బీహార్‌లో 65 శాతం పోలింగ్
. చెదురు మదురు ఘటనలు…ఈవీఎంల మొరాయింపు
. అనేక చోట్ల ఓట్ల గల్లంతుపై ప్రజల ఫిర్యాదులు
. డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హాకు చేదు అనుభవం
. భక్తియార్‌పూర్‌లో ఓటేసిన సీఎం నితీశ్, పట్నాలో లాలు, తేజస్వి
. గెలుపుపై అధికార, ప్రతిపక్ష నేతల ధీమా
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అధికారులు అనుమతించారు. సుమారు 65శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడిరచారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో, తొలి విడతలో భాగంగా 121 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలి విడత పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే ముగిసినప్పటికీ, లఖిసరాయ్ నియోజకవర్గంలో మాత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. లఖిసరాయ్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయ్ కుమార్ సిన్హా వాహనంపై చెప్పులు, పేడ విసిరి, ‘ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన వాహనం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడిరది. ఈ ఒక్క ఘటన మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 7గంటలకు 121 స్థానాల్లో మొదలైన తొలిదశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. భద్రతా కారణాలతో 5 నియోజకవర్గాల్లో 5గంటలకే ముగించారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఆరంభంలోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ భక్తియార్‌పుర్‌లో ఓటువేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆయన సతీమణి మాయాశంక పట్నాలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్‌లో ఓటు వేశారు. కేంద్రమంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఖగారియాలో ఓటు వేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఆయన సతీమణి రబ్డీదేవి, కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ పట్నాలో ఓటువేశారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు లాలూ తెలిపారు. జన్‌శక్తి జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, లాలూ పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలో ఓటువేశారు.
ఈవీఎంలలో లోపాలు…
ఓట్ల గల్లంతు
వైశాలి, దర్భంగా, రాఘవ పూర్, ముజఫ్ఫర్ పూర్, తానా పూర్, భక్తియార్ పూర్ తో సహా పది జిల్లాల్లో ఈవీఎంలలో లోపాలు కనిపించాయి. కొన్ని చోట్ల తాము ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పేరు దగ్గర ఉన్న మీట పని చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. మరికొన్ని చోట్ల మూడు నాలుగు గంటల పాటు ఈవీఎంలు పని చేయలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. చప్రా జిల్లాలోని బ్రహ్మపూర్ లో కనీసం 150 మంది ఓటర్లు తమ పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థులు డబ్బులు, చీరలు పంపిణీ చేసినట్లు తెలిసింది.
సీఆర్పీఎఫ్ జవాన్లపై రాళ్లు విసిరిన ఆర్జేడీ కార్యకర్తలు
వైశాలిలో ఆర్జేడీ అభ్యర్థిని రెచ్చగొట్టడంతో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆ పార్టీ మద్దతు దారులు రాళ్లు రువ్వారు. వాస్తవానికి ఆర్జేడీ అభ్యర్థి తన మద్దతుదారులతో గుమిగూడగా, జవాన్లు వారిని తొలగించడంతో గందరగోళం రేగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
గోరేయకోఠిలో వివాదం… నిరసన
సివాన్ జిల్లాలోని గోరేయకోఠి అసెంబ్లీ నియోజకవర్గం నవీగంజ్ బ్లాక్ లోని 349, 350 లక్డీ మక్తాబ్ బూత్‌కు బీజేపీ అభ్యర్థి దేవేష్ కాంత్ సింగ్ వచ్చారు. ఆయన బుర్కాను తొలగించాలని ముస్లిం మహిళా ఓటర్లను కోరినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో స్థానిక ఓటర్లు తీవ్ర నిరసన తెలిపారు. ‘ఓటు చోర్ గద్దీ చోడో’ అంటూ నినాదాలు చేశారు.
వైశాలి జిల్లా మహువా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేశారన్న ఆరోపణలపై ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం బ్రహ్మపూర్ ప్రాంతానికి చెందిన 150 మంది ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహా వేశాలు వ్యక్తం చేశారు.
ముజఫర్‌పూర్ జిల్లా గైఘాట్ నియోజకవర్గంలోని మూడు బూత్‌లలో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. బూత్ నంబర్ 161, 162, 170 వద్ద వంతెనలు, రోడ్ల నిర్మాణం జరపడం లేదని ఓటర్లు నిరసన తెలిపారు.
లఖిసరాయ్ ఘటనపై చర్యలకు
ఈసీ ఆదేశం
మరోవైపు లఖిసరాయ్ ఘటనపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించింది. ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటానికి అనుమతించబోమని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈసీ నిశిత పరిశీలన
ఎస్‌ఐఆర్‌పై తీవ్ర దుమారం రేగటంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. తొలి విడత పోలింగ్ జరుగుతున్న 45వేలకుపైగా పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్తున్న లైవ్ ఫీడ్‌ను ముగ్గురు కమిషనర్లు పరిశీలించారు. బీహార్‌లో తొలిసారి అన్నిపోలింగ్ బూత్‌ల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, మిగితా ఇద్దరు కమిషనర్లు ఎస్.ఎస్.సంధు, వివేక్ జోషి దిల్లీ నిర్వాచన్ సదన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి బీహార్ తొలివిడత పోలింగ్‌ను పర్యవేక్షించినట్లు ఈసీవర్గాలు తెలిపాయి. ఇక ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్‌రాజ్‌ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని తొలి విడత ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీయూ బలాబలాలు పరీక్షకు నిలిచాయి. ‘ముస్లిం-యాదవ్’ ఓట్లపై ఆర్జేడీ, ఈబీసీ, మహాదళిత్ ఓటు బ్యాంకుపై జేడీయూ పెట్టుకున్న ఆశలు నిలుస్తాయో లేదో తొలి విడత ఎన్నికలే తేల్చనున్నాయి.


