ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం
ఫీజు రీఫండ్-త్వరలోనే కొత్త తేదీలు: ఎన్టీఏ
న్యూదిల్లీ: జాతీయ అర్హత పరీక్ష (నీట్ యÖజీ2026) ప్రశ్నాపత్రం లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్ యూజీ2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కాగా, ఈ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం, సీబీఐ విచారణకు ఆదేశించింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడటానికి, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు విభాగాల నుంచి అందిన నివేదికల ఆధారంగా పరీక్షా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు తెలిపింది. సీబీఐ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్టీఏ తెలిపింది. అందుకు అవసరమైన అన్ని రికార్డులు, పత్రాలు, సమాచారాన్ని అందిస్తామని పేర్కొంది.
విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయనున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే ఈ పరీక్షను నిర్వహించనుంది. రీ-ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ, వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. రాజస్థాన్‌లోని కోటాలో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించారు. కోటాలో కోచింగ్ సెంటర్లు ఇచ్చిన మెటీరియల్‌తో పోలి ఉన్నట్లు తేల్చారు. ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్‌తో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో నీట్ పరీక్షకు 42 గంటల ముందు వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ.30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
22.79 లక్షల మంది హాజరు
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష మే 3న పెన్-అండ్-పేపర్ విధానంలో జరిగింది. భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో కలిపి 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.


