈఈ, సీయాక్, ఏడబ్ల్యూఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తాం. ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్యాంటం స్టారప్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తాం. ఈ కార్యాచరణకు వ్యూహాత్మక దూరదృష్టి ఉందని మంత్రి లోకేశ్ వివరించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ ప్రోటోటైప్‌ను ఐబీఎం నేషనల్ వర్క్ షాప్‌లో ప్రదర్శించింది. నేషనల్ వర్క్ షాప్‌లో భాగంగా ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ స్టార్టప్‌లను మంత్రి లోకేశ్‌తో కలిసి సీఎం పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సందీప్ పటేల్, ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రోడర్, టీసీఎస్ టెక్నాలజీ, స్టాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి.రాజన్న, ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, అడ్వైజర్ ఎంవీ సతీష్, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కే.మధుమూర్తి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోఠి, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


