Homeడేటా ఆధారిత పాలన

డేటా ఆధారిత పాలన

- Advertisement -

. ‘వన్‌ విజన్‌-వన్‌ డైరెక్షన్‌’ ప్రభుత్వ విధానం
. సమాచార క్రోడీకరణతో మెరుగైన సేవలు
. విజన్‌ యూనిట్లుగా గ్రామ సచివాలయాలు
. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం నివారించాలి
. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వన్‌ విజన్‌-వన్‌ డైరెక్షన్‌ ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్‌ యూనిట్లుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి..? సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు…? డేటా ఆధారిత గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై సీఎం చంద్రబాబు మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి… అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్‌ ప్రణాళికలను రూపొందించాం. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను. నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్‌ యూనిట్‌గా మార్చుకుని సమర్ధవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలి. ఇటీవల వచ్చిన తుఫాన్‌ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని సీఎం అన్నారు.
ప్రస్తుతం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కాలం నడుస్తోంది. సిటిజెన్‌ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్‌ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు డేటా లేక్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్‌ టైమ్‌లోనే విశ్లేషించి… తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ముందుగా అంచనాలు వేయడం…దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం…తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించండం అనేది టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన డీజీ లాకర్‌ను సమర్థంగా వినియోగించాలి. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి. ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తున్నప్పుడు మళ్లీ ప్రజల్ని కార్యాలయాలకు రప్పించటం ఎందుకన్నది ఆలోచించాలి. ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు. అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి. ఏఐ సాయంతో పాత సమాచారాన్ని, ప్రస్తుతం ఉత్పన్నం అయ్యే సమాచారాన్ని ఇంటిగ్రేట్‌ చేసుకోవాలని సీఎం సూచించారు.
పారదర్శకత పాటించాలి… ప్రజలకు వాస్తవాలు చెప్పాలి
గత పాలకుల వల్ల 22ఏ లాంటి వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత బాధ్యతగా వ్యవహరించాలి. అలాగే ఎక్సైజ్‌ శాఖలోనూ గత ప్రభుత్వంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి అపోహల నుంచి ప్రజలకు అవగాహన కల్పించి వాస్తవాలు వివరించాలి. సింగిల్‌ టీమ్‌, సింగిల్‌ అప్రోచ్‌, సింగిల్‌ థీమ్‌తో అంతా పనిచేద్దాం. రాష్ట్ర అభివృద్ది విషయంలో ఎలాంటి రాజీ లేదు. అధికార యంత్రాంగం అంతా బాధ్యతతో పనిచేయాల్సిందే. ప్రభుత్వ శాఖలు 100 శాతం ఆన్‌ లైన్‌ సర్వీసులను ప్రజలకు అందించాలి.
ఫైళ్ల క్లియరెన్సు విషయంలో ఇంకా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మంత్రుల పనితీరు బాగా మెరుగుపర్చుకోవాలి. ఫైళ్లు క్లియర్‌ చేయటంలో ఆలస్యం జరగకూడదు. ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు రేటింగ్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు వెల్లడిరచారు. ఈ సందర్భంగా అధికారులు టెక్నాలజీని తమ తమ శాఖల్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు