. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
. వర్షానికి దెబ్బతిన్న పంటలు పరిశీలించిన సీపీఐ ప్రతినిధి బృందం
విశాలాంధ్ర`విజయవాడ/ తాడేపల్లి:vఅకాల వర్షాలు, ఈదురుగాలులతో పంట నష్టపోయిన రైంతాగాన్ని తక్షణమే ఆదుకోవాలని, ఎటువంటి జాప్యం లేకుండా ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించడానికి, రైతులకు భరోసా కల్పించడానికి సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించింది. ముందుగా రామకృష్ణ నేతృత్వంలో పార్టీ ఎన్‌టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుడ్డి రమేశ్, జిల్లా పార్టీ నాయకులు బుడ్డి రాయప్ప తదితరులతో కూడిన సీపీఐ ప్రతినిధి బృందం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడులో పర్యటించింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చినా… ఇప్పటి వరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం విచారకరమన్నారు. పైడూరుపాడులో రైతుల వద్ద ధాన్యాన్ని సంచులలో నింపి 15 రోజులైనప్పటికీ మిల్లులకు తరలించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ నీటిమూటగా మారిందన్నారు. పైడూరుపాడులోనే సమస్య ఇంత తీవ్రంగా ఉంటే… ఇతర ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. సంచులు ఇవ్వటంలోను, కాటావేసే విషయంలోనూ, లారీలు పంపటంలోనూ, మిల్లులకు పంపడంలోనూ జరుగుతున్న జాప్యాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పైడూరుపాడుతో పాటు కొత్తూరు తాడేపల్లి, నున్న, ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు, ఈలప్రోలు, జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామాల్లో సంచులతో నింపిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ బుడమేరు వరదల వల్ల ఖరీఫ్ పంట దెబ్బతిందని, రబీలో పండిన పంటను మద్దతు ధరలకు అమ్ముకుందామంటే ప్రభుత్వం జాప్యం చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు గండ్లు వెంటనే పూడ్చి ఖరీఫ్ సీజన్‌కు సాగుకు సిద్ధం చేయాలని కోరారు. సీహెచ్ కోటేశ్వరరావు, పి.జమలయ్య, మల్నీడి యలమందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విఫలమవడం వల్లనే దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రతినిధి బృందంలో సీపీఐ విజయవాడ రూరల్ మండల కార్యదర్శి ఉప్పె నరసింహారావు, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి కన్నా వెంకటేశ్వరరావు, కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు తాటికొండ రమేశ్ బాబు, రైతుసంఘం నాయకులు చెరుకూరి శ్రీనివాసరావు, చెరుకూరి కుటుంబరావు, పి.నాగరాజు, పెయ్యల నాగేశ్వరరావు, పి.నాగరాజు, బోగేశ్వరావు, మోషే తదితరులు ఉన్నారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కుంచనపల్లి గ్రామాలలో సీపీఐ ప్రతినిధి బృందం పర్యటించింది. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో 17 వేల ఎకరాల్లో ఆహార పంటలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, ఆహార పంటలకు ఎకరానికి రూ.30 వేలు, ఉద్యాన పంటలకు రూ.75 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో పిడుగులు పడి 10 పదిమంది చనిపోయారని, వీరి కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కూతవేటులో దెబ్బతిన్న అరటిపంటను ఇంతవరకు వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ అధికారులు పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. పశ్చిమగోదావరి, నంద్యాల, కాకినాడ, శ్రీసత్యసాయి, కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, అరటి, బొప్పాయి తదితర పంటలు దెబ్బతిన్నాయని, అయినా ఇప్పటికీ ఎన్యూమరేషన్ జరగలేదని, అధికారులు ఎవరూ దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించలేదన్నారు. నష్టాన్ని అంచనా వేయకుండానే 24 గంటల్లో డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రామకృష్ణ వెంట సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రైతుసంఘం నాయకులు సుహాస్, పార్టీ నాయకులు జాన్‌బాబు సాంబిరెడ్డి, జీఎస్‌ఆర్ తదితరులు ఉన్నారు.