మహిళల జట్టుతో రాష్ట్రపతి ముర్ము
న్యూదిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెటర్లు గురువారం రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా సభ్యులు ముర్ముతో ముచ్చటించారు. ప్రపంచకప్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన అమ్మాయిలను ద్రౌపదీ ముర్ము అభినందించారు. యువ తరానికి ముఖ్యంగా బాలికలకు ఆదర్శవం తంగా నిలిచారని ప్రశంసించారు. ‘మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్‌ను భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నా. క్రికెట్ ప్రయాణంలో మీరు ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొని ఉంటారు. అవన్నీ దాటుకుని ఇప్పుడు ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది. మీరు సాధించిన ఈ విజయాన్ని కోట్లాది మంది భారతీయులు వేడుకగా చేసుకున్నారు. ఈ జట్టు భారత వైవిధ్యతలను ప్రతిబింబిస్తోంది. విభిన్న ప్రాంతాలు, భిన్న పరిస్థితులు, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న వారంతా ఒక జట్టుగా సమష్టి విజయం సాధించారు. రాబోయే తరాలకు మీరంతా స్ఫూర్తిదాయకంగా నిలిచారు’ అని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రాష్ట్రపతికి బహూకరించారు.
కాగా, భారత మహిళల జట్టు సభ్యులు, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రధాని అభినందించారు. టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. ఫిట్ ఇండియా సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని క్రికెటర్లను ప్రధాని కోరారు. ఊబకాయ సమస్య పెరిగిపోతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలకు వెళ్లి క్రీడలను ఎంచుకునేలా యువతకు ప్రోత్సాహాన్నివ్వాలని మోదీ సూచించారు. క్రికెటర్లకు స్వయంగా స్వీట్లు అందజేశారు.


