ఆర్వీ రామారావ్
మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రగానీ, కార్మికోద్యమ చరిత్రగానీ శ్రీపాద అమృత డాంగే పేరెత్తకుండా పూర్తి కాదు. డాంగే 1925లో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మార్క్సిస్టు సిద్ధాంతవేత్తల్లో కూడా డాంగే అగ్రగణ్యులు. సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలకు అధ్యక్షులు ఉండరు. కేవలం ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉంటారు. కానీ సీపీఐ చీలిన తరవాత 1980 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కి డాంగే చైర్మన్‌గా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చైర్మన్ ఉండడం చైనా కమ్యూనిస్టు పార్టీలోనే కనిపిస్తుంది. మావో చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్‌గా ఉండేవారు. ఈ రెండు సందర్భాలలో తప్ప కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు అంతా ప్రధాన కార్యదర్శి స్థానంలో ఉన్నవారే.
డాంగే జీవితంలో వైపరీత్యం ఏమిటంటే సీపీఐని నెలకొల్ప డంలో కీలక పాత్ర పోషించిన ఆయనను కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరిం చారు. అక్కడి నుంచే కమ్యూనిస్టు నాయకుడిగా డాంగే కీర్తి మసకబారింది. సహాయ నిరాకరణోద్యమాన్ని గాంధీ అర్ధంతరంగా ఉప సంహరించడం వల్ల అప్పటిదాకా కాంగ్రెస్ నాయకత్వంలో కొనసాగుతున్న జాతీయోద్యమంలో భాగస్వాములైన వివిధ రాజకీయ ఛాయలున్న వారిలో గాంధీపై అసంతృప్తి పెరిగింది. గాంధీ మీద అసంతృప్తి పెరగడంతో పాటే డాంగేలో మార్క్సిజం మీద ఆసక్తి పెరిగింది. 1921లో ఆయన గాంధీ వర్సెస్ లెనిన్ గ్రంథం రాశారు. ఈ గ్రంథం లెనిన్‌కు కూడా నచ్చిందంటారు. డాంగే నిశితంగా మార్క్సిజం అధ్యయనం చేయడానికి బొంబాయిలో పిండి మిల్లు యజమాని రణ్ చోడ్ దాస్ బవన్ లొట్వాలా సహాయం చాలా ఉంది. ఆయన సహాయంతోనే డాంగే మొట్టమొదటి మార్క్సిస్టు పత్రిక ‘‘సోషలిస్టు’’ ను నిర్వహించగలిగారు అంటారు.
డాంగే మొత్తం 16 ఏళ్ల కాలం జైలులో గడిపారు. కాన్పూర్ బోల్షెవిక్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసులో డాంగే నిందితుడు. ఈ కేసుల్లో ఆయన జైలు శిక్ష అనుభవించ వలసి వచ్చింది. 1927 నాటికి డాంగే బొంబాయిలో కార్మిక నాయకుడిగా ప్రసిద్ధుడయ్యారు. గిర్నీ కాంగార్ యూనియన్‌కు ఆయనే అగ్రనాయకుడు. ఈ కార్మిక సంఘం వస్త్ర పరిశ్రమ కార్మికులపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేది. గిర్నీ కాంగార్ యూనియన్‌లో 324 మంది సభ్యులు ఉంటే డాంగే నాయకత్వంలో ఆ సభ్యత్వం 54,000కు పెరిగింది. డాంగే మరాఠీ పత్రిక ‘‘క్రాంతి’’ కూడా నడిపారు. ఇది గిర్నీ కాం గార్ యూనియన్ అధికార పత్రికగా ఉండేది. డాంగే చాలా కాలం ఏఐటీయూసీ అధ్యక్షులుగా ఉన్నారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు డాంగే కార్మికోద్యమంలో విశిష్టమైన పాత్ర పోషించారు.
చట్టసభల్లో కూడా డాంగేది ఎన్నదగిన పాత్రే. 1946 నుంచి 1951 దాకా బొంబాయి శాసన సభ్యుడిగా ఉన్నారు. ఆ తరవాత రెండవ, నాల్గవ లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా విడగొట్టాడానికి సాగిన ఉద్యమంలో కూడా డాంగే చురుకుగా పాల్గొన్నారు. 1980 ఫిబ్రవరిలో డాంగే సీపీఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. 1981 ఏప్రిల్ 12న ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఎమర్జెన్సీ సమయంలో సీపీఐ ఇందిరాగాంధీకి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారకుడు డాంగే అంటారు. పార్టీ నుంచి బహిష్కృతుడైన మరుసటి నెలలోనే డాంగే తన కూతురు రోజాదేశ్‌పాండేతో కలిసి ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ (ఏఐసీపీఐ) ఏర్పాటు చేశారు. ఆ తరవాత యునైటెడ్ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు. కళాశాలలో ఉన్నప్పుడు బైబిల్ బోధించడాన్ని వ్యతిరేకించినం దుకు కళాశాల నుంచి బహిష్కరించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాల గంగాధర్ తిలక్ ప్రభావం డాంగే మీద ఎక్కువగా ఉండేది. 1935లో జైలు నుంచి విడుదలైన తరవాత డాంగే కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. దీనితో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో ఉన్న చాలా మంది కమ్యూనిస్టు పార్టీలో చేరారు. డాంగేకు అమితమైన సాహిత్యాభినివేశం ఉండేది. సంస్కృతం చదువుకున్న వారు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కమ్యూనిస్టు ఉద్యమంలో డాంగే పాత్ర విస్మరించడానికి వీలులేదు. సీపీఐలోనూ, కార్మికోద్యమంలోనూ శిఖరాయమాన పాత్ర పోషించిన డాంగే చివరకు ఒంటరిగా మిగిలిపోవడం పెద్ద విషాదం.